ఆ అధికారికి జైలు శిక్ష సరైందే...

author img

By

Published : May 11, 2022, 5:06 AM IST

హైకోర్టు

అటవీసంరక్షణ ప్రధానాధికారి, ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రతీప్ కుమార్​కు కోర్టుధిక్కరణ కేసులో శిక్ష విధింపుపై అప్పీల్ సందర్భంగా ఇద్దరు జడ్జిలు భిన్న తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి నిర్ణయం వెల్లడించారు. ధర్మాసనంలోని జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా విధించిన వారం జైలుశిక్షను సమర్థించారు. 10 వేల రూపాయల జరిమానాను రెండు వేలకు కుదించారు.

అటవీ సంరక్షణ ప్రధానాధికారి (చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌- సీసీఎఫ్‌), ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఎన్‌.ప్రతీప్‌ కుమార్‌కు కోర్టు ధిక్కరణ కేసులో విధించిన శిక్షపై అప్పీల్‌ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులు భిన్న తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ధర్మాసనంలోని జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా విధించిన వారం రోజుల జైలు శిక్షను ఆయన సమర్థించారు. రూ.10వేల జరిమానాను రూ.2వేలకు కుదించారు. సంశయ లబ్ధి కింద కోర్టు ధిక్కరణ శిక్ష నుంచి ప్రతీప్‌ కుమార్‌కు ఉపశమనం కల్పిస్తూ ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ తీసుకున్న వైఖరితో ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వెసులుబాటు ఇస్తూ తీర్పు అమలును 3 వారాలపాటు సస్పెండు చేశారు. ఈలోగా అప్పీల్‌ చేయకపోయినా, అక్కడ స్టే రాకపోయినా జైలు శిక్షను అనుభవించేందుకు ప్రతీప్‌ కుమార్‌ ఈనెల 27న సాయంత్రంలోగా హైకోర్టు రిజిస్ట్రార్‌ ముందు లొంగిపోవాలని స్పష్టం చేశారు.

ఇదీ నేపథ్యం..
అటవీశాఖలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఎం.జగదీష్‌ చంద్ర ప్రసాద్‌ను 2019 డిసెంబర్లో సస్పెండు చేయగా, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులను 2020 ఆగస్టులో హైకోర్టు నిలిపేసింది. కోర్టు ఉత్తర్వులిచ్చినా తనను ఉద్దేశపూర్వకంగా సస్పెన్షన్‌లోనే ఉంచారని.. అటవీ చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రతీప్‌ కుమార్‌పై జగదీష్‌ చంద్ర ప్రసాద్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు.. ప్రతీప్‌ కుమార్‌కు 4 వారాల సాధారణ జైలు, రూ.2వేల జరిమానా విధిస్తూ 2021 అక్టోబరులో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రతీప్‌ కుమార్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. విచారణ జరిపిన జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా.. వారం జైలు, రూ.10,000 జరిమానా విధించారు. మరో న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ సంశయ లబ్ధి కింద ప్రతీప్‌ కుమార్‌కు ఉపశమనం కల్పించారు. ధర్మాసనంలోని న్యాయమూర్తులు భిన్న తీర్పులిచ్చిన నేపథ్యంలో హైకోర్టు సీజే ఈ వ్యవహారంపై విచారణ బాధ్యతను జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి (థర్డ్‌ జడ్జి)కి అప్పగించారు.

ఇదీ చదవండి: ముగ్గురు ఐఏఎస్​లకు.. జైలుశిక్ష విధించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.