అవగాహనా లోపానికి.. మరొక యువకుడు బలి!

అవగాహనా లోపానికి.. మరొక యువకుడు బలి!
BTech Student Suicide in Hyderabad : "తెలిసీ తెలియక అప్పులు చేశా.. వాటిని తీర్చేలేకపోతున్నా.. చాలా అబద్ధాలు చెప్పా.. నా మాటలన్నీ నాటకమే.. దయచేసి అర్థం చేసుకోండి.. అమ్మా, నాన్న, తమ్ముళ్లు జాగ్రత్త’ అంటూ ఇంజినీరింగ్ పట్టభద్రుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
BTech Student Suicide in Hyderabad : "సూసైడ్ ఈజ్ నాట్ ఏ పర్మినెంట్ సొల్యూషన్.. ఫర్ టెంపరరీ ప్రాబ్లమ్స్.." దీని అర్థం.. "తాత్కాలిక సమస్యలకు ఆత్మహత్య అనేది శాశ్వత పరిష్కారం కాదు" అని. కానీ చాలా మంది.. ఈ చిన్న విషయాన్ని ఆలోచించలేక క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. నిండు జీవితాన్ని చేజేతులా మట్టిలో కలిపేసుకుంటున్నారు. కారణం చిన్నదైనా పెద్దదైనా ఆత్మహత్యే సమాధానంగా భావిస్తున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు. తాజాగా ఓ బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
Engineer Suicide in Hyderabad : గోపాలపురం సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్ వివరాల ప్రకారం.. వరంగల్ కాశీబుగ్గకు చెందిన మామిడి లక్ష్మిసాయి(22) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంటర్వ్యూ ఉందని గతనెల 31న నగరానికి వచ్చాడు. గురుద్వారా ప్రాంతంలోని లోటస్ గ్రాండ్ హోటల్‌లో దిగాడు. ఆ తర్వాత రెండురోజుల నుంచి కనిపించలేదు. రూమ్ కు రెంట్ చెల్లించలేదు. దీంతో.. రూమ్ బాయ్ శ్యామ్ గురువారం తలుపు కొట్టాడు. లక్ష్మీసాయి స్పందించకపోవడంతో హోటల్ యజమానికి తెలిపాడు. యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తలుపులు బద్ధలుకొట్టి చూడగా బాత్‌రూమ్‌లో బైండింగ్ వైర్‌తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
మృతుని వద్ద సూసైడ్ నోటు లభ్యమైంది. ‘తెలిసీ తెలియక అప్పులు చేశా.. వాటిని తీర్చేలేకపోతున్నా.. చాలా అబద్ధాలు చెప్పా.. నా మాటలన్నీ నాటకమే.. దయచేసి అర్థం చేసుకోండి.. అమ్మా, నాన్న, గుడి, తమ్ముళ్లు జాగ్రత్త’ అని సూసైడ్ నోట్లో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి చివరి ఫోన్‌కాల్ ఉండటంతో అదేరోజు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని భావిస్తున్నారు. సూసైడ్‌నోట్ ఆధారంగా అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. దర్యాప్తు చేపట్టారు.
