'నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఆస్పత్రుల్లో బసవతారకం ఒకటి'

author img

By

Published : Jun 22, 2022, 10:56 PM IST

Basavatarakam Hospital

Basavatarakam Hospital: నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఆస్పత్రుల్లో బసవతారకం ఒకటని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. ఆరోగ్యశ్రీతో భారీగా నిధులు డ్రా చేసిన ఆస్పత్రి బసవతారకమని కొనియాడారు. క్యాన్సర్‌ని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని తెలిపారు. హైదరాబాద్​లో జరిగిన ఆస్పత్రి 22వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

'నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఆస్పత్రుల్లో బసవతారకం ఒకటి'

Basavatarakam Hospital: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనితీరుపై తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్పత్రి 22వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి... ఎన్టీఆర్ అన్నా, బసవతారకం ఆస్పత్రి అన్నా ముఖ్యమంత్రి కేసీఆర్​కి ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. ముందుగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక రేడియాలజీ పరికరాలను ప్రారంభించిన మంత్రి.. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేస్తున్న అతి కొద్ది ఆస్పత్రుల్లో బసవతారకం ఆస్పత్రి ఒకటని హరీశ్ రావు పేర్కొన్నారు. పేదలకు ఎనలేని సేవ చేస్తున్న బసవతారకం ఆస్పత్రికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

టి డియాగ్నోస్టిక్స్ ద్వారా 35 ఏళ్లు పైబడిన వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కీమో, రేడియో థెరపీ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వచ్చే 3 నెలల్లో ఎంఎన్‌జేలో 300 పడకలు అదనంగా సిద్ధం చేశామని వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో క్యాన్సర్ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఎన్టీఆర్​ అంటే కేసీఆర్​కు ఎనలేని అభిమానం. ఈ ఆస్పత్రి పక్కనే ఉండేవాళ్లం. నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఆస్పత్రుల్లో బసవతారకం ఒకటి. చాలా సందర్భాల్లో పేదవాళ్లకు మేలు జరిగింది. ఆరోగ్యశ్రీతో భారీగా నిధులు డ్రా చేసిన ఆస్పత్రి బసవతారకం. క్యాన్సర్‌ని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. - హరీశ్‌రావు, తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి

రెండు రాష్ట్రాల్లోనూ నిమ్స్ తర్వాత ఎక్కువ పేషంట్స్ ఉండేది మన ఆస్పత్రిలోనే. మనది సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రి. మనం ప్రత్యేకంగా వార్డులు ఆరోగ్యశ్రీ పేషంట్ల కోసమే కేటాయించడం జరిగింది. ఎంతో మంది దాతలు అండగా నిలబడి ముందుకు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు.

- బాలకృష్ణ, బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్

బిల్డింగ్ రెగ్యులేషన్ పనుల్లో భాగంగా ప్రభుత్వాన్ని కలిసినప్పుడు సుమారు ఆరు కోట్ల బకాయిలను రద్దు చేశారని ఆస్పత్రి ఛైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. రోగులకు సేవ అందించటంలో సర్కారు పూర్తి సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, సీఈఓ డాక్టర్ ప్రభాకర్ రావు, ఎంపీ, ఆస్పత్రి బోర్డ్ సభ్యులు నామ నాగేశ్వర రావు, జేఎస్ ఆర్ ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.