60 ఏళ్లు దాటిన వారంతా.. దొంగలుగా మారుతున్నారు!

author img

By

Published : Sep 29, 2022, 8:00 PM IST

donga

వృద్ధాప్యంలో ఎవరైనా ఏం కోరుకుంటారు? తోటివారితో కాసిన్ని కబుర్లు చెప్పుకుంటూ.. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ.. జీవితపు చివరి దశను హాయిగా కొనసాగించాలనుకుంటారు. కానీ.. జపాన్​లో మాత్రం ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. అక్కడ వృద్ధులంతా జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నారు..! ఇందుకోసం నేరాలు చేసి మరీ.. చేతులకు సంకెళ్లు వేయించుకుంటున్నారు..!! వెళ్లి జైల్లో కూర్చుంటున్నారు..!!!

జపాన్ జైళ్లలో వంద మంది ఖైదీలు ఉంటే.. అందులో ఏకంగా 40 మంది వృద్ధులే! అయితే.. వారేమీ కరుడు గట్టిన నేరస్థులు కాదు.. ఘోరమైన, తీవ్రమైన నారాలు చేసిన వారు అంతకన్నా కాదు. దుకాణంలో బ్రెడ్డు ముక్కలు దొంగిలించినవారు..! వెజిటబుల్ మార్కెట్లో కూరగాయలు ఎత్తుకెళ్లినవారు..! షాపులో ఓ రెండు కోడి గుడ్లు చాటుగా తీసిన వారు..! ఆ 40 శాతం మంది చేసిన నేరాలు ఇలాంటివే. ఒక్క శాండ్ విచ్ చోరీ చేస్తే.. రెండేళ్లు జైలు శిక్ష విధిస్తారక్కడ. ఇలాంటి నేరాలు చేస్తూ.. కావాలనే దొరికిపోతూ.. జైలుకెళ్తున్నారు జపాన్​ వాసులు!

మరి, ఈ పరిస్థితి కారణం ఏంటీ..? అన్నది తెలుసుకోవాలంటే.. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి జపాన్ చరిత్రను టచ్ చేయాల్సి ఉంటుంది. 1945లో ఆ దేశంపై పడిన రెండు అణుబాంబులు.. ఇప్పటికీ ఏదో విధంగా జపాన్​ను హింసిస్తూనే ఉన్నాయి. ఆ బాంబు దాడిలో 2 లక్షల మందికిపై ప్రాణాలు కోల్పోయారు. గాయాలతో బయటపడిన వారు.. ఆ రేడియేషన్ ప్రభావంతో తీవ్రమైన వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య ఎంతన్నది చెప్పలేని దుస్థితి. ఈ దారుణంలో.. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు.. ఎంతో మంది అనాథలుగా మిగిలారు. అలాంటి వారు ఇప్పుడు 75 ఏళ్ల వయసు దాటిపోయి ఉన్నారు. వీరితోపాటు కాలక్రమంలో వృద్ధాప్యానికి చేరుకున్న మరికొంత మంది కూడా.. ఇప్పుడు జైలుకు వెళ్లేందుకు చోరీలకు పాల్పడుతున్నారు.

ఎందుకిలా అంటే.. వీరు బయట ఒంటరిగా ఉండలేకపోవడమే! అవును.. వీరిలో చాలా మంది ఎవరూ లేని అనాథలు కాగా.. ఉపాధి వెతుక్కుంటూ కానరాని ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి తల్లిదండ్రులు మరికొందరు! వీరికి ఎలాంటి ఆదాయ మార్గమూ లేదు. దీంతో తినడానికి కనీసం తిండి కూడా దొరకని పరిస్థితి. ఇంటి రెంట్ సహా.. ఇతర అవసరాలు మరింత అదనం! మరి, వీటికి డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది? అందుకే.. జైలుకు వెళ్తే.. మూడుపూటలా ఉచితంగా తిండి దొరుకుతుందని.. అద్దె చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదని భావిస్తున్నారు. అందుకే.. చాలా మంది చోరీలకు పాల్పడుతూ.. ఉద్దేశపూర్వకంగానే దొరికిపోతూ.. జైలుకు వెళ్లిపోతున్నారు.

జైలుకు వెళ్తే తిండి దొరకడంతోపాటు.. మాట్లాడుకోవడానికి స్నేహితులు కూడా లభిస్తారని అక్కడి వృద్ధులు భావిస్తున్నారు. బయట ఉంటే.. ఒక తోడు అనేదే ఉండదని అంటున్నారు. అందుకే.. బయట ఒంటరిగా బతకడం కన్నా.. జైలులో ఖైదీలతో కలిసి బతకడమే హాయిగా ఉంటుందని భావిస్తున్నారు. కొందరు వృద్ధులకు తమ పిల్లల వద్ద ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. వారు ఉండట్లేదు. పిల్లల అరకొర సంపాదన వారికే చాలదని.. ఇక, తాము మరింత భారంగా మారడం ఎందుకు అంటూ.. జైలు బాట పడుతున్నారు!

వృద్ధాప్యం అనేది మనిషికి శాపం వంటిదని అంటారు. జపాన్ వాసులకు మాత్రం.. అంతకు మించి అన్నట్టుగా ఉంది. కొందరికి తిండి లేదని వేదన.. మరికొందరికి తన వాళ్లు లేరనే ఆవేదన.. ఇలా వృద్ధులు ఒక్కోవిధమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ బాధలన్నింటికీ.. జైలు గోడలు మాత్రమే సమాధానం చూపిస్తాయని చెబుతున్నారు. ఇక, అదికూడా ఇబ్బంది పెట్టిన వారు.. ఆత్మహత్యే చివరి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు! ఒక మనిషి తిండి లేక జైలుకు వెళ్లాలని కోరుకోవడం.. చివరకు ప్రాణాలు కూడా తీసుకోవాలని భావించడం ఎంత దుర్భరం?! ఇంతకన్నా దారుణం ఏముంటుందీ?

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.