HIGH COURT ON CFMS BILLS: ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి హాజరవ్వాలని హైకోర్టు ఆదేశం

author img

By

Published : Dec 8, 2021, 4:55 AM IST

HIGH COURT ON CFMS BILLS

HIGH COURT ON CFMS BILLS: సచివాలయాలకు స్టేషనరీ సరఫరా చేసినందుకు గాను.. రూ. 1.29 కోట్ల మేర బిల్లుల బకాయి పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని విచారణకు హాజరై బదులివ్వాలని ఆదేశించింది.

HIGH COURT ON STATIONERY PENDING BILL: బిల్లుల చెల్లింపులో ఆర్థికశాఖ తీవ్ర జాప్యం చేస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో తరచూ పలు వ్యాజ్యాలు దాఖలు అవుతున్నాయని గుర్తు చేసింది. ట్రెజరీశాఖతో పాటు వివిధ శాఖలు బిల్లుల సొమ్మును సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) కు పంపుతున్నా .. ఏళ్ల తరబడి ఎందుకు చెల్లించడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీఎఫ్ఎంఎస్ విధానంతో సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించింది.

విశాఖ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలకు స్టేషనరీ సరఫరా చేసినందుకు 2019లో సమర్పించిన బిల్లుల సొమ్ము చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్. రావత్​ను ఆదేశించింది. విచారణను ఈనెల 13 కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

సచివాలయాలకు స్టేషనరీ సరఫరా చేసిన బిల్లులకు సొమ్ము చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ బ్రాంచ్ మేనేజరు శ్రీహర్ష హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపు న్యాయవాది పి. రవితేజ వాదనలు వినిపిస్తూ.. రూ. 1.29 కోట్ల నిమిత్తం 2019 లో బిల్లులు పెట్టామన్నారు. 2020 లో సీఎఫ్ఎంఎస్​లో.. ఆ వివరాలను అప్లోడ్ చేశారన్నారు. 2021 మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసిన కారణంగా బిల్లులు చెల్లించలేమని అధికారులు చెబుతున్నారన్నారు. మరో సారి బిల్లులు సమర్పించాలని కోరుతున్నారన్నట్లు కోర్టుకు వివరించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియడంతో చెల్లింపులు సాధ్యం కాలేదని కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ న్యాయవాది వివరణపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం న్యాయబద్ధమైన హక్కును హరించడమేనన్నారు. ఈ వ్యవహారం మొత్తంపై వివరణ ఇవ్వాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

ఇదీ చదవండి:

AP govt Guarantee for loan: రూ.5 వేల కోట్ల రుణం.. పౌర సరఫరాల కార్పొరేషన్​కు ప్రభుత్వ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.