విద్యార్థుల గుండె గు'బిల్లు'

author img

By

Published : Sep 27, 2021, 3:49 AM IST

students

ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య అందించేందుకు ప్రారంభించిన 'కార్పొరేట్‌ కళాశాలల పథకం'(corporate colleges scheme) ఆగిపోయింది. దీంతో ఫీజులు చెల్లించేంత వరకు ధ్రువపత్రాలు ఇవ్వబోమని యాజమాన్యాలు చెప్పడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

ప్రైవేటు కళాశాలల్లో చదివించేంత ఆర్థిక స్థోమత లేకున్నా ప్రభుత్వం భరోసా ఇచ్చిందన్న నమ్మకంతో ధైర్యంగా ముందడుగేసిన వారికి కన్నీరే మిగులుతోంది. ‘కార్పొరేట్‌ కళాశాలల పథకం’ బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం వేల మంది బడుగు విద్యార్థులకు ఆర్థికంగా పెను భారమవుతోంది. ఈ పథకం కింద ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ చదివిన 8,200 మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజుల బిల్లు రూ.81 కోట్లు 2019 నుంచి విడుదల కాలేదు. ఫలితంగా విద్యార్థుల కోర్సులు పూర్తయినా.. కళాశాలల యాజమాన్యాలు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు. పూర్తి ఫీజు చెల్లించాలంటు న్నాయి. ఆదుకోవాలంటూ బాధితులు సంక్షేమ శాఖల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పథకం కింద లబ్ధిపొందిన వారంతా నిరుపేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల వారే. పెద్దమొత్తంగా ఫీజులు చెల్లించడం భారమవుతోందని వాపోతున్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన కొందరు బాధితులు ఇటీవల ‘‘స్పందన’’ కార్యక్రమంలో అధికారులకు విన్నవించారు. ఇంజినీరింగ్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలో కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. బకాయిలపై సంక్షేమ శాఖల ఉన్నతాధికారుల్ని ‘ఈనాడు’ సంప్రదించగా.. ఫీజు బిల్లుల్ని ప్రభుత్వానికి సమర్పించామని, నిధుల్లేని కారణంగా చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు.

నిరుపేదలకు వరంలాంటి పథకం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల్లో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య అందించాలన్న లక్ష్యంతో 2011లో కార్పొరేట్‌ కళాశాలల పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో విద్యార్థికి ఫీజు కింద ఏడాదికి రూ.30 వేలు, పాకెట్‌మనీగా రూ.3 వేలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే... 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఈ పథకాన్ని నిలిపేసింది. 2019-20లో ఇంటర్‌ తొలి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు మాత్రమే సాయం అందించాలని, రెండో సంవత్సరం వారికి రెన్యువల్‌ చేయొద్దంటూ గతంలో ఉత్తర్వులిచ్చింది.

ధ్రువపత్రాలు ఇచ్చేది లేదంటున్నారు..

కార్పొరేట్‌ కళాశాలల పథకం కింద విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో బైపీసీ పూర్తి చేశా. ధ్రువపత్రాలు ఇవ్వాలని కళాశాలను సంప్రదించగా.. ప్రభుత్వం ఫీజు చెల్లించలేదని, ఆ మొతాన్ని మమ్మల్నే చెల్లించమన్నారు. పాడేరు ఐటీడీఏ అధికారుల్ని అడిగితే ధ్రువపత్రాలు ఇవ్వాలంటూ సిఫారసు లేఖ ఇచ్చారు. ఏ లేఖ తీసుకొచ్చినా డబ్బు చెల్లించకుండా ధ్రువపత్రాలను ఇవ్వబోమని తిప్పిపంపారు. - శ్రావణి, కీచుమండ, విశాఖపట్నం

కార్పొరేట్‌ విద్య ఉచితమనే చేర్పించాం..

మా అమ్మాయి పదోతరగతిలో మంచి మార్కులు సాధించింది. ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుందని అధికారులు చెప్పడంతో మా అమ్మాయిని విశాఖలోని ఓ కళాశాలలో చేర్పించాం. రెండేళ్ల చదువయ్యాక రూ. 70వేలు చెల్లించి ధ్రువపత్రాలు తీసుకెళ్లండని కళాశాల సిబ్బంది చెబుతున్నారు. - సత్యనారాయణ, విద్యార్థిని తండ్రి, కొయ్యూరు, విశాఖపట్నం

ఇదీ చదవండి:

GULAB EFFECT: తీరం దాటిన గులాబ్‌ తుపాను..గాలుల బీభత్సం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.