'ఆ భూ యజమానులపై తొందరపాటు చర్యలొద్దు'

author img

By

Published : May 10, 2022, 4:57 AM IST

హైకోర్టు

ఆటోనగర్‌లలోని భూమి/ప్లాట్ల యజమానులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏపీఐఐసీ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేశారు. అనంతరం విచారణను జూన్‌ 16కు వాయిదా వేసింది.

రాష్ట్రంలోని ఆటోనగర్‌లలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఏపీఐఐసీ నుంచి తీసుకున్న భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న యజమానుల విషయంలో తొందరపాటు చర్యలొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భూవినియోగ మార్పిడికి మార్కెట్‌ విలువలో 50% సొమ్మును ‘ఇంపాక్ట్‌ రుసుం’గా చెల్లించాలని ప్రభుత్వం జీవోలు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపింది.

మార్కెట్‌ విలువలో 50 శాతం రుసుమును చెల్లించాలని కోరడం చాలా ఎక్కువని, ఆ ఆస్తిపై అధికారం ఉన్న వారి హక్కులకు తీవ్ర భంగం కలిగించే రీతిలో ఈ నిర్ణయం ఉందని పేర్కొంది. ఆటోనగర్‌లలోని భూమికి, వెలుపల ఉన్న భూమికి ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల విషయంలో తీవ్ర వ్యత్యాసం ఉందని తెలిపింది. ఆ విధంగా నిర్ణయించడం 14వ అధికరణకు విరుద్ధమని పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానులే అనే ప్రాథమిక సూత్రానికి భిన్నంగా ప్రభుత్వ నిర్ణయం ఉందంది. ఆటోనగర్‌లలోని భూమి/ప్లాట్ల యజమానులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. విచారణను జూన్‌ 16కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ఇటీవల ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఏపీఐఐసీ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో జనావాస ప్రాంతాల మధ్యలో ఆటోనగర్‌లు, పారిశ్రామికవాడలు కాలుష్యానికి కారణం అవుతున్నాయని వాటిని దూరంగా తరలిస్తామంటూ ప్రభుత్వం కోఆర్డినేటెడ్‌ గ్రోత్‌ పాలసీ తీసుకొచ్చింది. ఏ ఉద్దేశం కోసమైతే ఆ భూమిని పొందారో అందుకు భిన్నంగా వినియోగిస్తున్న యజమానుల నుంచి దాని మార్కెట్‌ విలువలో 50శాతం రుసుము రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలని లేదా సగం స్థలం ఇవ్వాలంటూ పాలసీలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 4న రెండు జీవోలు జారీచేసింది. వాటిని సవాలు చేస్తూ విజయవాడ ఆటోనగర్‌ విషయమై ‘ది ఆటోమొబైల్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌’ కార్యదర్శి రావి రామచంద్రరావుతోపాటు పలువురు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఏపీఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ కూడా వ్యాజ్యం వేసింది.

ఇదీ చదవండి: వైద్యారోగ్యశాఖలో చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదు: మంత్రి రజని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.