వారి కృతజ్ఞతే నాకు స్ఫూర్తి: జస్టిస్ లలిత

author img

By

Published : May 3, 2020, 5:13 PM IST

వారి కృతజ్ఞతే నాకు స్ఫూర్తి : జస్టిస్ లలిత

డాక్టర్‌ అవ్వాలనుకున్నారు ఆమె. ‘ఆర్డర్‌.. ఆర్డర్‌.. నువ్వు న్యాయవాది కావాలి. న్యాయానికి న్యాయం చేయాలి’ అన్నారు వాళ్ల నాన్న. ఆయనపై ప్రేమతో లా చదివారు. బండెడు పుస్తకాల్లో క్లాజులు, సబ్‌క్లాజులు అన్నీ కరతలామలకమయ్యాయి. ఏళ్లకేళ్లు ఒకటే దీక్ష. వందల్లో కేసులు.. వేలల్లో వాదనలు.. ఎన్నెన్నో మరపురాని విజయాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ‘ఆర్డర్‌ ఆర్డర్‌’ అనే స్థాయికి చేరుకున్నారు. ఆమె మరెవరో కాదు.. తెలుగింటి ఆడబిడ్డ కన్నెగంటి లలిత. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ‘వసుంధర’తో పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే.

తెల్లకోటు వేసుకుందామని చిన్నప్పుడు కలలు కనేదాన్ని. ఇంటర్‌లో బైపీసీ తీసుకుంది అందుకే! కానీ, నల్లకోటు వచ్చింది ఒంటిమీదికి. జీవితంలో భాగమైపోయింది. ఇప్పుడు న్యాయమూర్తి స్థానంలో కూర్చోబెట్టింది. లాయర్‌గా నా ప్రస్థానం మొదలైనప్పుడు ‘జస్టిస్‌ లలిత’ అవుతానని ఎన్నడూ అనుకుంది లేదు. నిరంతర కృషి, పట్టుదల.. ఇవే ఈ స్థితికి కారణమని భావిస్తున్నా.

గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని జమ్ములపాలెం మా ఊరు. నాన్న కొమ్మినేని అంకమ్మ చౌదరి, అమ్మ అమరేశ్వరి. నాన్న బీఏ, ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చేశారు. మా అమ్మను వాళ్ల నాన్న అప్పట్లోనే భీమవరంలో స్కూలుకు పంపించి చదివించార్ట! నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు మా కుటుంబం హైదరాబాద్‌ వచ్చేసింది. నా చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. పడాల రామరెడ్డి కాలేజీలో లా చేశా. 1994లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నా.

2008లో సొంతంగా..


చదువు పూర్తవుతున్న ఏడాదే మా బంధువు కన్నెగంటి విజయ్‌తో నా వివాహమైంది. ఆయన మెకానికల్‌ ఇంజినీర్‌. ల్యాండ్‌స్కేప్‌ కన్సల్టెంట్‌గా ఉన్నారు. కొన్నాళ్లకు బాబు, పాప పుట్టారు. కెరీర్‌ ప్రారంభమవుతున్న రోజులవి. మరోవైపు కుటుంబ బాధ్యతలు. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రయాణం కొనసాగించా. ఎమ్మార్కే చౌదరి, కె.హరినాథ్‌, ఒ.మనోహర్‌రెడ్డి వీరి దగ్గర పని చేసిన అనుభవం న్యాయవాదిగా నాకు ఎంతో ఉపయోగపడింది. పిల్లలు కాస్త పెద్దయ్యాక పూర్తిస్థాయిలో కెరీర్‌పై దృష్టి పెట్టా. ఈ సమయంలో ఇంట్లో మా అమ్మ చేయూత మర్చిపోలేను. 2008లో సొంతంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టా. రోజుకు 12 గంటలకు పైగా పనిచేసేదాన్ని. కోర్టులో వాదించాల్సిన కేసుల వివరాలు, సెక్షన్లు వీటితోనే రోజంతా గడిచిపోయేది. సివిల్‌, క్రిమినల్‌ అని తేడా లేకుండా అన్నిరకాల కేసులూ స్టడీ చేసేదాన్ని. కేసు విజయం సాధించినప్పుడు కలిగిన ఆనందం కన్నా.. క్లయింట్‌ కళ్లలో కనిపించే సంతోషమే ఎక్కువ తృప్తినిస్తుంది. ఆ సమయంలో వారు చూపే కృతజ్ఞత మరిన్ని విజయాలు సాధించడానికి స్ఫూర్తినిస్తుంది. విజయాలు సాధించేవారికి శత్రువులూ ఉంటారు. మనలను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. అన్నింటినీ ఆత్మవిశ్వాసంతో అధిగమించా.

నిష్పక్షపాతంగా ముందుకు..

పురుషాధిక్యత ఎక్కడైనా ఉంది. అయితే, నిరంతర కృషి మనల్ని గెలిపిస్తుంది. దేన్నైనా సాధించే శక్తి మహిళలకు ఉంది. ఓపిక, నేర్పు వారి ప్రధాన బలాలు. వీటికి కుటుంబ సహకారం తోడైతే స్త్రీ తాను అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోగలదు. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే నిత్యం శ్రమించాల్సిందే. ఎప్పటికప్పుడూ అప్‌డేట్‌ అవుతూ ఉండాలి. కొత్తగా వచ్చే తీర్పులు, చట్టాలు అన్నింటిపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అప్పుడే న్యాయం చేయగలం. ఇప్పటి వరకూ వేల కేసులు వాదించా. ఇప్పుడు తీర్పు చెప్పే ఉన్నత స్థానానికి చేరుకున్నా. భగవంతుడు నాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశమిది. మా అమ్మానాన్నలు పుత్రికోత్సాహాన్ని అనుభవిస్తున్నారు. మా ఆయన, పిల్లలు, కుటుంబం అంతా ఆనందంగా ఉంది. మా అబ్బాయి గౌతం.. జర్మనీలోని జాకబ్‌ యూనివర్శిటీలో సప్లై ఛైన్‌ మేనేజిమెంట్‌ అండ్‌ లాజిస్టిక్స్‌లో ఎమ్మెస్‌ పూర్తి చేసుకున్నాడు. అమ్మాయి మానస దిల్లీలో లా చేస్తోంది. వీరందరి సహకారంతోనే ఈ స్థితికి రాగలిగాను. ఇప్పుడు నా విధులను మరింత బాధ్యతతో వ్యవహరిస్తాను. న్యాయం కోసం కోర్టుకు వచ్చినవారికి న్యాయం చేకూర్చడమే నా కర్తవ్యం.

మరపురాని విజయాలెన్నో..

ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేసి, వాళ్ల తరఫున కేసులు వాదించా. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానానికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఎంపికయ్యా. టీటీడీ సమాచార హక్కు చట్టం కింద రాదని వేసిన పిటీషన్‌ని నేనే వాదించా. తిరుమలలో వెయ్యికాళ్ల మంటపాన్ని పునర్‌ నిర్మించాలని వేసిన కేసు వాదించా. రక్షణలో భాగంగా ఆ మంటపాన్ని నిర్మించడం కుదరదన్న మా వాదన న్యాయస్థానంలో నెగ్గింది. ఇలా కేసుల్లో టీటీడీకి ఉచితంగా సేవలందించా. సంస్కృత విశ్వవిద్యాలయానికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఎంపికయ్యా. నా ప్రయాణంలో ఓటములు ఎక్కువగా నన్ను సమీపించలేకపోయాయి. కేసు పూర్వాపరాలు తెలుసుకొని న్యాయం ఉందంటేనే ముందడుగు వేస్తా. అదే నా విజయ సూత్రం.

రవీంద్రుని పాత్ర పేరు..

మా నాన్నకు విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్‌ రచనలంటే చాలా ఇష్టం. నేను పుట్టినప్పుడు ఆయన చదివిన నవలలోని ఓ పాత్ర పేరు లలిత అట. దాంతో ఆ పేరే నాకూ పెట్టారు. నాకు డాక్టరవ్వాలని ఉండేది. అయితే నాన్న మాత్రం నన్ను ‘న్యాయవాదివి కావాలి. ఎందరికో న్యాయం జరిగేలా చూడాలి’ అన్నారు. దాంతో నేను న్యాయవృత్తిని కెరీర్‌గా మలుచుకున్నా.

ఇదీ చదవండి : ఎక్కడి వారు అక్కడే ఉండండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.