అమ్మఒడి పథకంలో... ఈ ఏడాది లక్షమందికి కోత!

author img

By

Published : Jun 22, 2022, 7:23 PM IST

Ammavodi scheme

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "అమ్మ ఒడి' పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ పథకం అందుకుంటున్న వారిలో.. ఈ ఏడాది లక్షమందికి పైగా లబ్ధిదారులను ప్రభుత్వం అనర్హులుగా తేల్చింది..!

నవరత్నాల్లో ప్రతిష్టాత్మక పథకమైన "అమ్మఒడి" పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేలు మాత్రమే ప్రభుత్వం జమచేయనుంది. అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇదిలా ఉంటే.. ఈ పథకం అందుకుంటున్న లబ్ధిదారుల్లో ఏ ఏడాది భారీగా కోత విధించింది సర్కారు. ఏకంగా.. లక్ష మందికిపైగా లబ్ధిదారులను అనర్హులుగా తేల్చింది. పాఠశాలలకు గైర్హాజరు కావడంతో 51 వేల మందిని ఈ పథకం నుంచి తప్పించిన సర్కారు.. వేర్వేరు కారణాలతో మరో 50 వేల మందికి అమ్మఒడి నిలిపివేసింది.

"విద్యుత్తు వాడకం నెలకు 300యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం అందదు. నవంబరు 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు 75శాతం లేకపోయినా.. అమ్మఒడి ప్రయోజనం పొందలేరు. బియ్యం కార్డు కొత్తది ఉండాలి. కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్‌లో జిల్లా పేరును మార్చుకోవాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు చేసుకోవడం, బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయో లేవో విద్యార్థుల తల్లిదండ్రులు తనిఖీ చేసుకోవాలి’’ అంటూ.. ఈ పథకానికి సంబంధించిన అర్హతలను ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందికి పైగా విద్యార్థులు అమ్మఒడి పథకానికి అనర్హులయ్యారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.