అధికార పార్టీ సేవలో తరిస్తున్న సీఐడీ.. ప్రభుత్వ వ్యతిరేక పోస్టు కనిపిస్తే చాలు..!

author img

By

Published : Sep 26, 2022, 7:01 AM IST

Crime Investigation Department

Crime Investigation Department : పోలీసులు అంటే చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడే రక్షకులు. తటస్థంగా ఉంటూ.. నేరానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా ఒకేలా వ్యవహరిస్తూ ఉంటారు . కానీ రాష్ట్ర సీఐడీ తీరు అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. అధికార వైకాపా నాయకులు ఎలాంటి నేరం చేసినా ఒప్పే.. ప్రతిపక్ష నాయకులు, ఇతర వర్గాల వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా మహా నేరమే అన్నట్లు వ్యవహరిస్తోంది. న్యాయవ్యవస్థపై దాడి జరుగుతున్నా.. పట్టనట్లు ఉంటోంది. తాజాగా సీఎంవోలోని ఓ అధికారికి వ్యతిరేకంగా వాట్సప్‌లో వచ్చిన ఓ పోస్టును ఫార్వర్డ్‌ చేశారన్న ఆరోపణపై 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్‌ పాత్రికేయుడు కొల్లు అంకబాబును అరెస్టు చేసింది. ఈ కేసులో న్యాయస్థానం చివాట్లూ తింది. స్వయంగా హైకోర్టే మందలించినా సీఐడీ తీరు మారడం లేదు. అధికార పార్టీ సేవలోనే మునిగితేలుతోంది.

CID : ‘అధికార పార్టీ నేతలపై, రాష్ట్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా పోస్టింగులు పెడితే వెంటనే స్పందిస్తున్న సీఐడీ.. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగులు పెట్టిన వారిపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు? 19 మందిపై పేర్లతో సహా ఫిర్యాదు ఇస్తే.. ముఖ్య నేతల్ని వదిలేసి 9 మందిపైనే ఎందుకు కేసులు నమోదు చేశారు? న్యాయ వ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అభ్యంతరకరమైన దాడి జరుగుతుంటే హైకోర్టుకు మద్దతుగా ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదు? అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన సీఐడిని గతంలో నిలదీసింది. అంతేకాదు రాష్ట్ర పోలీసులకు చట్టబద్ధ పాలన అంటే గౌరవం లేదు.

ముఖ్యమంత్రి విషయంలో అత్యుత్సాహం : హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఉత్సాహం చూపని పోలీసులు.. ముఖ్యమంత్రిని దూషించారనే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అరెస్టులు చేస్తున్నారు. గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు. ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు.’ అని పోలీసులు తీరును తప్పుబడుతూ వ్యాఖ్యానించింది. పోలీసుల, సీఐడీ ఏకపక్ష, పక్షపాత ధోరణిని తప్పుబడుతూ హైకోర్టు వివిధ సందర్భాల్లో హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదు.

ప్రతిపక్షాలపై వేధింపులే ప్రధాన విధి : రాష్ట్ర సీఐడీ విభాగం.. అధికార వైకాపా ప్రయోజనాల పరిరక్షణ, ప్రతిపక్షాలపై వేధింపులే ప్రధాన విధి, బాధ్యత అన్నట్లు పని చేస్తోంది. ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తోంది. విధానాల్లోని లోపాల్ని ఎత్తిచూపుతూ సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేస్తే అరెస్టులు చేస్తోంది. సీఎం, మంత్రులను విమర్శిస్తే.. అక్రమంగా నిర్బంధిస్తోంది. కొన్నిసార్లు థర్డ్‌ డిగ్రీ చిత్రహింసలకూ గురి చేస్తోంది. ఐటీడీపీ కార్యకర్తలు, యూట్యూబ్‌ ఛానళ్ల నిర్వాహకులపై పదుల సంఖ్యలో కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది. ప్రతిపక్ష నాయకుల్ని దుర్భాషలాడుతూ.. వారి చిత్రాలు మార్ఫింగ్‌ చేస్తూ.. వారి కుటుంబంలోని మహిళలపై వైకాపా సానుభూతిపరులు, కార్యకర్తలు, అభ్యంతరకర పోస్టులు పెట్టినా ..కనీస చర్యలు తీసుకోవడం లేదు.

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైకాపా నాయకులు, సానుభూతిపరులు.. పోస్టులు పెడితే హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదు ఇచ్చేంతవరకూ సీఐడీ కేసు పెద్దలేదు. తప్పనిసరై కేసు కట్టినా నిందితులపై చర్యలు తీసుకోలేదు. నిందితులంతా వైకాపా సానుభూతిపరులు, ఆ పార్టీతో అనుబంధం ఉన్నవారు కావటమే దీనికి ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. హైకోర్టే జోక్యం చేసుకుని ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాతే నిందితులు అరెస్టు అయ్యారు .

ఫిర్యాదు చేసి రెండేళ్ల అవుతున్న కేసు లేదు : రాజధాని మహిళా రైతులపై వైకాపా నాయకులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేసి రెండేళ్లు దాటినా ఇప్పటికీ కేసు లేదు. తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిపై అసభ్యకర పోస్టులు పెట్టి.. రెండేళ్లు అవుతున్నా చర్యలు లేవు. చంద్రబాబు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రికా ప్రకటన విడుదల చేశారని.. తెదేపా నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేస్తే స్పందించలేదు. నకిలీ ప్రెస్‌నోట్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలపై మాత్రం కేసులు పెట్టారు.

సుప్రీంకోర్టు హెచ్చరిస్తున్న మారని ధోరణి : ఏడేళ్ల లోపు శిక్ష పడే అవకాశమున్న కేసుల్లో నిందితులకు సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 41ఏ ప్రకారం నోటీసులిస్తే సరిపోతుంది. కానీ సీఐడీ అధికారులు ఆ నిబంధనలను పాటించకుండా.. అరెస్టు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు పదేపదే సీఐడీ తీరును తప్పుపడుతూ నిందితులకు రిమాండు ఇవ్వడానికి నిరాకరిస్తున్నప్పటికీ సీఐడీ ధోరణి మారట్లేదు. అప్పటికే నిందితులను హింసించినందున తాము అనుకున్న పనైపోయిందని భావిస్తోంది. యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకులు గార్లపాటి వెంకటేశ్వరరావు, వెంగళరావు, తాజాగా జర్నలిస్ట్ అంకబాబు విషయంలోనూ సీఐడీ ఈ పద్ధతినే పాటించింది. సీఐడీ ఉద్దేశపూర్వకంగానే వ్యూహాత్మకంగా అరెస్టుల చేస్తోందని న్యాయవాదులు, ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

విచారణ పేరిట వేధింపులు : ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తింది ఎవరైనా సరే.. వారిపై కేసులు పెట్టి అణచేస్తోంది. విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ ప్రమాదంపై ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు షేర్‌ చేసినందుకు పి.రంగనాయకి అనే 60 ఏళ్ల వృద్ధురాలిపై సీఐడీ కేసు నమోదు చేసింది. విచారణ పేరిట వేధింపులకు గురిచేసింది. ప్రభుత్వ విధానాల్లోని లోపాల్ని ఎత్తి చూపుతూ విమర్శలు చేసే వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపైనా, వాటిని ప్రసారం చేశారంటూ మీడియా ఛానళ్లపైనా రాజద్రోహం కేసులు పెట్టారు.

సీఐడీ పోలీసులు తనను కస్టడీలోకి తీసుకుని థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని, చిత్రహింసలకు గురిచేశారని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఓ మంత్రిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టు ఫార్వర్డ్‌ చేశారంటూ విశాఖకు చెందిన నలంద కిశోర్, కృష్ణా జిల్లాకు చెందిన చిరుమామిళ్ల కృష్ణారావులపై సీఐడీ కేసు నమోదు చేసింది. నలంద కిషోర్‌ను విశాఖ నుంచి కర్నూలుకు తరలించింది. తర్వాత కొద్ది రోజులకే ఆయన మరణించారు.

ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలకు సంబంధించి వీడియోలను మార్ఫింగ్‌ చేసి ప్రదర్శించారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సీఐడీ కేసు పెట్టింది. విచారణ పేరిట వేధించింది. ఓ నకిలీ ప్రెస్‌నోట్‌ను సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్‌ చేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకురాలు గౌతు శిరీషకు ఒకరోజు రాత్రి 10న్నర గంటల సమయంలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. వారు రాసుకొచ్చిన వాంగ్మూలంపై సంతకం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసిన తర్వాత 24 గంటల్లోగా వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ ఏపీ సీఐడీ ఆ నిబంధనలేవీ పాటించట్లేదు. ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ రహస్యంగానే ఉంచుతోంది. నిందితులకు, వారి తరఫు న్యాయవాదులకు వెంటనే ఎఫ్‌ఐఆర్‌ లభించని పరిస్థితి ఉంటోంది. ముందస్తు బెయిలు పొందకుండా ఉండేందుకు, న్యాయస్థానాల్ని ఆశ్రయించే వీల్లేకుండా చేసేందుకే సీఐడీ ఇలా వ్యవహరిస్తోందని న్యాయనిపుణులు అంటున్నారు.

అధికార పార్టీ సేవలో తరిస్తున్న సీఐడీ.. ప్రభుత్వ వ్యతిరేక పోస్టు కనిపిస్తే చాలు..!
ఇవీ చదవండి:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.