మైనింగ్‌ అక్రమ తవ్వకాలపై హైకోర్టు కన్నెర్ర.. తోటపల్లిలో మైనింగ్​ ఆపాలని ఆదేశం

author img

By

Published : Sep 17, 2022, 7:37 AM IST

HIGH COURT SERIOUS ON MINING

HC SERIOUS ON ILLEGAL MINING : మైనింగ్‌ అక్రమ తవ్వకాలపై హైకోర్టు కన్నెర్ర చేసింది. రాష్ట్రంలో ఏమి జరుగుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్రమ మైనింగ్‌ వెనుక పెద్దలు ఎవరున్నా.. లెక్కచేయబోమని తేల్చిచెప్పింది. బాధ్యులైన ప్రజాప్రతినిధులను కోర్టుకు పిలిపించే పరిస్థితి తీసుకురావద్దని హితవు పలికింది. డీజీపీ చొరవ తీసుకొని.. తోటపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను నిలిపివేయాలని ఆదేశించింది. చర్యలు తీసుకోవటంలో విఫలమైతే కోర్టుకు డీజీపీని పిలుస్తామని హైకోర్టు తెలిపింది.

HIGH COURT SERIOUS ON MINING : అక్రమ మైనింగ్‌ తవ్వకాలను నిలిపేయాలని ఆదేశాలిచ్చినా.. కార్యకలాపాలు కొనసాగించడం ఏమిటని హైకోర్టు నిలదీసింది. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించింది. కోర్టు ఉత్తర్వులను తేలిగ్గా తీసుకోవద్దని వ్యాఖ్యానించింది. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని.. తోటపల్లి గ్రామం పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని ఆదేశించింది.

డీజీపీ విఫలమైతే.. పర్యవసానాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. కేసు దస్త్రాలను డీజీపీకి పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. మైనింగ్‌ అక్రమాలను అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తూ.. హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. సంబంధిత కేసు డైరీ, ఎఫ్‌ఐఆర్‌తో ఉమ్మడి కృష్ణా జిల్లా ఆగిరిపల్లి స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. విచారణను అక్టోబర్‌ 12కి వాయిదా వేసింది.

ఉమ్మడి కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామ పరిధి RS నెంబర్‌ 2/1లో 8.50ఎకరాల్లో బి.బసవపూర్ణయ్య అనే వ్యక్తికి గ్రావెల్‌ తవ్వకాలకు గనులశాఖ అధికారులు ఇచ్చిన తాత్కాలిక అనుమతులను సవాలు చేస్తూ.. జె.లక్ష్మణరావు, మరో ఐదుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పరిధిదాటి విచక్షణారహితంగా గ్రావెల్‌ తవ్వకాలు చేస్తున్నారన్నారు. సమీపంలోని భూములు, పత్తిపంట ధ్వంసం అవుతున్నాయన్నారు. హైకోర్టు సింగిల్‌ జడ్జి విచారణ జరిపి మైనింగ్‌ తవ్వకాలను నిలిపేశారు.

కొద్దిరోజుల తర్వాత మరో సింగిల్‌ జడ్జి ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి గత ఉత్తర్వులు సవరించారు. మైనింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ రైతులు జె.లక్ష్మణరావు మరికొందరు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 5న విచారణ జరిపింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసింది. మైనింగ్‌ కార్యకలాపాలు చేపట్టవద్దని స్పష్టంచేసింది.

అప్పీల్‌ హైకోర్టులో మరోసారి విచారణకు రాగా.. కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదని..ఇప్పటికీ గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయని.... పిటిషనర్ల తరఫు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు వాదనలు వినిపించారు.. నూజివీడు సీఐ ఆధ్వర్యంలో ఆయుధాలు ధరించిన పోలీసులతో మైనింగ్‌ కార్యకలాపాలను రక్షణ కల్పిస్తున్నారన్నారు. సంబంధిత ఫోటోలను కోర్టు పరిశీలనకు ఇచ్చారు. రైతులను పొలాల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు.

వైకాపాకు చెందిన నూజివీడు ఎమ్మెల్యే సూచనతో ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే మైనింగ్‌ చేయిస్తున్నట్లు వాచ్‌మెన్‌ చెప్పిన ఆధారాలున్నాయన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ పిటిషనర్ల భూముల్లోకి చొచ్చుకొస్తున్నారన్నారు. పిటిషనర్లపై ఆగిరిపల్లి ఠాణాలో తప్పుడు కేసు నమోదు చేసి భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు.

పిటిషనర్లపై కేసు నమోదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తంచేసిన హైకోర్టు.. రాష్ట్రంలో ఏమి జరగుతోందని గనులశాఖ జీపీ నవీన్‌ను ప్రశ్నించింది. తవ్వకాలను నిలిపేస్తూ కోర్టు ఆదేశాలిచ్చాక గంట కూడా జరపడానికి వీల్లేదంది. ఎమ్మెల్యే పాత్రనూ తేలుస్తామంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకుంటామన్నారు. కోర్టు ఆదేశాలను అధికారులు ఉల్లంఘించలేదన్నారు.

మేత బీడు భూముల్లో గనుల తవ్వకాలా..?

రెవెన్యూ రికార్డుల్లో మేత బీడుగా పేర్కొన్న భూముల్లో మైనింగ్‌ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తహసీల్దార్‌ నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇస్తే.. మైనింగ్‌కు ఎలా అనుమతిస్తారని, క్షేత్రస్థాయిలో పరిశీలించరా? అంటూ గనుల శాఖ అధికారులను నిలదీసింది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కదిరివీడులోని సర్వే నంబరు 93తోపాటు వివిధ సర్వే నంబర్లలో గ్రావెల్‌ తవ్వకాలను నిలిపేయాలని సంబంధిత గనుల శాఖ సహాయ సంచాలకులను ఆదేశించింది.

ఆ ప్రాంతంలో యంత్రాలను, మనుషులను ఖాళీ చేయించాలని స్పష్టంచేసింది. చర్యలు తీసుకోవడంలో విఫలమైతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. గ్రావెల్‌ తవ్వకాల నిలిపివేతకు రెవెన్యూ, పోలీసు, తదితర శాఖల అధికారులు సహకారం అందించాలంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. విచారణను అక్టోబరు 13కి వాయిదా వేసింది. కదిరివీడు గ్రామం భూముల్లో గ్రావెల్‌ తవ్వకాలకు అధికారులు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ పి.శివకుమార్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ వేశారు.

మైనింగ్‌ అక్రమ తవ్వకాలపై హైకోర్టు కన్నెర్ర.. ఏమి జరుగుతోందని ఘాటు వ్యాఖ్య

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.