సంక్రాంతికి తప్పని తిప్పలు.. నాలుగు నెలల ముందే అయిపోయిన టిక్కెట్లు

author img

By

Published : Sep 17, 2022, 6:40 AM IST

NO TICKETS FOR SANKRANTI IN TRAINS

NO TICKETS FOR SANKRANTI TRAINS : ఈసారి సంక్రాంతికి సొంతూరికి వెళ్దామనుకుంటున్నారా..? అందుకు రైల్లో బెర్తుల కోసం ప్రయత్నిస్తున్నారా..? అయితే మీరు నిరాశ ఎదురవడం ఖాయం. ఎందుకంటే అన్ని రైళ్లలో ఇప్పటికే బెర్తులు నిండిపోయాయి. చాంతాండంత వెయిటింగ్‌ లిస్టు దర్శనమిస్తోంది.

NO TICKETS FOR SANKRANTI : తెలుగు లోగిళ్లలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఎక్కడ ఉన్నా సరే.. వీలు చూసుకుని మరీ అందరూ ఆ సమయానికి సొంతూళ్లకు బయలుదేరతారు. వచ్చే ఏడాది జనవరి 14, 15 తేదీల్లో వచ్చే సంక్రాంతి పండుగకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇప్పటినుంచే పెద్దఎత్తున సిద్ధమయ్యారు. హైదరాబాద్‌ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ముందస్తుగా బెర్తులు బుకింగ్‌ చేసుకున్నారు.

ఈ సారి శని, ఆదివారాల్లో భోగి, సంక్రాంతి వస్తుండటం, ముందుగానే పిల్లలకు సెలవులు ఇస్తున్నందున పెద్దఎత్తున ప్రజలు సొంతూళ్లకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం రైళ్లలో బెర్తులన్నీ బుకింగ్‌ చేసుకోవడంతో.. గంటల వ్యవధిలోనే బెర్తులన్నీనిండిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 10,11,12,13 తేదీల్లో ఏ రైళ్లోనూ ఖాళీ బెర్తు కనిపించని పరిస్ధితి ఉంది. హైదరాబాద్‌ నుంచి విశాఖ, విజయవాడ, కాకినాడ,ఏలూరు, రాజమహేంద్రవరం, నర్సాపురం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో.. 200 నుంచి 500 పైగా వెయిటింగ్‌ లిస్ట్‌ కనిపిస్తోంది.

రైలు బయలుదేరేందుకు ముందు రోజు ఓపెన్‌ అయ్యే తత్కాల్ టికెట్లపైనే చాలా మంది ఆధారపడి ఉన్నారు. అందులోనైనా టికెట్‌ దొరుకుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. అవీ దొరకని వారు ఇక ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వెళ్లాల్సిందే. ఆర్టీసీ బస్సుల్లో 90 రోజుల ముందే టికెట్లు బుకింగ్‌ చేసుకునే సదుపాయం ఉంది. అక్టోబర్‌ 13 నుంచి రిజర్వేషన్లు ప్రారంభమవుతాయి. వీటిలో టికెట్లు బుకింగ్‌ చేసుకునేందుకు అంతా ఎదురు చూస్తున్నారు. ఆ బస్సులూ సరిపోని పరిస్ధితుల్లో ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది.

పండుగ సీజన్‌లో ఆర్టీసీతో పాటు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులూ నిండిపోతాయి. దీంతో ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50 శాతం ఛార్జీ చెల్లించి వెళ్లాల్సిన పరిస్ధితి. ప్రైవేటు బస్సుల్లో ఈ సారీ సొంతూళ్లకు వెళ్లడమంటే రెట్టింపు ఛార్జీలు పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. సొంత వాహనాల్లో వెళ్లాలనుకునే వారికి డీజిల్‌ ఖర్చుల బాదుడుతో భారీగా ప్రయాణ భారం తప్పదు. ఇక చివరిగా పండగ సీజన్‌ దృష్ట్యా రైల్వేశాఖ ఏమైనా ప్రత్యేక రైళ్లు నడిపితే వాటిలో టికెట్లు బుక్‌ చేసుకుందామని మరికొందరు ఎదురు చూస్తున్నారు. అవీ లేనిపక్షంలో ప్రయాణికుల జేబులు ఖాళీ కాక తప్పని పరిస్ధితి.

సంక్రాంతికి తప్పని తిప్పలు.. నాలుగు నెలల ముందే అయిపోయిన టిక్కెట్లు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.