రానున్న రెండేళ్లలో దళితుల అభివృద్ధికి రూ.40వేల కోట్లను ఖర్చు చేస్తాం: మంత్రి పినిపే విశ్వరూప్‌

author img

By

Published : Nov 25, 2021, 7:51 AM IST

మంత్రి పినిపే విశ్వరూప్‌

దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019జూన్‌ నుంచి అక్టోబరు, 2021 వరకు రూ.36,605 కోట్లు ఖర్చు పెట్టినట్లు మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే రుణాలు నిలిపి వేస్తున్నారని, ఇతర పథకాలు కొనసాగడం లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ..ఇది వాస్తవం కాదన్నారు.

దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019జూన్‌ నుంచి అక్టోబరు, 2021 వరకు రూ.36,605 కోట్లు ఖర్చు పెట్టినట్లురాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. రానున్న రెండేళ్లలో రూ.40వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. శాసనసభలో బుధవారం ‘షెడ్యూల్డ్‌ కులాలు-సంక్షేమం’పై లఘు చర్చ జరిగిందని ఈనాడు కథనంలో పేర్కొంది.

యథావిధిగా పథకాలు
‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌’ (బీఏఎస్‌) పథకం మినహా మిగిలిన పథకాలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. శాసనమండలి సభ్యులు చేసిన సూచన మేరకు బీఏఎస్‌ పథకం అమలును నిలిపేసినట్లు తెలిపారు. విదేశీ విద్య పథకం కింద ఎంబీబీఎస్‌ చదివేందుకు కొందరు కజకిస్థాన్‌ వంటి దేశాలకు వెళ్తున్నారని అయితే అక్కడ విద్యా ప్రమాణాలు సక్రమంగా లేవన్నారు. అందువల్ల తొలి 100 ఉత్తమ విద్యా సంస్థలుగా గుర్తింపు పొందిన వాటిల్లోనే విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారన్నారు.

నిరుద్యోగ యువతకు శిక్షణ

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే రుణాలు నిలిపి వేస్తున్నారని, ఇతర పథకాలు కొనసాగడం లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ..ఇది వాస్తవం కాదన్నారు. నిరుద్యోగులకు బ్యాంకింగ్‌ ఉద్యోగాల కోసం తిరుపతిలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విశాఖలో సివిల్‌ సర్వీస్‌, గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాల కోసం విజయవాడలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రకాశం, కృష్ణా జిల్లాలో లిడ్‌క్యాప్‌, పాదరక్షల తయారీ యూనిట్లలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మినీ లెదర్‌ పార్కులను పునరుద్ధరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా కోర్టును ఏర్పాటుచేశామని తెలిపారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ కులగణన సమయంలో ఎస్సీ, ఎస్టీల గురించి కూడా ప్రత్యేకంగా వివరాలు సేకరించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో దళితులు అణచివేతకు గురయ్యారని మరో ఎమ్మెల్యే నాగార్జున ఆరోపించారు. ఎమ్మెల్యేలు శ్రీదేవి, జోగారావు, చిట్టిబాబు, ఎలిజా, అర్థర్‌, మాట్లాడుతూ సీఎం జగన్‌ దళితుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో వివరించాలి

సాంఘిక సంక్షేమ శాఖ తరపున చేపట్టిన పథకాల ప్రాధాన్యం గురించి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని మంత్రి విశ్వరూప్‌కు సభాపతి తమ్మినేని సీతారాం సూచించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి చాలామందికి తెలియని పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.

ఇదీ చదవండి: Chandrababu Naidu tour: 'బాధితులు నిద్రలేని రాత్రులు గడుపుతుంటే.. వైకాపా మొద్దునిద్రపోతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.