సీఐడీ పోలీసుల తీరుపై వర్ల రామయ్య ఆగ్రహం.. డీజీపీకి లేఖ

author img

By

Published : Oct 3, 2022, 12:25 PM IST

TDP VARLA LETTER TO DGP

TDP VARLA LETTER : చింతకాయల విజయ్ వ్యవహారంలో సీఐడీ పోలీసుల తీరుపై తెదేపా నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్​రెడ్డికి లేఖ రాశారు. విజయ్ ఇంట్లో ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని.. సీఐడీ పోలీసులు బ్యాడ్జీలు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు.

TDP VARLA LETTER TO DGP : హైదరాబాద్‌లోని చింతకాయల విజయ్ ఇంటిలో సీఐడీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్​రెడ్డికి లేఖ రాశారు. సీఐడీ పోలీసుల తీరు మానవహక్కుల ఉల్లంఘనేనని లేఖలో తెలిపారు. సీఐడీ పోలీసులు బ్యాడ్జీలు ఎందుకు ధరించలేదని.. చిన్నపిల్లలను ప్రశ్నించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. 41A నోటీసు ఇవ్వడానికి వెళ్లితే.. ఇంట్లో సోదాలు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. విజయ్ డ్రైవర్ చంద్రను కొట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సీఐడీ పోలీసుల్ని సక్రమమైన మార్గంలో పెట్టకుంటే దేశ‌వ్యాప్తంగా నవ్వులపాల‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఏపీ సీఐడీ అధికారులపై చర్య తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో వర్ల రామయ్య కోరారు.

ఇదీ జరిగింది:

సీఎం జగన్‌ సతీమణి భారతిపై అసత్య కథనాలు ప్రచారం చేశారంటూ.. ఐటీడీపీ నేత చింతకాయల విజయ్‌కు నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఐడీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని విజయ్‌ నివాసానికి వచ్చిన పోలీసులు.. బ్యాంకు అధికారులమంటూ హడావుడి చేసి అనధికారికంగా ఇంట్లో సోదాలు చేశారని మండిపడ్డారు. పోలీసులు తనని కొట్టడమేగాక.. విజయ్ ఐదేళ్ల కుమార్తెను బెదిరించారని ఆయన వ్యక్తిగత సహాయకుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్‌ ఇంట్లో లేకపోవడంతో పనిమనిషికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చి వేళ్లారు. ఈనెల 6న మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకాకుంటే.. అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు .

విజయ్‌ను పట్టుకుని తమతో తీసుకెళ్లేందుకే వచ్చిన సీఐడీ పోలీసులు.. ముందురోజే ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయమే రెండు కార్లలో వచ్చిన 14 మంది సీఐడీ పోలీసులు.. వాహనాలు దూరంగా నిలిపివేసి పరిసరాలను పరిశీలించి వెళ్లారు. శనివారం ఉదయం ఒక్కసారిగా 14,15 మంది ఇంట్లోకి ప్రవేశించటంతో విజయ్‌ కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు.

సెల్లార్‌లో ఉన్న విజయ్‌ వ్యక్తిగత సహాయకుణ్ని బెదిరించారు. చెంప మీద కొట్టి తాము బ్యాంకు అధికారులమంటూ ఇంటి తలుపులు తెరిపించారు. పడకగది, వంటగది, అల్మరాల్లో తనిఖీలు చేశారని, ఇంట్లో పిల్లలు, మహిళలున్నా చూడకుండా హల్‌చల్‌ చేశారని, అసలు వచ్చింది పోలీసులా కాదా అనే విషయం తెలియడం లేదని విజయ్‌ కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోదాలు నిర్వహించాలని ఒత్తిడి చేశారంటూ ఆరోపించారు. సాయంత్రం మరోసారి వచ్చి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆరా తీశారు. ఫుటేజ్‌ కావాలంటూ హడావుడి చేశారని తెలిసింది. విజయ్‌ ఇంట్లోకి సీఐడీ అధికారులు చొరబాటుపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు.

సీఎం సతీమణి భారతి గురించి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నందునే విజయ్‌పై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.