Rajagopal Reddy: కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్​ బై.. సోనియాకు రాజీనామా లేఖ

author img

By

Published : Aug 4, 2022, 7:53 PM IST

MLA Rajagopal Reddy

MLA Rajagopal Reddy resigns to congress party: తెలంగాణలో కాంగ్రెస్‌కు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అధికారికంగా రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు రాజీనామా లేఖను పంపారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌లో 30ఏళ్లు సుశిక్షితుడైన కార్యకర్తగా పని చేశానని వెల్లడించారు. ఏ పని అప్పగించినా రాజీ పడకుండా పార్టీ కోసం పని చేశానని తెలిపారు. కష్టాలను దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ఠ కోసం పాటుపడ్డానని వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజులుగా నడుస్తోన్న మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా ఎపిసోడ్​కు ఆగస్టు 2న ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. అయితే గురువారం రోజు.. కాంగ్రెస్​కు రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు రాజీనామా లేఖను పంపారు.

ఆ వ్యక్తి కింద పని చేయలేను.. అందుకే రాజీనామా...

'' 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా ఎక్కడ రాజీ పడకుండా కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం, కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రస్థానం సాగించాను. కానీ గడిచిన కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తూ... విస్మరిస్తూ... పార్టీ ద్రోహులు... మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించటం నన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పటికే అనేక పార్టీలు మార్చి, స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను.

తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్న విషయం మీకు తెలియనది కాదు. 60 ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేసిన విషయం మీకు తెలిసిందే. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది. ఈ బంధీ నుంచి విడిపించేందుకు తెలంగాణాలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నా. అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎమ్మెల్యేలలో మనోధైర్యం నింపి పోరాట కార్యాచరణ రూపొందించలేక కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు. అందుకే సబ్బండవర్గాలు కోరుకున్న ప్రజా తెలంగాణలో, ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నేను నిర్ణయించుకున్నా... ఈ దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి ఆమోదించగలరు.'' లేఖలో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలు

MLA Rajagopal Reddy
కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్​ బై
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.