తాళికట్టు 'శ్రావణ' వేళ.. మెడలో 'కల్యాణ' మాల..!

author img

By

Published : Jul 31, 2022, 11:13 AM IST

weddings

Sravanamasam weddings: తెలంగాణలో నేటి నుంచి భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. శ్రావణమాసం రావడంతో ఆగస్టు నెలలో పెద్ద సంఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు. ఈ ముహూర్తాలు దాటితే.. మళ్లీ నాలుగు నెలల వరకు మంచి ఘడియలు లేకపోవడంతో ఉన్న ఈ శుభ ముహూర్తాల్లోనే తమ పిల్లలను ఓ ఇంటివారిని చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.

Sravanamasam weddings: ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి. ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు. ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జులై 31, ఆగస్టు 1, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 16, 17, 20, 21 తేదీల్లో అధిక ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత 4 నెలల వరకు ఎదురుచూడాల్సి ఉండటంతో ఆగస్టులోనే పిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. 6వ తేదీ రాత్రి ముహూర్తాలు భారీగా ఉన్నాయి.

...

గతానికి భిన్నంగా..

శ్రావణంలో కుదరకపోతే సాధారణంగా కార్తికమాసంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేవారు. జులై, ఆగస్టులలో వానల భయంతో అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చే కార్తికంలోని ముహూర్తాలకే ప్రాధాన్యమిచ్చేవారు. కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి. కార్తీక మాసంలో శుక్ర మూఢాలు రావడంతో ముహూర్తాలు లేవని పురోహితులు చెబుతున్నారు. ఇప్పుడు కాకపోతే డిసెంబరులో వచ్చే మార్గశిరం వరకు ఆగాల్సి ఉంటుందని చెబుతుండటంతో శ్రావణంలో తాళికట్టు శుభవేళ అంటున్నారు. 20, 21 తేదీల్లో అధికంగా పెళ్లిళ్లు ఉన్నాయని.. రోహిణి నక్షత్రం ఎక్కువమంది వధూవరులకు కలుస్తుందని పురోహితులు చంద్రశేఖర్‌, సంతోష్‌శర్మ చెబుతున్నారు. ఈ మాసంలో తారాబలాలు బాగుండటంతో ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

రెండేళ్లుగా కొవిడ్‌తో వాయిదా

కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లు పెళ్లిళ్లు చాలావరకు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది కరోనా తగ్గడంతో పెళ్లి ప్రయత్నాలను తల్లిదండ్రులు ముమ్మరం చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో చాలావరకు పెళ్లి మండపాలు, కన్వెన్షన్‌ సెంటర్లు బుక్‌ అయినట్లు మండప నిర్వాహకులు చెబుతున్నారు. శివార్లలోని కన్వెన్షన్‌ సెంటర్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

పగటిపూటే ఎక్కువ

‘ఆషాఢంలో ఖాళీగా ఉన్నాం. జూన్‌ 23 తర్వాత మళ్లీ ఆగస్టులోనే మంచి ముహూర్తాలు. 12 రోజుల పాటు మండపం బుక్‌ అయింది. ఎక్కువ పెళ్లిళ్లు పగటిపూటనే ఉన్నాయి. రాత్రిపూట నిశ్చితార్థం, పెళ్లి రిసెన్షన్‌ల కోసం బుక్‌ చేసుకున్నారు’ అని తుర్కయాంజాల్‌లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్‌ యాజమాని భీంరెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి..

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.