Delhi Liquor Scam: వేడెక్కిన ఈడీ విచారణ.. ఇక నుంచి దిల్లీ కేంద్రంగా..

author img

By

Published : Sep 22, 2022, 9:48 AM IST

ED

Delhi Liquor Scam: దిల్లీ మద్యం ముడుపుల కేసులో ఈడీ విచారణ వేడెక్కుతోంది. తనిఖీల్లో బయటపడిన వివరాల ఆధారంగా.. అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఫార్మా సంస్థకు చెందిన ప్రముఖుడితో పాటు.. రెండు సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు చెందిన సంచాలకులు, వెన్నమనేని శ్రీనివాస్‌రావును విచారించారు. సోదాల్లో రాష్ట్రానికి చెందిన ముఖ్యుల వ్యాపార లావాదేవీల వివరాలు బయటపడినట్టు తెలుస్తోంది. స్థానికంగా సోదాలు పూర్తి కావడంతో మిగతా విచారణ దిల్లీ కేంద్రంగా కొనసాగనుంది. అవసరమైన వారిని దిల్లీకి పిలిపించి విచారించాలని ఈడీ నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి.

ఈడీ విచారణ

Delhi Liquor Scam: దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ దర్యాప్తు వేడెక్కుతోంది. సోదాల్లో వెల్లడైన వివరాల ఆధారంగా అధికారులు పలువురు అనుమానితుల్ని రహస్యంగా విచారిస్తున్నారు. ఇందులో ఓ ఫార్మా కంపెనీకి చెందిన ముఖ్యునితో పాటు రెండు సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు చెందిన డైరెక్టర్లూ, వెన్నమనేని శ్రీనివాసరావు ఉన్నారు. ఈ ఫార్మా ప్రముఖుడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలతో బంధుత్వం ఉండటం గమనార్హం. దాంతో పాటు ఈడీ సోదాల్లో అనూహ్యంగా తెలంగాణకు చెందిన మరికొందరు ముఖ్యుల వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలూ బయటపడ్డట్లు తెలిసింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ కేసు మరింత సంచలనాత్మకంగా మారే అవకాశం ఉంది.

దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. అందరి కళ్లూ దీనిపైనే కేంద్రీకృతమయ్యాయి. దీంతో అధికారులు రహస్యంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. ఓ ఫార్మా సంస్థకు చెందిన ప్రముఖుడిని రెండ్రోజులుగా ఇక్కడే విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఆయనతో పాటు రెండు సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు చెందిన భాగస్వాముల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.

గత సోమవారం రామంతపూర్‌, మాదాపూర్‌లలోని రెండు సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామంతపూర్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి పాల్గొన్నట్లు గుర్తించారు. ఆ ప్రజాప్రతినిధికి సదరు సంస్థ భాగస్వాములతో సన్నిహిత సంబంధాలున్నట్లు కూడా తేలింది. ఇక్కడ స్వాధీనం చేసుకున్న పత్రాలు, హార్డ్‌డిస్కులు పరిశీలించినప్పుడు వచ్చిన లాభాలకు, జరిగిన లావాదేవీలకు పొంతనలేదని, నిధుల మళ్లింపు కోసమే ఈ సంస్థను వాడుకొని ఉండవచ్చని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మాదాపూర్‌లోని సంస్థదీ ఇదే పరిస్థితి. దాంతో ఈ రెండు సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న నలుగుర్ని ఈడీ రెండ్రోజులుగా ప్రశ్నిస్తోంది.

పెద్ద ఎత్తున డొల్ల సంస్థలు

మద్యం కాంట్రాక్టులు దక్కించుకునేందుకు దిల్లీ వెళ్లడానికి ఫార్మా కంపెనీ ప్రముఖుడు విమానం సమకూర్చినట్లు, ఇందులోనే అనేకమార్లు ప్రయాణాలు చేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి రాబిన్‌ డిస్టిలరీస్‌, రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్స్‌లోకి ఎక్కడ నుంచి నిధులు వచ్చాయన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టగా అనేక సంస్థల పేర్లు బయటకు వస్తున్నాయి. వ్యాపార లావాదేవీల కోసం పెద్దఎత్తున డొల్ల సంస్థలు నెలకొల్పినట్లు, మూత పడ్డ కొన్నింటిని కొనుగోలు చేసినట్లు, వీటి ద్వారా ఎలాంటి వ్యాపారం నిర్వహించకపోయినా లాభాలు వచ్చినట్లు చూపించి వాటిని ఇతర సంస్థల్లోకి మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. దిల్లీ మద్యం ముడుపులతో ఈ సంస్థలన్నింటికీ సంబంధం లేకపోయినా నిధుల మళ్లింపు తీరు చట్ట విరుద్ధమే. దాంతో ఈ సంస్థలపైనా ఈడీ చర్యలు తీసుకోనుంది.

బయటపడ్డ ప్రముఖుల గుట్టు!

దర్యాప్తులో భాగంగా యాదృచ్ఛికంగా మరికొందరు ప్రముఖుల గుట్టూ బయటపడ్డట్లు సమాచారం. ఈడీ అధికారులు గత సోమవారం దోమలగూడలోని గోరంట్ల అసోసియేట్స్‌ అనే ఆడిటింగ్‌ సంస్థలోనూ సోదాలు నిర్వహించారు. అనుకోకుండా ఇక్కడ కొందరు ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఈడీకి చిక్కినట్లు తెలుస్తోంది. మద్యం ముడుపులతో వీరికి సంబంధం ఉన్నా, లేకపోయినా ఆయా ప్రముఖుల ఆర్థిక మూలాలను ఛేదించడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వెన్నమనేని శ్రీనివాసరావు వ్యవహారం కూడా ఇలానే బయటపడింది. ఇప్పుడు మొత్తం దర్యాప్తునకు ఆయనే కీలకంగా మారారు. స్థానికంగా ఈడీ సోదాలు పూర్తికావడంతో అవసరమైన వారిని దిల్లీకి పిలిపించి విచారించనున్నట్లు, దీనికి సంబంధించి త్వరలోనే మరికొందరికి నోటీసులు కూడా జారీచేయనున్నట్లు తెలుస్తోంది.

నిధుల మళ్లింపు వ్యవహారం చట్ట విరుద్ధం..: మూతపడిన మరికొన్నింటిని కొనుగోలు చేసి ఎలాంటి వ్యాపారం చేయకుండానే లాభాలు వచ్చినట్లు చూపించి.. ఇతర సంస్థల్లోకి వాటిని మళ్లించినట్లు విచారణలో బయటపడిందని తెలుస్తోంది. ఈ కేసులో సంస్థలన్నింటికీ సంబంధం లేకపోయినా నిధుల మళ్లింపు వ్యవహారం చట్ట విరుద్ధమేనని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈడీ ఆయా సంస్థలపైన చర్యలు చేపట్టనుందని సమాచారం.

దర్యాప్తు సంస్థ విచారణలో మరికొందరు ప్రముఖుల గుట్టు బయటపడినట్లు తెలుస్తోంది. గోరంట్ల అసోసియేట్స్‌లో సోదాలు జరిపినప్పుడు ఈడీకి కొందరు ప్రజాప్రతినిధుల ఆర్ధిక లావాదేవీల వివరాలు దొరికాయి. ఆయా ప్రజాప్రతినిధులకు ఈ సంస్ధ ఆడిటింగ్‌ నిర్వహిస్తోంది. వెన్నమనేని శ్రీనివాస్‌రావు విషయంలోనూ పలు వివరాలు బయటపడ్డాయి. ఇక్కడ తనిఖీలు నిర్వహించే వరకు మద్యం కేసుతో వెన్నమనేని శ్రీనివాస్‌కు సంబంధం ఉన్న సంగతి బయటకు రాలేదు. ఈ కేసు విచారణలో ఆయనే ప్రస్తుతం కీలకంగా మారారు. ఈడీ విచారణ ఇక నుంచి దిల్లీ కేంద్రంగా కొనసాగనుండగా పలువురిని దిల్లీకి పిలిపించి అక్కడే విచారించనున్నారు.


ఇవీ చదవండి: పీఎఫ్ఐ కార్యకలాపాలపై దేశవ్యాప్తంగా సోదాలు.. 100 మంది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.