విద్యాశాఖలో కొత్త పోస్టులు.. పదోన్నతులకూ మోక్షం ఎప్పుడో..!

author img

By

Published : May 10, 2022, 4:57 AM IST

Updated : May 10, 2022, 6:11 AM IST

ఉద్యోగులు

నూతన విద్యా విధానంతో అనేక మందికి పదోన్నతులు వస్తాయని విద్యాశాఖ ప్రకటించింది. కొత్తగా ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టుల సృష్టిస్తామని ప్రకటన ఇచ్చింది. ఇప్పుడు వీటిపై ఎలాంటి కసరత్తు సాగడం లేదు. మరోవైపు 21వేల మంది ఎస్జీటీలకు పదోన్నతులు ఎప్పుడిస్తారోనని ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు.

నూతన విద్యా విధానంతో అనేక మందికి పదోన్నతులు వస్తాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మండల విద్యాధికారి (ఎంఈఓ), డిప్యూటీ డీఈఓ పోస్టులను కొత్తగా సృష్టిస్తామని పేర్కొంది. పీఆర్సీ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులను ఆకట్టుకునేందుకు అనేక ప్రకటనలు చేసింది. ఇప్పుడు వీటిపై ఎలాంటి కసరత్తు సాగడం లేదు.

* మండలానికి రెండు ఎంఈఓ పోస్టులను ఏర్పాటు చేస్తామని ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించేందుకు ఒకరు, పంచాయతీరాజ్‌ పాఠశాలలకు మరొకరు ఉంటారని పేర్కొన్నారు. ఇందుకోసం కొత్తగా 666 పోస్టులు సృష్టిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదన మూలకు చేరింది. కొత్తగా ఎంఈఓ పోస్టులు వస్తే పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులకు భారీగా పదోన్నతులు వస్తాయని ఆశించారు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం కష్టంగా మారింది.

* పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల కోసం 49 డిప్యూటీ డీఈఓ పోస్టులను ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయ సంఘాలకు ఉన్నతాధికారి తెలిపారు. ఈ పోస్టులను సృష్టించేందుకు ఆర్ట్‌, క్రాఫ్ట్‌ టీచర్ల పోస్టులను రద్దు చేయాలని నిర్ణయించారు. దీనికి ఆర్థికశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదు.

* రాష్ట్ర వ్యాప్తంగా 424 పాఠశాలలను ఉన్నతీకరించారు. వీటికి ఇంతవరకు ప్రధానోపాధ్యాయ పోస్టులను కేటాయించలేదు. పోస్టులను సృష్టించి, పదోన్నతుల ద్వారా వీటిని భర్తీ చేయాల్సి ఉండగా జాప్యం చేస్తున్నారు.

* ప్రాథమిక ఉర్దూ మాధ్యమ పాఠశాలలను ఉన్నతీకరించారు. 660 పోస్టుల భర్తీకి 2017-18లోనే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అప్పట్లో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి దీన్ని నిలిపేశారు. అటు ఖాళీలు భర్తీ లేక.. ఇటు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను ఏర్పాటు చేయకపోవడంతో ఉర్దూ విద్యార్థులు నష్టపోతున్నారు.

జూనియర్‌ కళాశాలల్లో ఎలా?

ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ను ప్రారంభించనున్నారు. అమ్మాయిలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న వాటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 350 కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నారు. వీటిలో లెక్చరర్ల పోస్టులను వారి పే స్కేల్‌తో సమానంగా గెజిటెడ్‌ హోదా ఇస్తూ పీజీటీలతో భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. కేవలం పీజీటీ స్కేల్స్‌తో భర్తీ చేస్తే నష్టపోతామని పేర్కొంటున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ గత కొన్నేళ్లుగా నిలిచిపోయింది. ఇప్పుడు కొత్త కళాశాలల్లో లెక్చరర్‌ పే స్కేల్‌ ఇవ్వకపోతే ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెల్లడిస్తున్నాయి.

పదోన్నతులకు ఎదురుచూపులు

ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. విలీనమైన 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధించేందుకు 21వేల మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు (ఎస్జీటీలు) స్కూల్‌ అసిస్టెంట్లుగా (ఎస్‌ఏలు) పదోన్నతి ఇస్తామన్నారు. ఉన్నత పాఠశాలలకు 3 కిలోమీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల మ్యాపింగ్‌ పూర్తి చేశారు. 250 మీటర్ల దూరంలోని వాటిని అధికారికంగా విలీనం చేశారు. 21వేల మంది ఎస్జీటీలకు పదోన్నతులు ఎప్పుడిస్తారోనని ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి: ఆడపిల్ల పుట్టిందని.. భార్యనే వద్దన్న బ్యాంకు మేనేజర్..!

Last Updated :May 10, 2022, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.