అగ్నిపథ్‌ నిరసనలపై ముమ్మర దర్యాప్తు.. సుబ్బారావు పాత్రపై లోతుగా ఆరా..

author img

By

Published : Jun 19, 2022, 3:35 AM IST

police investigation on agnipath protests in telugu states

అగ్నిపథ్‌ నిరసనల పర్వంలో నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు పాత్రపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్‌ హింసాత్మక ఘటన తర్వాత నిరుద్యోగులు.. గుంటూరు, విజయవాడ రైల్వేస్టేషన్ల విధ్వంసానికి కుట్ర పన్నారని వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చిన సమాచారంతో.. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సాయిడిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు, విశ్రాంత సైనికాధికారి ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇందులో సుబ్బారావు పాత్ర ఎంతవరకు ఉందనే అంశమై ఆరా తీస్తున్నారు.


సైనిక నియామకాల్లో అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం కుట్రపూరితమని రైల్వే పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ విధానం అమల్లోకి వచ్చాక సైన్యానికి ఎంపికైనా.. నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులుగా మారిపోతామని... కేంద్ర ప్రభుత్వ ఆస్తులు, రైల్వేస్టేషన్లను ధ్వంసం చేయడం ద్వారా దీన్ని అడ్డుకోవాలని.. ఆర్మీ అభ్యర్థులు నిర్ణయుంచుకున్నట్లు.. పోలీసులు గుర్తించారు. అగ్నిపథ్ ప్రకటన వచ్చిన వెంటనే వీరంతా ఒకసారి... వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకున్నారని గుర్తించారు. సికింద్రాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ, విశాఖ రైల్వేస్టేషన్లలోనూ విధ్వంసం సృష్టించాలని ప్రణాళిక రచించినట్లు సాంకేతిక ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్‌ ఘటనలో మొత్తం 46 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. కొందరి ఫోన్లను స్వాధీనం చేసుకుని.. కుట్రకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించారు. ఆందోళనకారులు వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లోని 12 డిఫెన్స్ అకాడమీల్లో శిక్షణ పొందుతున్నట్లు గుర్తించారు. ఈ నెల 15 నుంచి 17 మధ్య వీరు ఎవరెవరితో మాట్లాడారు? హైదరాబాద్‌ ఎలా వచ్చారు వంటి వివరాలను... అరెస్టయిన వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఎంపికైన వారికి డిఫెన్స్ అకాడమీలు శిక్షణ ఇస్తాయని... తొలుత ఫీజు తీసుకోరని, ఉద్యోగం వచ్చాక లక్ష నుంచి 2 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారని గుర్తించారు. అగ్నిపథ్‌ పథకం నేపథ్యంలో.. సైన్యంలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపరన్న భావనతోనే డిఫన్స్ అకాడమీల డైరెక్టర్లలో కొందరు... ఈ విధ్వంస రచనకు పరోక్షంగా సహకారమందించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సికింద్రాబాద్‌ విధ్వంసం వెనక నరసరావుపేటలో డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్న సుబ్బారావు పాత్ర కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానించి.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విధ్వంసం సృష్టించేందుకు ఆర్మీ అభ్యర్థులకు సుబ్బారావు ఆర్థిక సాయం చేశాడా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరింస్తున్నారు. తమ ఆందోళనకు మద్దతు పలికేందుకు సుబ్బారావు హైదరాబద్‌ వచ్చారంటూ ఒక వాట్సాప్ గ్రూప్‌లోని పోస్టుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసంలో పాల్గొని... పోలీసులకు చిక్కిన అభ్యర్థుల సమాచారంతో... శనివారం ఉదయాన్నే సుబ్బారావును... తన స్వస్థలం ప్రకాశం జిల్లా కంభంలో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నరసరావుపేటకు తీసుకొచ్చి దర్యాప్తు కోసం నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. రైల్వేస్టేషన్లను ఎందుకు లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చింది?.., ఎన్ని రోజుల నుంచి దీనికి వ్యూహ రచన జరిగింది?.., దీని వెనుక ఇంకెవరు ఉన్నారు?.., విధ్వంసంలో పాల్గొన్న వారంతా సైనిక నియామకాల కోసం ప్రయత్నిస్తున్నవారేనా?.., బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?.., అంతమంది స్టేషన్‌కు చేరుకోవడానికి ఎలా సమాచారం పంచుకున్నారు?.., వాట్సాప్‌ గ్రూపుల్లో ఎక్కడెక్కడి నుంచి సమాచారం అప్‌లోడ్‌ చేశారు?.., ఆ ఫోన్లు ఎవరివని... సుబ్బారావుకు ప్రశ్నలు సంధించి సమాచారం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది.

నరసరావుపేటతోపాటు హైదరాబాద్‌ బోడుప్పల్‌ ప్రాంతంలోనూ ఈ ఏడాది మే నుంచి ఒక శిక్షణ కేంద్రాన్ని ఆవుల సుబ్బారావు ప్రారంభించారు. సైనిక నియామకాలకు శిక్షణ ఇస్తున్నారు. సికింద్రాబాద్‌ ఘటన వెనక, ఆ తర్వాతి విధ్వంసానికి లక్ష్యంగా చేసుకున్న గుంటూరు, విజయవాడ రైల్వేస్టేషన్లకు యువకులు చేరుకునేలా... సుబ్బారావు క్రియాశీలకంగా వ్యవహరించి ఉండొచ్చన్నది పోలీసుల అనుమానం. తొలుత పోలీసులు... నరసరావుపేట రావిపాడు రోడ్‌లో ఉన్న అకాడమీకి వెళ్లగా అక్కడ లేకపోవడంతో... రామిరెడ్డిపేటలోని అతడి నివాసం వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా లేరని తెలుసుకుని స్వస్థలం ప్రకాశం జిల్లా స్వస్థలం కంభం వెళ్లి.. అక్కడ సుబ్బారావును రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని నరసరావుపేటకు తీసుకొచ్చి... రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఆయన మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అకాడమీలో తనిఖీలు చేసి.. ప్రస్తుతం అక్కడ ఎంత మంది శిక్షణ పొందుతున్నారు.., వారి వివరాలు, గతంలో శిక్షణ పొంది నిరుద్యోగులుగా ఉంటూ పదేపదే నియామకాల కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు..? వంటి సమాచారం సేకరించారు.

ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెళ్లకు చెందిన ఆవుల సుబ్బారావు... ఆర్మీలో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా చేరి అధికారి హోదాలో.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసి... 2012లో విరమణ పొందారు. కొంతకాలం గుంటూరులో ఉండి... 2014లో నరసరావుపేటలోని రావిపాడు రోడ్‌లో సాయిడిఫెన్స్ అకాడమీని ప్రారంభించారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన యువకులు ఎక్కువగా ఇక్కడ శిక్షణ తీసుకుంటారని.. తెలుస్తోంది. సైనిక ఉద్యోగమే కలగా ఉన్న యువకులకు వసతి కల్పించి.. శిక్షణ ఇచ్చేవారు. రెండేళ్లుగా కొవిడ్ కారణంగా... అకాడమీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కరోనా తగ్గుముఖం పట్టాక.. ఆర్థిక సమస్యల్ని అధిగమించడానికి ఈ ఏడాది హైదరాబాద్‌లో మరో అకాడమీ ఏర్పాటుచేశారు. ఆర్మీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావడం, ఎంపికల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడం, నియామకాలు వాయిదాలు పడటంతో... హైదరాబాద్‌లోకి శిక్షణ కేంద్రాన్ని మూసివేశారు. నిరుద్యోగులే కాదు.. ఆర్మీ నియామకాల విషయంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులకు తోడు... అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకురావడంతో.... ఆయన విసిగిపోయి... విద్యార్థులతో కలిసి ఈ కుట్రకు తెరతీశారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా సుబ్బారావును గుంటూరు రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చి.. ఎక్కడ విధ్వంసానికి కుట్రపన్నారో.. ఆ ప్రదేశాన్ని చూపమని కోరినట్లు తెలిసింది. పూర్తిస్థాయి విచారణకు సుబ్బారావును.. సికింద్రాబాద్ పోలీసులకు అప్పగించనున్నారని సమాచారం.

సికింద్రాబాద్‌ ఘటనలో ఆవుల సుబ్బారావుపై.. ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లలో సుబ్బారావు ప్రధాన పాత్ర ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాల మేరకే.... ఆయన్ని పోలీస్‌స్టేషన్‌కి తీసుకొచ్చి విచారించామని తెలిపారు. సుబ్బారావు కుట్రకు పాల్పడినట్లు, వాట్సాప్‌ సందేశాలు పంపినట్లు.. సాంకేతికంగా ఇంకా నిర్ధరణ కాలేదని చెప్పారు. ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. సుబ్బారావు చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ అంశంపై మరింత లోతుగా విచారిస్తామన్నారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తరహాలో రాష్ట్రంలోని కొన్ని స్టేషన్‌లలోనూ భారీ విధ్వంసాలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో.. విశాఖ, విజయవాడ, విజయనగరం సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అప్పమత్తమయ్యారు. శనివారం.. రైల్వేస్టేషన్ల ముందు కంచెలు ఏర్పాటు చేసి... వచ్చిన ప్రయాణికులందరినీ తనిఖీలు చేశాకే స్టేషన్లలోకి అనుమతించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.