అన్నారం గేట్ల వద్ద భారీగా ఇసుక మేట.. 30 గేట్లు తెరవడం కష్టమే..

author img

By

Published : Jul 31, 2022, 11:12 AM IST

annaram

భారీ వరదతో తెలంగాణలోని అన్నారం జలాశయం గేట్ల వద్ద భారీగా ఇసుక మేట వేసింది. దీంతో సుమారు 30 గేట్లను పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఆగస్టులో కూడా గోదావరికి వరద వచ్చే అవకాశముండటంతో.. ఈలోగా ఇసుకను తొలగించడానికి ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

భారీ వరదకు అన్నారం(సరస్వతి) పంపుహౌస్‌కే కాదు బ్యారేజీకీ కష్టాలొచ్చాయి. జలాశయం గేట్ల వద్ద భారీగా ఇసుక మేట వేసింది. దీంతో సుమారు 30 గేట్లను పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఆగస్టులో కూడా గోదావరికి వరద వచ్చే అవకాశం ఉండటంతో ఈలోగా ఇసుకను తొలగించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు దీనిగురించి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా అన్నారం(సరస్వతి) బ్యారేజీని నిర్మించారు. 1.27 కి.మీ పొడవుతో నిర్మించిన ఈ బ్యారేజీకి 15 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తుతో 66 గేట్లను అమర్చారు.

22.85 లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఈ గేట్ల నుంచి దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదకు ఈ బ్యారేజీ పంపుహౌస్‌ నీటమునిగింది. బ్యారేజీలో 30 గేట్ల వద్ద 2 నుంచి 4 మీటర్ల మేరకు ఇసుక మేట వేసింది. ఆ మేరకు నీటి విడుదల సామర్థ్యం, గేట్ల నిర్వహణపై ప్రభావం పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి దిగువన ఉన్న సుందిళ్ల బ్యారేజీ వద్ద నది సమతుల్యంలో ప్రవహించే అవకాశం ఉండగా, అన్నారం బ్యారేజీ వద్ద మాత్రం ఎడమవైపు కంటే కుడివైపు ఏడెనిమిది మీటర్ల ఎత్తు ఉంటుందని, దీనివల్ల ఈ బ్యారేజీ వద్ద ఇసుక మేట సమస్య ఏర్పడిందని నీటిపారుదలశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అన్నారం పంపుహౌస్‌ కూడా సుందిళ్ల(పార్వతి) బ్యారేజీకి దిగువన 1.8 కి.మీ దూరంలో ఉంటుంది. అన్నారం బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టం 119 మీటర్లు కాగా, అత్యధిక వరద మట్టం(హెచ్‌.ఎఫ్‌.ఎల్‌) 121 మీటర్లని, దీనిని పరిగణనలోకి తీసుకొని పంపుహౌస్‌ను 124 మీటర్ల వద్ద నిర్మించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే సుందిళ్ల బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టం 130 మీటర్లు కాగా, అత్యధిక వరద మట్టం 132.35 మీటర్లు. ఈ బ్యారేజి దిగువన అన్నారం పంపుహౌస్‌ ఉండటం వల్ల దీనికి సమస్య తలెత్తి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మోటార్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నం: నీటమునిగిన అన్నారం పంపుహౌస్‌లో మోటార్లను శుభ్రం చేసే పని జరుగుతోంది. వరద నుంచి నుంచి బయటపడిన మోటార్లను విప్పి సబ్బు నీటితో శుభ్రం చేయడం, తర్వాత మంచినీటితో కడగడం, హీటర్‌తో వేడి చేయడం, ఆరబెట్టడం ఇలా వివిధ దశల్లో పనులు చేయడంలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత సరిగా ఉన్నాయా లేదా పరిశీలించి అవసరమైన వాటికి మరమ్మతులు చేయడం, కొత్తవి వాడటం చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు మేడిగడ్డలో కంట్రోల్‌ రూము వరకు మాత్రమే నీటిని తోడి వాటిని శుభ్రం చేసే పనిని ప్రారంభించారు. పూర్తిగా నీటిని తోడటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

పైకి తేలిన లక్ష్మీ పంప్‌హౌస్‌ మోటార్లు: కాళేశ్వరం ప్రాజెక్టు.. లక్ష్మీ పంపుహౌస్‌లో వరద నీట మునిగిన మోటార్లు కొంతవరకు పైకి తేలినట్లు సమాచారం. ప్రాజెక్టుకు సంబంధించిన 17 మోటార్లు ఈ నెల 14న వరదనీటిలో మునిగిన విషయం తెలిసిందే. అధికారులు భారీ స్థాయిలో పంపులను అమర్చి ఈనెల 21 నుంచి నీటిని తోడివేస్తున్నారు. గతంలో మోటార్లు నడిచినప్పుడు పైభాగంలో ఒక విద్యుత్తు దీపం వెలుగుతుండేది. ఆ దీపాలు బయటపడినట్లు తెలియవచ్చింది. దీనిపై రామగుండం ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లును శనివారం 'ఈనాడు' సంప్రదించగా ఆదివారం పూర్తి స్థాయిలో మోటార్లు బయటపడతాయన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.