Hyd Cyber Crimes: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా సైబర్ మోసాలు.. బీ అలర్ట్!

author img

By

Published : Jun 21, 2022, 8:03 PM IST

Hyd Cyber Crimes

''మీరు ఇటీవల ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో వస్తువును కొనుగోలు చేశారు కదా... మీ పేరు లక్కీ డ్రాలో ఎంపిక అయింది. డ్రాలో మీ పేరుతో కారును గెలుచుకున్నారు. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా కారును తీసుకెళ్లండి. కారు అవసరం లేకపోతే డబ్బులు కూడా ఇస్తాం.'' ఇలా వచ్చే కాల్స్‌కు స్పందించి... బహుమతి కోసం ఆశపడ్డారా... ఇక మీ ఖాతా ఖాళీ అయినట్లే. ఈ కామర్స్ సంస్థల్లో కస్టమర్ల వివరాలను తీసుకొని లక్షల్లో బిహార్‌కి చెందిన సైబర్ నేరగాళ్లు ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇంతకీ ఈ ముఠా ఏ విధంగా మోసం చేస్తోందంటే..?

ఆన్‌లైన్‌ లావాదేవీలను సైబర్‌ మాయగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. కొనుగోలుదారులకు బహుమతుల ఆశచూపి అందినంత సొమ్ము కాజేస్తున్నారు. చాలా తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. వీరి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. వంద రూపాయలతో కొనుగోలు చేసిన వస్తువులకు లక్షలు విలువైన బహుమతులు ఎలా వస్తాయంటూ విచక్షణతో ఆలోచించాలంటున్నారు. రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ తరహా కేసులు 20కి పైగా నమోదయ్యాయి. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో కొనుగోలు చేస్తున్న వారి వివరాలు బయటి వ్యక్తుల చేతికి చేరటమే మోసాలు పెరిగేందుకు కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారు.

చెప్పులు కొన్నందుకు 20 లక్షల కారు.. హైదరాబాద్​లోని​ ఎల్బీనగర్‌కు చెందిన గృహిణి ఇటీవల కొత్తగా వచ్చిన ఓ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా పాదరక్షలు కొనుగోలు చేశారు. మూడ్రోజులకు డెలివరీ బాయ్‌ వాటిని ఇంటి వద్దకే తెచ్చిచ్చాడు. అదే రోజు సాయంత్రం.. పాదరక్షల కంపెనీ కస్టమర్‌ కేర్‌ నుంచి అంటూ ఆమెకు ఫోన్‌కాల్‌ వచ్చింది. నెల రోజుల్లో తమ కంపెనీ నుంచి వస్తువులు కొనుగోలు చేసిన వారిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశామని.. వాటితో ఆమె పేరు ఉందంటూ టెలీకాలర్‌ వివరించాడు. రూ.20లక్షల విలువైన కారు గెలుచుకున్నారంటూ ఆశ చూపాడు. పన్నుల రూపంలో కొద్దిమొత్తంలో చెల్లించాల్సి ఉంటుందంటూ దఫాల వారీగా రూ.లక్షన్నర తమ ఖాతాల్లో జమచేసుకున్నారు. విదేశీ కారు కావటంతో కస్టమ్స్‌ పన్నులు పడతాయంటూ రూ.3.5లక్షలు డిమాండ్‌ చేయటంతో బాధితురాలికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇదంతా సైబర్‌ నేరగాళ్ల మోసంగా గుర్తించారు.

డ్రెస్‌ కొంటే.. లాక్కీ డ్రాలో స్కూటీ గిఫ్ట్.. మరో కేసులో ఉప్పల్‌కు చెందిన ఓ విద్యార్థిని... తమ కళాశాలలో ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో దుస్తులు కొనుగోలు చేశారు. పదిరోజుల తరువాత విద్యార్థిని మొబైల్‌ నెంబర్‌కు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకులమంటూ ఫోన్‌కాల్‌ వచ్చింది. యూత్‌ విభాగంలో స్కూటీ గెలుచుకున్నారంటూ ఊరించారు. రవాణా ఛార్జీలు, రిజిస్ట్రేషన్‌ , పన్నులు వెంటనే చెల్లిస్తే సరిపోతుందంటూ రూ.20,000 కాజేశారు. రోజులు గడుస్తున్నా... ద్విచక్రవాహనం రాకపోవటంతో బాధితురాలు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ కస్టమర్‌ కేర్‌ నెంబర్‌కు ఫోన్‌ చేయటంతో అసలు విషయం బయటపడింది.

ఆన్‌లైన్‌లో ఇయర్‌ ఫోన్స్‌ షాపింగ్.. 22 లక్షలు ఖాళీ: మరో కేసులో నగరానికి చెందిన ఓ మహళ.... భర్త చనిపోవడంతో వచ్చిన బెనిఫిట్స్ ఆమె ఖాతాలో ఉంచుకున్నారు. ఆన్‌లైన్ క్లాసుల కోసం ఆమె కుమార్తె స్నాప్ డీల్‌లో ఇయర్‌ఫోన్స్‌ బుక్ చేసింది. అనంతరం ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీరు చేసిన ఇయర్ ఫోన్ ఆర్డర్‌కు లక్కీ డ్రాలో కారు వచ్చిందని సైబర్ నేరగాళ్లు నమ్మ బలికారు. నిజమేనని నమ్మిన బాలిక తల్లికి తెలియకుండా నిందితుల చెప్పిన ఖాతాకు విడతలవారీగా 15 లక్షలు బదిలీ చేసింది. నిందితుడు అంతటితో ఆగకుండా చరవాణి నంబరు నుంచి ఖాతాను హ్యాక్ చేసి మరో 7లక్షలు కాజేశాడు. నగదు కోసం బ్యాంకుకు వెళ్లిన మహిళకు డబ్బు లేకపోవడంతో అనుమానం వచ్చింది. ఇంటికి వచ్చి కుమార్తెను అడగగా అసలు విషయం తెలిసింది. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి 22లక్షలను రికవరీ చేశారు.

ఇవి ఉదాహరణలు మాత్రమే.. వెబ్‌సైట్లు, ఈ-కామర్స్, సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యావసర సరుకులు, వస్తువులు, గృహాలంకరణ సామగ్రి , సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేసే మహిళలను లక్ష్యంగా చేసుకొని సైబర్‌మోసగాళ్లు చెలరేగుతున్నారు. ఉచిత బహుమతుల పేరుతో మగువలను తేలికగా మాయ జేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వివరాలను అక్కడి ఉద్యోగులు, కొరియర్‌ సంస్థలు, డెలివరీ బాయ్స్‌ నుంచి సేకరిస్తున్నారు. వినియోగదారుల పూర్తివివరాలను అడ్డుపెట్టుకొని బహుమతుల వల విసురుతున్నారు. కస్టమర్‌కేర్‌ కేంద్రాల నుంచి టెలీకాలర్స్‌గా కొనుగోలు దారులకు ఫోన్లు చేస్తారు.

కొనుగోలు చేసిన వస్తువులు, డెలివరీ సమయం, ధర, రసీదు తదితర టెలీకాలర్స్‌ చెబుతున్న వివరాలు తమ వద్ద ఉన్న సమాచారం ఒక్కటే కావటంతో తేలికగా నమ్మేస్తున్నారు. ఆయా సంస్థల నుంచి తాము నిజంగానే బహుమతులు గెలుచుకున్నామనే భ్రమలో పడిపోతున్నారు. సొమ్ములు పోయాక తాము మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారని రాచకొండ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ తెలిపారు. ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో షాపింగ్‌ చేశాక.. మీరు బహుమతులు గెలుచుకున్నారంటూ తెలియని వ్యక్తుల మాటలు నమ్మొద్దని సూచించారు. వాస్తవాలను నిర్దారించుకున్న తర్వాతనే ఆర్ధిక లావాదేవీలు జరపాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.