ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో భారీ చోరీ.. తెలిసిన వాళ్లే చేశారా..?

author img

By

Published : Sep 22, 2022, 11:16 AM IST

Theft In Bajaj Electronics

Theft In Bajaj Electronics Showroom: తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ ఈసీఐఎల్​ చౌరస్తాలోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో జరిగిన చోరీ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అర్థరాత్రి వేళ వెంటిలేటర్‌ ఊచలు తొలగించి.. సుమారు రూ.70 లక్షలకు పైగా విలువైన సెల్‌ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన షోరూం కుషాయిగూడ పోలీస్​స్టేషన్​కు 100 అడుగుల దూరంలో ఉండడం గమనార్హం. ఘటన స్థలాన్ని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ పరిశీలించారు. తెలిసిన వాళ్లే ఈ పని చేసారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

చోరీ

Theft In Bajaj Electronics Showroom: మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్​ ప్రధాన కూడలిలో బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌ను ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లిపోయారు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చోరీ జరిగింది. షోరూం ఎడమ వైపున పక్కన భవనానికి.. షోరూం మధ్య కొంత ఖాళీ స్థలం ఉంది. ఇక్కడే షోరూం మూలన వెంటిలేటర్‌కు ఉన్న ఇనుప కడ్డీలను అడ్డుగా ఉన్న ఫాల్‌ సీలింగ్‌ను తొలగించి భవనంలోకి దొంగలు చొరబడ్డారు.

లోపలికి వెళ్లాక అక్కడున్న సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లను తెంచేశారు. ఆ తర్వాత 200లకు పైగా ఐఫోన్, వివో, ఒప్పో, వన్‌ప్లస్‌ సెల్‌ఫోన్లు, ఛార్జర్లు, కేబుళ్లు, ఇయర్‌ ఫోన్‌లను తీసుకుని.. వాటి డబ్బాలను మాత్రం అక్కడే వదిలేసి పారిపోయారు. సెల్‌ఫోన్లకు పక్కనే ఉన్న యాపిల్‌ కంప్యూటర్‌ను పరిశీలించి అక్కడే వదిలిపెట్టారు. ఇతర ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల్ని మాత్రం ముట్టుకోలేదు. చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.70 లక్షలకుపైగా ఉంటుందని యాజమాన్యం పేర్కొంది.

బుధవారం ఉదయం షోరూంకు వెళ్లిన భద్రతా సిబ్బంది చోరీ విషయం గమనించారు. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ జనరల్‌ మేనేజర్‌ మహ్మద్‌ హబీబ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ ఆధారాలు సేకరించారు. లోపల ఉన్న సీసీ పుటేజీల్లో దొంగ ఒక్కడు మాత్రమే కనిపించాడు. తలకు రుమాలు కట్టుకుని దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ పుటేజీల్లో నమోదయ్యాయి. దొంగతనానికి పాల్పడింది ఒక్కరేనని పోలీసులు ప్రాథమికంగా నిర్థరణకు వచ్చారు.

కుషాయిగూడ పోలీస్​స్టేషన్​కు కూత వేటు దూరంలోని షోరూంలో భారీ చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. తెలిసిన వ్యక్తులే దొంగతనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భవనం లోపల చరవాణులు ఎక్కడుంటాయి..? ఆ విభాగానికి ఎలా వెళ్లాలి.. ఎలా చోరీ చేయాలో ప్రణాళిక ప్రకారం చేసినట్లు భావిస్తున్నారు. డిస్‌ప్లే టేబుల్‌కు ఉన్న సెల్‌ఫోన్‌లను ముట్టుకుంటే బీప్ సౌండ్ వస్తుందని తెలిసి ఎటువంటి శబ్దం రాకుండా చోరీ చేశారు. తెలిసిన వాళ్ల పనా లేదా సెల్‌ఫోన్లు కొనేందుకు వచ్చి పక్కాగా రెక్కీ చేశాకే దొంగతనం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Person suicide: నిండు ప్రాణం తీసిన రూ.2.500 అప్పు... ఎలాగంటే..?

విజయనగరంలో డ్రగ్స్​ కలకలం.. ఇద్దరు అరెస్ట్​

పొన్నియన్​ సెల్వన్​తో మరోసారి వార్తల్లో త్రిష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.