HC: ఆ సెక్షన్ ప్రకారం నిందితులకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాల్సిందే: హైకోర్డు

author img

By

Published : Oct 12, 2021, 6:46 AM IST

high court on 41a crpc acts

నార్కోటిక్ డ్రగ్స్ చట్టం లాంటి ప్రత్యేక చట్టాల విషయంలో సీఆర్సీపీ సెక్షన్ 41ఏ వర్తించదన్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను హైకోర్టు(high court on crpc acts) ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రత్యేక చట్టాల ప్రకారం ఈ కేసుల విషయంలో నేర విచారణ ప్రక్రియ స్మృతి సెక్షన్ 41ఏ ప్రకారం నిందితులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ప్రత్యేక చట్టాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష విధింపునకు వీలున్న కేసుల విషయంలో నేర విచారణ ప్రక్రియ స్మృతి సెక్షన్ 41ఏ ప్రకారం నిందితులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సిందేనని హైకోర్టు(high court on crpc acts) తేల్చిచెప్పింది. నార్కోటిక్ డ్రగ్స్ చట్టం లాంటి ప్రత్యేక చట్టాల విషయంలో సీఆర్సీపీ సెక్షన్ 41ఏ వర్తించదన్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను తోసిపుచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్.. ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చారు. 600 గ్రాముల గంజాయి ప్యాకెట్ల అక్రమంగా రవాణా చేస్తున్నారన్న అభియోగంతో చిత్తూరు జిల్లా గంగవరం పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20(బి)(2)(సి) కింద నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ.. హైకోర్టును బెంగళూరుకు చెందిన కె.రంజిత్ ఆశ్రయించారు.

పోలీసులు నమోదు చేసిన సెక్షన్ చెల్లదని పిటిషనర్ తరపు న్యాయవాది సూరిబాబు వాదనలు వినిపించారు. గంజాయి పరిమాణం స్వల్పంగా ఉన్న నేపథ్యంలో సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ ప్రకారం పోలీసులు నిందితునికి నోటీసు జారీచేసి వివరణ తీసుకునేలా ఆదేశించండి అని కోరారు. సెక్షన్ 20(బి)(2)(సి) కింద కేసు నమోదు చేసినందున ఆ సెక్షన్ ప్రకారం పదేళ్లకు తక్కువకాకుండా శిక్ష విధింపునకు వీలుందని పోలీసుల తరఫున అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుత కేసు సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ కింద నోటీసుల ఇచ్చేందుకు అర్హమైంది కాదన్నారు. ఎన్డీపీఎస్ లాంటి ప్రత్యేక చట్టాల్లోని శిక్షలకు సెక్షన్ 41 ఏ వర్తింపచేయడానికి వీల్లేదు అని అన్నారు.

ఈ కేసులో గంజాయి మొత్తం పరిమాణం 600 గ్రాములకు కేసు నమోదు చేసిన ఈ సెక్షన్ వర్తిస్తుందని న్యాయమూర్తి తెలిపారు. ఆ సెక్షన్ ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష విధింపునకు వీలున్న నేపథ్యంలో సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ ప్రకారం నోటీసు ఇవ్వడానికి ఈ కేసు అర్హమైందన్నారు. సెక్షన్ 20 (బి)(2)(సి) కింద కేసుపెట్టడం సరికాదన్నారు. 41 ఏ నోటీసు జారీ విషయంలో సీఆర్పీసీ(high court on crpc) నిబంధనలు వర్తించకుండా ఎన్డీపీఎస్ నిషేధం లేదన్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసుల్లో వారెంట్ల జారీ, అరెస్టులు, సోదాలు, జప్తులు విషయంలో సీఆర్పీసీ నిబంధనలను వర్తిస్తాయి అని ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ 51 లోనే పేర్కొన్నారని తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసుల్లో ఏడేళ్లలోపు శిక్ష విధింపునకు వీలున్న వాటిలో సీఆర్సీపీ సెక్షన్ 41 (ఏ) వర్తిస్తుందని తీర్పు నిచ్చారు.

నగదు అక్రమ చలామణి చట్టం కింద నమోదైన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41 (ఏ) విధానాన్ని అనుసరించాలని దిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. పోలీసులు దురుద్దేశంతో వ్యవహరించడంతోపాటు చట్టవిరుద్ధమైన చర్యల నుంచి ప్రజల స్వేచ్ఛ, హక్కులను రక్షించేందుకు సీఆర్సీసీ సెక్షన్ 41, 41 ఏ తీసుకొచ్చారన్నారు . ప్రజల హక్కుల రక్షణ కోసం ఉద్దేశించిన ఆ సెక్షన్లను ప్రత్యేక చట్టాల విషయంలో మినహాయించడానికి వీల్లేదన్నారు. అనవసర, చట్టవిరుద్ధమైన అరెస్టుల నుంచి ప్రజలను రక్షించడం కోసం ప్రశంసనీయమైన ఉద్దేశంతో 41 ఏ తీసుకొచ్చారని తెలిపారు. అలాంటి సెక్షన్ను ప్రత్యేక చట్టాలకు వర్తించదు అన్న ఏపీపీ వాదనను అంగీకరించలేమన్నారు. ప్రస్తుత కేసులో సీఆర్పీసీ 41 ఏ నోటీసు నిబంధనలను పాటించాలని దర్యాప్తు అధికారిని ఆదేశిస్తున్నాం ' అని తీర్పులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

Tirumala: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.