Gazette Implementation: బోర్డుల పరిధి అమలుతీరుపై కేంద్రం అసంతృప్తి.. రేపు సీఎస్​లతో భేటీ

author img

By

Published : Dec 27, 2021, 5:58 AM IST

Updated : Dec 27, 2021, 6:14 AM IST

Gazette Implementation

Gazette Implementation: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి అమలు తీరుపై కేంద్రం దృష్టిపెట్టింది. ప్రస్తుత పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రప్రభుత్వం.. రాష్ట్రాలతో చర్చించేందుకు నేరుగా రంగంలోకి దిగింది. ఈ మేరకు రేపు తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది. అజెండాలో నాలుగు కీలకాంశాలను చేర్చింది.

Gazette Implementation: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి అమలు తీరుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రాలతో చర్చించేందుకు రంగంలోకి దిగింది. నాలుగు కీలకమైన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఈ నెల 28న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. చర్చించబోయే అంశాలపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సోమేశ్‌కుమార్‌, సమీర్‌శర్మలకు లేఖ రాశారు.

చెరో రూ.200 కోట్లు ఇవ్వండి..

కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులకు చెరో రూ.200 కోట్ల చొప్పున మూలధనాన్ని రెండు రాష్ట్రాలు జమచేయాల్సి ఉంది. గడువు దాటినా జమ చేయకపోవడంతోపాటు ఇంత మొత్తం చెల్లించడం సాధ్యం కాదని, దశలవారీగా చెల్లిస్తామని కోరగా, కేంద్రం ఇందుకు అంగీకరించలేదు. ఈ అంశాన్ని సమావేశం అజెండాలో మొదటి అంశంగా చేర్చారు.

అందుకు అంగీకరించని తెలంగాణ..

కృష్ణా, గోదావరి బేసిన్లలోని మొత్తం ప్రాజెక్టులను నోటిఫికేషన్‌లో చేర్చిన కేంద్రం, పూర్తిగా బోర్డుల అజమాయిషీలో ఉండే వాటిని రెండో షెడ్యూల్‌లో చేర్చింది. రాష్ట్రాల పర్యవేక్షణలో ఉండి నీటి వినియోగ వివరాలను బోర్డులకు అందజేసే ప్రాజెక్టులను మూడో షెడ్యూల్​లో ఉంచింది. రెండో షెడ్యూల్‌లోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంపై పలు దఫాల చర్చలు జరిగినా ముందడుగు పడలేదు. కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తే సరిపోతుందని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్‌, శ్రీశైలం ప్రాజెక్టును అప్పగిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే తెలంగాణ అప్పగించిన తర్వాతనే అనే మెలిక పెట్టింది. ఇప్పటివరకు ఏ ప్రాజెక్టునూ అప్పగించని తెలంగాణ, ముఖ్యంగా శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తేవడానికి అంగీకరించలేదు.

ప్రాజెక్టుల అప్పగింతపై..

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారమే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయిందని, షెడ్యూలు-2లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డు నిర్వహణకు అప్పగించాల్సిందేనని కొన్నాళ్ల క్రితం కేంద్రం స్పష్టం చేసింది. గోదావరిలో పెద్దవాగు మినహా ఏ ప్రాజెక్టునూ అప్పగించాల్సిన అవసరం లేదని తెలంగాణ పేర్కొనగా, దిగువన ఉన్నవి పూర్తిగా తమ అవసరాలకు సంబంధించినదే కాబట్టి అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. బోర్డుల పరిధికి సంబంధించి కీలకమైన రెండో షెడ్యూల్‌లోని ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని రెండో అంశంగా చర్చించనుంది.

ప్రాజెక్టుల వద్ద సీఐఎస్​ఫ్​ భద్రత..

జలసంఘం అనుమతి లేని ప్రాజెక్టులను ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొని, వాటి సమగ్ర నివేదికలు అందజేయాలని, ఆరునెలల్లోగా అనుమతులు పొందాలని కేంద్రం పేర్కొంది. కృష్ణాలో నీటి లభ్యత లేనందున రాష్ట్రాలు డీపీఆర్​లు ఇచ్చే పరిస్థితి లేకపోగా, గోదావరిలో రెండు రాష్ట్రాలు డీపీఆర్‌లు అందజేశాయి. దీనిని మూడో అంశంగా చర్చించనున్నారు. బోర్డుల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుల వద్ద సీఐఎస్​ఫ్​ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సిబ్బంది జీతభత్యాలు, వసతి, వాహనాలు తదితరాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. సీఐఎస్​ఎఫ్​ ఖర్చుతోపాటు నిర్వహణలో సమస్యలొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా లేవు. అయితే బోర్డులు తీసుకొనే నిర్ణయాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు జరగడానికి ఈ భద్రత అవసరమని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఐఎస్​ఎఫ్​ భద్రతను నాలుగో అంశంగా కేంద్రం ఎజెండాలో చేర్చింది.

ఇదీచూడండి: CJI JUSTICE NV RAMANA : జడ్జిల నియామకంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

Last Updated :Dec 27, 2021, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.