ఇళ్ల పట్టాలకు ఆ స్థలాలొద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

author img

By

Published : Aug 19, 2020, 5:26 AM IST

high court on vishaka lands

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన భూముల్లో 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పథకం కింద ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఒక వేళ ఆయా స్థలాల్లో పట్టాలిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత జిల్లా కలెక్టర్లు బాధ్యులవుతారని హెచ్చరించింది.

విశాఖ జిల్లా అనంతగిరి మండలం, పినకోట గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన కొంత స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అధికారులు యత్నిస్తున్నారని పేర్కొంటూ లచ్చన్నదొర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ.. గతంలో పలువురు దాతలు పాఠశాలకు భూమిని ఇచ్చారన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి లేఖ రాశారని కోర్టుకు తెలిపారు. పాఠశాల భూమిలో ఇళ్ల స్థలాల కేటాయింపును నిలువరించాలని అభ్యర్థించారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. పాఠశాలలకు చెందిన భూమిని ఇళ్ల స్థలాల కోసం ఏ విధంగా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

విద్యాశాఖకు చెందిన ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు చెందిన భూముల్ని ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తున్నట్లు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయినట్లు ధర్మాసనం గుర్తు చేసింది. ప్రస్తుత వ్యాజ్యంలోని అభ్యర్థన పరిధిని పెంచుతున్నామని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలు, తదితర విద్యా సంస్థలకు చెందిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. పినకోట గ్రామంలోని పాఠశాలకు చెందిన భూమిని ఇళ్ల పట్టాలకు కేటాయించొద్దని స్పష్టం చేసింది. ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.

ఇదీ చదవండి: ఒకట్రెండు రోజుల్లో టీకాపై మూడో దశ ట్రయల్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.