ఓటుకు నోటే కాదు.. ఓటరు కార్డు కావాలన్నా నోటు ఇవ్వాల్సిందే..!

author img

By

Published : Jun 24, 2022, 9:24 AM IST

Corruption in Voter Cards Distribution

Corruption in Voter Cards Distribution : ఓటుకు నోటు అనే మాట వింటుంటాం కానీ.. ఓటరు గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియలోనూ అవినీతి చోటుచేసుకుంటోంది. కొత్త ఓటరు కార్డు, ఓటరు కార్డు సవరణ, గుర్తింపుకార్డు తొలగింపు, ఇతర మార్పుల కోసం వచ్చే అర్జీల పరిశీలనకు కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రచురించిన కొత్త ఓటరు జాబితా సవరణలో జరిగిన అవకతవకలే అందుకు నిదర్శనం.

Corruption in Voter Cards Distribution : ఏటా ఓటరు జాబితా సవరణ జరుగుతుంది. ఎస్‌ఎస్‌ఆర్‌ పేరుతో జిల్లా ఎన్నికల అధికారులు ప్రక్రియ చేపడతారు. బూత్‌స్థాయి అధికారులు(బీఎల్‌ఓ), కంప్యూటర్‌ ఆపరేటర్లతో దరఖాస్తుల పరిశీలన, నివేదికల వంటి పనులు చేయిస్తారు. బల్దియా పరిధిలో అర్జీల పరిశీలన అవినీతిమయం అయింది. గతేడాది డిసెంబరులో ఫారం-6, 6ఏ, 7, 8, 8ఏ, ఇంటి నంబరు లేని అర్జీల పరిశీలనకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. జోనల్‌ కమిషనర్లు నియోజకవర్గాల వారీగా ఓటరు సవరణ కోసం ప్రత్యేకంగా కంప్యూటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లను సమకూర్చుకునేందుకు టెండర్లు పిలిచారు. ఒక్కో నియోజకవర్గానికి 30 కంప్యూటర్లు, 30 మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. నకిలీ సంస్థలను సృష్టించి, వాటికి నామినేషన్ల కింద పనులు ఇచ్చారు. రూ.లక్ష దాటితే అధికారికంగా టెండరు పిలవాలి. పనులను ముక్కలుగా విడగొట్టి రూ.90 వేలతో నామినేషన్‌ కింద ఏజెన్సీలకు అప్పగించారు. రూ.2 కోట్ల మేర ఈ తరహా బిల్లులు ఆమోదం పొందాయి. ఆ నిధులను అధికారులు, బినామీ ఏజెన్సీలు పంచుకున్నాయి.

తూతూమంత్రంగా గుర్తింపు కార్డులు.. : అధికారులు డబ్బులివ్వకుండా పని చేయించుకుంటారనే కారణంతో.. చాలామంది ఓటర్ల తొలగింపు, ఓటరు గుర్తింపు కార్డుల జారీ, సవరణ, నియోజకవర్గాల మార్పునకు సంబంధించిన దరఖాస్తులను సవ్యంగా విచారించట్లేదు. దీంతో నకిలీ ఓటర్ల సంఖ్య జాబితాలో భారీగా పెరిగింది. నగరంలో ప్రస్తుతం 89 లక్షల మంది ఓటర్లుంటే.. అందులో 11.5 లక్షల ఓటరు కార్డుల వివరాలు గందరగోళంగా ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆ విషయాన్ని గుర్తించింది. ఒకే పేరు, ఫొటోతో ఉన్న గుర్తింపు కార్డుల వివరాలన్నింటినీ ఇటీవల సంబంధిత సర్కిల్‌ కార్యాలయాలకు పంపింది. వాటిని పరిశీలించే ప్రక్రియపైనా విమర్శలు వస్తున్నాయి. పాతబస్తీలో నకిలీ ఓటర్ల గుర్తింపు పూర్తిగా పడకేసింది. నకిలీ ఓటర్ల పేరుతో కార్డులను రద్దు చేయొద్దని రాజకీయ పార్టీలు హెచ్చరించడంతో.. అధికారులు సవరణను తూతూమంత్రంగా పూర్తి చేస్తున్నారు. మొత్తంగా.. ఎన్నికల విభాగం ఉన్నతాధికారులు ఓటరు జాబితా ప్రక్షాళనపై నిబద్ధతతో పని చేయట్లేదన్న విమర్శలొస్తున్నాయి.

సిబ్బంది ఆగ్రహం.. : పారిశుద్ధ్య, దోమల నివారణ విభాగం ఉన్నతాధికారుల ఆదేశాలతో కంప్యూటరు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఆయా విభాగాల్లోని సిబ్బంది పూర్తి చేశారు. కొన్ని రోజులు రాత్రి విధులూ నిర్వర్తించారు. అందుకు ఏజెన్సీలు డబ్బు చెల్లిస్తాయంటూ ఉన్నతాధికారులు సిబ్బంది నుంచి బ్యాంకు ఖాతా సంఖ్యలు, ఫోన్‌ నంబర్లు కూడా తీసుకున్నారు. చివరకు..ఖాతాల్లో కాకుండా, అధికారులే నేరుగా బిల్లులు తీసుకున్నారు. విషయం తెలుసుకుని.. కొందరు సిబ్బంది అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. కొన్ని సర్కిళ్లలో ఒక్కొక్కరికి రూ.5వేల నుంచి రూ.6వేలు ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.