Sarpanches protest in ap: సర్పంచుల ఆగ్రహం.. రాజీనామా చేస్తామని హెచ్చరిక.. ఎందుకంటే?

author img

By

Published : Nov 23, 2021, 6:01 PM IST

Updated : Nov 23, 2021, 7:51 PM IST

sarpanches protest in ap on funds take back

గ్రామ పంచాయతీల ఖాతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం(ap govt) నిధులు వెనక్కి తీసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం తీసుకున్న నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Sarpanches protest in ap: సర్పంచుల ఆగ్రహం.. రాజీనామా చేస్తామని హెచ్చరిక.. ఎందుకంటే?

సంక్షేమ పథకాలలో సర్పంచుల పాత్ర లేకుండా చేయడాన్ని ఖాజీపేట మండలంలోని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నిరసనగా వైకాపాకు రాజీనామా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. కడప జిల్లా ఖాజీపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన మండలంలోని 21మంది సర్పంచులకు 20 మంది సర్పంచులు సమావేశంలో పాల్గొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు లేకుండా ప్రభుత్వం దారి మళ్లించి పంచాయతీ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేకుండా చేయడాన్ని నిరసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎనిమిది నెలలుగా సర్పంచులు సచివాలయ నిర్వహణ ఖర్చు, శానిటేషన్, తాగునీటి పథకాల మరమ్మతులు, వీధి దీపాలు, విద్యుత్తు బిల్లులు లేకుండా సొంత నిధులు ఖర్చు పెట్టారన్నారు. ఇంతవరకు బిల్లులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. ఇక గ్రామాల్లో పారిశుద్ధ్య, తాగునీటి పథకాల మరమ్మతులు చేపట్టకుండా బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.

రూ.మూడు వేల కోట్లు తీసుకుంది..

గ్రామపంచాయతీల నిధులు సుమారు రూ. 3 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. 6 నెలల క్రితం ఇదేవిధంగా ప్రభుత్వం రూ.450 కోట్లు తీసుకుందన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామ పంచాయతీలకు పంపిందన్నారు. ఆ నిధులు ఇచ్చేయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన..

గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న 15వ ఆర్థిక సంఘ నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంపై గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో పలు గ్రామాల సర్పంచులు భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. దుకాణాలకు, ఇళ్లకు, బ్యాంకుల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. గ్రామ పంచాయతీల నుంచి ఒక్క పైసా ఖర్చు చేయాలంటే తీర్మానం చేశాక నిధులు తీసుకోవాలని.. సర్పంచులకు ఒక్క మాట చెప్పకుండా దోపిడీ చేసినట్లుగా పంచాయతీ ఖాతాలలో నిధులు ప్రభుత్వం స్వాహా చేయడం దారుణం అన్నారు.

వట్టిచెరుకూరులో 14వ ఆర్థిక సంఘ నిధులు రూ. 24 లక్షలు, 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.10 లక్షలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పల్లపాడులో రూ.14 లక్షలు వెనక్కి వెళ్లాయి. సౌపాడులో రూ. 3 లక్షల నిధులు వెనక్కి తీసుకోవడంతో పంచాయతీ ఖాతాలలో సున్నా చూపిస్తుందని సర్పంచి వాపోయారు.

సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన..

గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇతర వ్యవహారాల కోసం తీసుకుంటుందని పెనుకొండ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సర్పంచులు మంగళవారం పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీరు, మురుగు కాలువలు శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, వీధి దీపాల మరమ్మతులు లాంటి సమస్యలను కూడా పరిష్కరించేందుకు సర్పంచులకు నిధులు లేకుండాపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామపంచాయతీల ఖాతాల్లో నిధులు వెనక్కి తీసుకోవడంపై తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని సర్పంచులు స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. మామిడికుదురు మండలంలో రూ.88లక్షలు, రాజోలు మండలంలోని మేజర్, మైనర్ పంచాయితీల్లో సుమారు రూ. 45లక్షల వెనక్కి తీసుకున్నట్లు సర్పంచులు చెప్పారు.

ఇదీ చదవండి:

FLOOD VICTIMS PROTEST: 'నష్టపోయాక పర్యటిస్తారా ?'..మంత్రి బాలినేనిపై వరద బాధితుల ఆగ్రహం

Last Updated :Nov 23, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.