శిథిలావస్థలో పలు వంతెనలు.. బిక్కుబిక్కుమంటూ వాహనదారుల రాకపోకలు

author img

By

Published : Oct 3, 2022, 10:17 AM IST

Crumbling Bridges

Bridges : రాష్ట్రవ్యాప్తంగా అనేక వంతెనలు శిథిలమై ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. దశాబ్దాల తరబడి ఈ వంతెనలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. పూర్తిగా శిథిలమైనవాటి స్థానంలో కొత్తవి నిర్మించడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని.. ప్రమాదం అంచున ప్రయాణం చేయాల్సి వస్తోంది. కొన్ని చోట్ల బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన వంతెనలపైనే ఇంకా రాకపోకలు సాగుతున్నాయి. ఏ క్షణంలో ఏ వంతెన కూలుతుందో అన్నట్టు పరిస్థితి తయారైంది.

Crumbling Bridges : రాష్ట్రవ్యాప్తంగా శిథిల వంతెనలు ప్రజలను భయపెడుతున్నాయి. మరీప్రమాదకరంగా ఉన్న కొన్ని చోట్ల అధికారులు మొక్కుబడిగా మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ప్రాజెక్టులో భాగంగా 470 వరకు వంతెనల పునరుద్ధరణ, పునః నిర్మాణానికి అధికారులు గతంలో ప్రతిపాదించారు. తొలి దశలో 206 వంతెనల పనులకు టెండర్లు పిలిచి, గుత్తేదారులకు పనులు అప్పగించినా వీటిలో పురోగతి కనిపించడం లేదు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు వద్ద బాహుదా నది ఉప్పుటేరుపై 19 ఏళ్ల కిందట నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. రెయిలింగ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సిమెంటు పెళ్లలు ఊడిపోయి ఇనుప చువ్వలు బయటకొచ్చాయి. ఉప్పుటేరు అవతల ఉన్న పది తీర ప్రాంత గ్రామాలకు చెందిన 4 వేల మంది మత్స్యకారులు దీనిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.

కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ముంగండ-కె.ముంజవరం రహదారిలోని వంతెన పునాదులు బీటలువారాయి. స్థానికులు కర్రలతో తాత్కాలిక రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇది కూలితే పి.గన్నవరం, అంబాజీపేట, అమలాపురం మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు తప్పవు.

బాపట్ల జిల్లా చినగంజాం మండలం సంతరావూరు వద్ద కొమ్మమూరు కాలువపై వంతెనకు రెండేళ్ల కిందటే పగుళ్లు వచ్చాయి. అప్పట్లో తాత్కాలికంగా మరమ్మతు చేశారు. రెండు నెలల కిందట పగుళ్లు పెద్దగా ఏర్పడి, శ్లాబులోని ఇనుప చువ్వలు బయటకొచ్చాయి. బస్సులు, లారీలు వంటి పెద్ద వాహనాలు వెళ్లకుండా నిషేధించారు. ఆటోలు, బైక్‌లు వెళ్లేందుకు, కొంత దారి వదిలారు. ఇంకొల్లు, చినగంజాం, వేటపాలెం, చీరాల ప్రాంతాలకు చెందిన 50 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

పల్నాడు జిల్లా ఈపూరు మండలంలోని అగ్నిగుండాల సమీపంలో పెరుమాళ్లపల్లి మేజరు కాల్వపై ఉన్న వంతెనకు రెయిలింగ్స్‌ ఊడిపోయి ప్రమాదకరంగా మారింది. వంతెన ఇరుకుగా ఉండటం ఒక పక్క రెయిలింగ్స్‌ లేకపోవడంతో గతంలో ఓ యువకుడు కిందపడి చనిపోయాడు. ఎన్నో పశువులు కూడా కాల్వలోపడి మరణించాయి.

చిత్తూరు జిల్లా పుంగనూరు లో 50 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనకు ఇప్పటివరకూ శాశ్వత మరమ్మతులు చేయలేదు. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. వాహనంతోపాటు వాగులో పడాల్సిందే. తిరుపతి గ్రామీణ మండల పరిధిలో స్వర్ణముఖి నదిపై ఉన్న నాలుగు వంతెనలు కూలిపోయాయి. తిరుచానూరు-పాడిపేట మధ్య తాత్కాలిక వంతెన నిర్మించడంతో రాకపోకలు సాగిస్తున్నారు. భారీ వర్షాలు కురిసి, నదికి వరదొస్తే రాకపోకలు నిలిచే పరిస్థితి ఉంది.

శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో మద్దిలేరు వాగుపై ఉన్న ప్రధాన వంతెన వరదలకు కుంగి.. కొంతభాగం కొట్టుకుపోయింది. అధికారులు దీన్ని మట్టితో పూడ్చి చేతులు దులిపేసుకున్నారు. 10 గ్రామాల ప్రజలు కుంగిన వంతెనమీదే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు రద్దు చేయడంతో స్థానికులు, విద్యార్థులు ఆటోల్లో బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు.

ఇదీ కర్నూలు జిల్లా ఆస్పరి నుంచి యాటకల్లు వెళ్లే పంచాయతీరాజ్‌ రహదారిలో ఉన్న వంతెన దుస్థితి. యాటకల్లు, తొగలగల్లు, తంగరడోన, దొడగుండ, కలపరి, గార్లపెంట గ్రామాల ప్రజలు ఈ మార్గంలోనే ఆస్పరికి వెళ్తారు. ఈ వంతెన కోసం కొద్దిరోజుల కిందట పంచాయతీరాజ్‌శాఖ 80 లక్షలతో ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. శిథిలావస్థలో ఉన్న వంతెనలు ఎన్నో. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఎన్ని వంతెనలు ఉన్నాయి? శిథిలమైనవి ఎన్ని, వెంటనే మరమ్మతులు, పునఃనిర్మాణం చేయాల్సినవి ఎన్ని? అనే లెక్కలు కూడా అధికారుల వద్ద లేవంటే.. వంతెనలపై శ్రద్ధ ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏవంతెన ఏ నిమిషంలో కూలుతుందోనన్న ఆందోళనతోనే ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.