గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ఫలితాల వెల్లడిపై.. హైకోర్టులో వాదనలు పూర్తి

author img

By

Published : Jun 23, 2022, 7:55 AM IST

HIGH COURT

HIGH COURT ON GROUP-1: గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా అవకతవకలు జరిగాయని, అందువల్ల ఇంటర్వ్యూలు నిర్వహించినా వాటి ఫలితాలను ప్రకటించకుండా నిలువరించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిల్ వేశారు. వీటిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ తర్లాడ రాజశేఖర్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు పూర్తవడంతో తీర్పును వాయిదా వేసింది.

HIGH COURT ON GROUP-1: గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా అవకతవకలు జరిగాయని, అందువల్ల ఇంటర్వ్యూలు నిర్వహించినా వాటి ఫలితాలను ప్రకటించకుండా నిలువరించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టును కోరారు. ఫలితాలు ప్రకటించినా.. నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూల్యాంకనంలో అవకతవకలపై దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. గ్రూప్‌-1 పోస్టుల ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియ కొనసాగించుకోవచ్చని, తుది ఎంపిక ఫలితాలు రిట్‌ పిటిషన్లలో కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయని ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీలు వేశారు. వీటిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ తర్లాడ రాజశేఖర్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు పూర్తవడంతో తీర్పును వాయిదా వేసింది. ఇంటర్వ్యూలో ఎంపికయ్యే అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది తదితర వివరాలను తెలియజేయాలని ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాదిని కోరింది.

అప్పీలుదారుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, జంధ్యాల రవిశంకర్‌, కె.ఎస్‌.మూర్తి, ఎ.సత్యప్రసాద్‌, న్యాయవాది కంభంపాటి రమేశ్‌బాబు తదితరులు వాదనలు వినిపించారు. ‘గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు జరిగాయి. తొలుత డిజిటల్‌ మూల్యాంకనంలో 326 మంది అభ్యర్థులను ఏపీపీఎస్సీ అర్హులుగా తేల్చింది. హైకోర్టు ఆదేశాలతో తర్వాత మాన్యువల్‌గా చేసిన మూల్యాంకనంలో 326లో 202 మందిని (62%) అనర్హులుగా నిర్ణయించారు. ఇంతమంది అర్హత కోల్పోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. నచ్చిన వారిని ఎంపిక చేసుకోవడం కోసం అక్రమాలకు పాల్పడ్డారు. దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూ నిర్వహణ అనంతరం ఫలితాలను ప్రకటించకుండా నిలువరించండి. రిట్‌ పిటిషన్లపై తుది విచారణకు ఆదేశించండి’ అని కోరారు.

ప్రక్రియను నిలువరిస్తే ప్రయోజనం ఉండదు: ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. నిబంధనలకు అనుగుణంగా మూల్యాంకనం జరిగిందన్నారు. అర్హత సాధించలేనివాళ్లే హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఇంటర్వ్యూలు ఈ నెల 29తో ముగుస్తాయన్నారు. సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్యాల తుది విచారణ జరిగేలా ఆదేశించాలని కోరారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిలువరించడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. ఇంటర్వ్యూ తర్వాత ఫలితాలు ప్రకటించకుండా నిలువరించడం లేదా ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా నిలిపివేస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులపై చర్చించింది. ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులిస్తామంటూ తీర్పును రిజర్వు చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.