TS Cm Kcr on BJP: భాజపా ముక్త్ భారత్.. తెలంగాణ సీఎం కేసీఆర్​ వైఖరిదే

author img

By

Published : Jan 14, 2022, 9:21 AM IST

TS Cm Kcr

TS Cm Kcr on BJP: కేంద్ర ప్రభుత్వంతో పోరాటం దిశగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాగుతున్నట్లు కనిపిస్తోంది. భాజపా ముక్త్ భారత్ పేరిట భావసారూప్యత కలిగిన పార్టీలతో సమావేశమవుతున్న కేసీఆర్... అధికారిక కార్యక్రమాల విషయంలోనూ అదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ పరిస్థితులపై ప్రధాని నిర్వహించిన సమావేశానికి సీఎం హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.

TS Cm Kcr on BJP: ధాన్యం కొనుగోళ్ల అంశంతో మొదలైన తెరాస, భాజపా మధ్య రాజకీయ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పటికే బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. రైతులు, అన్ని వర్గాల వారు బాగుపడాలంటే కమలం పార్టీని గద్దెదించాల్సిందేనని పిలుపునిచ్చారు. మోదీ సర్కార్ వైఖరికి నిరసనగా దీక్ష కూడా చేశారు. రాజకీయంగా మరో అడుగు ముందుకేసిన సీఎం... భాజపా ముక్త్ భారత్ పేరిట సంప్రదింపులకు శ్రీకారం చుట్టారు.

భాజపా ముక్త్ భారత్...

భాజపా వ్యతిరేక పార్టీలతో తెరాస అధినేత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలతో సమావేశమైన కేసీఆర్... భాజపా ముక్త్ భారత్ అంశంపైనే ప్రధానంగా చర్చించారు. లౌకిక, ప్రజాస్వామిక వాదం లక్ష్యంగా భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి కార్యాచరణ రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. రెండ్రోజుల క్రితం ఆర్జేడీ ముఖ్యనేత, బిహార్ ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. భాజపా వ్యతిరేక పోరాటంలో భాగంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్‌ను తేజస్వి యాదవ్‌తో పాటు ఆయన తండ్రి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఆహ్వానించారు. ఆర్జేడీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

సీఎం గైర్హాజరు...

ఎరువుల ధరల విషయంలోనూ కేంద్ర వైఖరిని తప్పుపడుతూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఓ వైపు రాజకీయంగా ఎదుర్కొంటూనే... పరిపాలనాపరంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోని కొవిడ్ పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని గురువారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు కాలేదు. కీలకమైన సమావేశానికి కేసీఆర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. వ్యూహాత్మకంగానే భేటీలో పాల్గొనలేదని... పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

హరీశ్​రావు కూడా...

దిల్లీలో ఇటీవల జరిగిన రెండు సమావేశాలకు సంబంధించి కూడా ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఆ మరుసటి రోజే జీఎస్టీ మండలి సమావేశం కూడా జరిగింది. రెండింటికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఆర్థికమంత్రి దిల్లీ వెళ్లలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీచూడండి: PM Modi: 'సామాన్యుల ఉపాధిని కాపాడదాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.