కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ ఎప్పుడు?

author img

By

Published : May 10, 2022, 4:57 AM IST

regularization

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రతిపక్ష నేతగా చెప్పిన జగన్​.. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకసారి మంత్రుల కమిటీ, వారికి సలహాలు ఇచ్చేందుకు మరో అధికారుల కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. అధికారంలోకి వస్తే రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో నమ్మి వెంట నడిచిన కాంట్రాక్టు ఉద్యోగులకు మూడేళ్లవుతున్నా ఎదురుచూపులు తప్పడం లేదు.

తాము అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రతిపక్ష నేతగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ ఇంతవరకు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఒకసారి మంత్రుల కమిటీ, వారికి సలహాలు ఇచ్చేందుకు మరో అధికారుల కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. పక్కనున్న తెలంగాణలో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మినిమం టైం స్కేల్‌ అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రెగ్యులర్‌ ఉద్యోగులకు లభించే సదుపాయాలు కాంట్రాక్టు వారికి అందడం లేదు. ప్రభుత్వంలో 13,671 మంది, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్‌లు కలిపితే 50,000 వరకు ఒప్పంద ఉద్యోగులు ఉంటారు. ప్రభుత్వంలో పని చేసేవారిలో అత్యధికంగా 6,400 మంది వరకు బోధన విభాగంలోనే ఉన్నారు. ఏటా ఏప్రిల్‌ వచ్చేసరికి తమ సర్వీసు పునరుద్ధరణ అవుతుందో లేదోనని వారు ఎదురుచూడాల్సిన దుస్థితి వస్తోంది. పీఎఫ్‌ సదుపాయం లేదు. ఆరోగ్యకార్డులు ఇవ్వడం లేదు.

కమిటీలతోనే కాలయాపన..

ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సేవల రెగ్యులరైజేషన్‌, సంబంధిత అంశాలపై అధ్యయనం చేసేందుకు 2019 జులై 10న ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి మంత్రులు కూడా మారిపోయారు. ఇంతవరకు దీనిపై నిర్ణయం వెలువడలేదు. ఈ కమిటీ ఒకటి, రెండు పర్యాయాలు మాత్రమే సమావేశమైంది. ఆ తర్వాత ఆ ఊసే లేకుండాపోయింది. మంత్రుల కమిటీకి సలహాలు ఇచ్చేందుకని 2019 నవంబరు 26న అధికారులతో వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. 2020 మార్చి 31లోపు నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఆ తర్వాత 2020 జూన్‌ 30 వరకు గడువు పొడిగించింది. మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి దాదాపు మూడేళ్లు కావొస్తుండగా.. అధికారుల కమిటీ నివేదిక సమర్పించే గడువు ముగిసి సుమారు రెండేళ్లు అవుతోంది. ఇంతవరకు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. అధికారంలోకి వస్తే రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో నమ్మి వెంట నడిచిన కాంట్రాక్టు ఉద్యోగులకు మూడేళ్లవుతున్నా ఎదురుచూపులు తప్పడం లేదు.

కరోనా కాటేసినా పరిహారం లేదు..

రాష్ట్రంలో 25 మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులు కరోనాతో చనిపోయారు. వారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం ఇస్తామని చెప్పినా ఒక్కరికీ ఇవ్వలేదు. ఒప్పంద ఉద్యోగుల సేవలను ఏటా పునరుద్ధరిస్తూ వస్తున్నారు. డిగ్రీ, పాలిటెక్నిక్‌, జూనియర్‌ కళాశాలల్లో కొత్త ఉద్యోగ నియామకాలు, బదిలీలు జరిగితే కొందరు పోస్టులు కోల్పోతున్నారు. ఇలా ఉద్యోగాలు పోయిన వారిని వెంటనే సర్దుబాటు చేయడం లేదు. మూడు, నాలుగు నెలల సమయం పడుతోంది. ఆ కాలంలో వేతనాలు ఇవ్వడంలేదు. కొన్నిసార్లు సొంత జిల్లాలు కాకుండా దూర ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఇటీవల కళాశాలల్లో జరిగిన బదిలీలు, కొత్త నియామకాలతో ఉద్యోగాలు పోయిన వారికి వంద కిలోమీటర్ల దూరంలోనూ పోస్టింగ్‌లు ఇచ్చారు. వైద్య, ఆరోగ్యశాఖలో కొందరు పదవీవిరమణ కూడా పొందుతున్నారు. వీరికి ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు. సెలవుల్లోనూ వ్యత్యాసాలు ఉన్నాయి. బోధన సిబ్బందికి ఏడాదికి కేవలం 10 సెలవులు మాత్రమే ఇస్తున్నారు.

ఆందోళనలకు సిద్ధం

‘ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌ ప్రతి సమావేశంలోనూ క్రమబద్ధీకరణ గురించి చెప్పారు. మేనిఫెస్టోలోనూ పెట్టారు. ఆ హామీ నిలబెట్టుకోకపోతే ఆందోళనలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం’’ -పెనుమర్తి వీరబాబు, కన్వీనర్‌, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘాల ఐకాస

అసెంబ్లీలో చెప్పినా చేయలేదు

‘‘ప్రతిపక్ష నేతగా సీఎం జగన్‌ అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికారంలోకి రాగానే క్రమబద్ధీకరిస్తామన్నారు. అర్హతలనుబట్టి రెగ్యులరైజ్‌ చేస్తామని సీఎంగా బాధ్యతలు చేపట్టాక అసెంబ్లీలో చెప్పారు. గతంలో హెచ్‌ఆర్‌ఏ, డీఏలను కలిపి కన్సాలిడేటెడ్‌ పే ఇచ్చేవారు. ఇప్పుడు బేసిక్‌ మాత్రమే ఇస్తున్నారు.’’- విజయకుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ సమాఖ్య

మేం అధికారంలోకి రాగానే..అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, చదివిన చదువులను పరిగణనలోకి తీసుకుంటాం. కాంట్రాక్టులో పని చేస్తున్నవారిలో వీలైనంత ఎక్కువమందిని రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇస్తున్నాం.- ఎన్నికల ముందు పలు సభలలో ప్రతిపక్ష నేతగా జగన్‌

న్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును బట్టి వీలైనంతమందిని రెగ్యులరైజ్‌ చేస్తాం.- వైకాపా మేనిఫెస్టోలో హామీ

న్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటను నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి.- పలు సభలలో ప్రతిపక్ష నేతగా జగన్‌

ఇదీ చదవండి: రాష్ట్రంలో బీహార్​ గన్​ కల్చర్​ దురదృష్టకరం: లోకేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.