అమరావతి అసైన్డ్‌ భూముల కేసు.. ఐదుగురు అరెస్ట్​.. ఇద్దరి రిమాండ్​ తిరస్కరణ

author img

By

Published : Sep 13, 2022, 5:50 PM IST

Updated : Sep 14, 2022, 11:12 AM IST

Amaravati Assigned Lands

Amaravati Assigned Lands Case : అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఐదుగురు వ్యక్తులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అమరావతిలో 89.8 ఎకరాల అసైన్డ్ భూములు కొన్నారని.. సీఐడీ అభియోగాలు మోపింది.

CID Officers Arrest Five Persons : రాజధాని అమరావతి పరిధిలో ఎసైన్డ్‌ భూములను మాజీమంత్రి పొంగూరు నారాయణ తన బంధువులు, అనుచరులతో అక్రమంగా కొనిపించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో సీఐడీ అధికారులు మంగళవారం అయిదుగుర్ని అరెస్టుచేశారు. రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఉద్యోగులు కొల్లి శివరామ్‌, గట్టెం వెంకటేశ్‌తో పాటు విశాఖపట్నానికి చెందిన చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి కృష్ణ దొరబాబును అరెస్టు చేశారు. వీరిలో శివరామ్‌, వెంకటేశ్‌లను న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే, వారిని జ్యుడిషియల్‌ రిమాండుకు ఇవ్వాలన్న సీఐడీ అభ్యర్థనను ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలేనికి చెందిన యలమటి ప్రసాద్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై 2020లో నమోదైన కేసులో ఈ అరెస్టులు చేశారు. మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యులు.. రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ కేవీపీ అంజనీకుమార్‌తో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీఐడీ తెలిపింది. భూ సమీకరణ పథకంలో భాగంగా ఎసైన్డ్‌ భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించదని, వాటిని ఎసైనీల నుంచి స్వాధీనం చేసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మధ్యవర్తులు, స్థిరాస్తి వ్యాపార ఏజెంట్లతో బెదిరించి.. మాజీమంత్రి నారాయణ, ఆయన అనుచరులు నిర్ణయించిన ధరకే రైతులు అమ్ముకునేలా చేశారని తమ దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది. రాజధానిలో 1,100 ఎకరాల ఎసైన్డ్‌ భూముల్లో అక్రమ లావాదేవీలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. 169.27 ఎకరాల ఎసైన్డ్‌ భూములకు సంబంధించి నారాయణ, ఆయన కుటుంబసభ్యులు, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య రూ.15 కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిచినట్లు తమ దర్యాప్తులో గుర్తించామని వివరించింది. ఈ సొమ్మును అమరావతిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అతి తక్కువ ధరకు ఎసైన్డ్‌ భూములు కొనేందుకు వినియోగించినట్లు తేల్చామని చెప్పింది.

రామకృష్ణ హౌసింగ్‌ ఖాతాలు వినియోగించారు

* ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అక్రమంగా ఎసైన్డ్‌ భూములను కొన్నారని, వారికి డబ్బులు చెల్లించడానికి రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ బ్యాంకు ఖాతాలను వినియోగించారని సీఐడీ తెలిపింది. కొనుగోలు, డబ్బుల చెల్లింపుల్లో రామకృష్ణ హౌసింగ్‌ ఉద్యోగులు చురుగ్గా వ్యవహరించారని పేర్కొంది.

* మాజీమంత్రి నారాయణ.. ఎసైన్డ్‌ భూములను అక్రమంగా కొనిపించినట్లు అప్పట్లో పనిచేసిన అధికారుల వాంగ్మూలాల ద్వారా వెల్లడైందని, భూ సమీకరణ పథకంలో భాగంగా ఎకరాకు 800 చదరపు గజాల నివాసస్థలం, మెట్ట భూములకు 100 చదరపు గజాలు, జరీబు భూములకు 200 చదరపు గజాల చొప్పున వాణిజ్య స్థలం బినామీల ద్వారా ఆయన పొందారని సీఐడీ వివరించింది.

* 2014-2019 మధ్య పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ తన హోదాను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని, వ్యక్తిగత లబ్ధి పొందేలా వ్యవహరించారని సీఐడీ అభియోగం మోపింది.
వారంతా నారాయణ సన్నిహిత బంధువులు

* ధూళిపాళ్ల వెంకట శివ పంకలరావు, ఆయన భార్య పద్మావతి, వారి కోడలు డి.సృజన, లక్ష్మీశెట్టి సుజాత, లక్ష్మీశెట్టి సూర్యనారాయణ, అంబటి సీతారాము, లక్కకుల హరిబాబు, లక్కకుల పద్మావతి, చిక్కాల విజయసారథి, పర్చూరి వెంకయ్య భాస్కరరావు, పర్చూరి వి.ప్రభాకర్‌రావు, కొండయ్య బాలసుబ్రమణ్యం, ఆయన భార్య కొండయ్య విజయ, కొండయ్య వెంకటేశ్‌.. వీరంతా మాజీ మంత్రి నారాయణకు సన్నిహిత బంధువులని సీఐడీ ఆరోపించింది.

* పైన పేర్కొన్నవారంతా రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల్లో 89.80 ఎకరాల ఎసైన్డ్‌ భూమిని కొన్నట్లు సీఐడీ తెలిపింది. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22ఏ ప్రకారం ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని, వారి పేర్లతో 84 సేల్‌డీడ్‌లు పొందారని... యాగంటి శ్రీకాంత్‌, కొల్లి శివరామ్‌, గుమ్మడి సురేష్‌ పేరిట 72 జీపీఏలు పొంది వాటిని మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇచ్చారని సీఐడీ వివరించింది.

* ఈ అక్రమ లావాదేవీలను అప్పటి మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ గోపాల్‌ తిరస్కరించారు. సేల్‌డీడ్‌ల రిజిస్ట్రేషన్‌ జరిగేలా ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. మోసపూరిత పద్ధతిలో ఎస్సీల నుంచి ఇలా ఎసైన్డ్‌ భూములు పొందటం ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం ప్రకారం కూడా నేరమని సీఐడీ చెప్పింది.

* మరికొందరు నిందితులు, వారి అనుచరులు ఎసైన్డ్‌ భూములకు 76 సేల్‌డీడ్‌లు పొందారని, అవే భూములకు గుమ్మడి సురేష్‌, కొల్లి శివరామ్‌ జీపీఏలు పొందారని సీఐడీ అభియోగం మోపింది.

* స్థిరాస్తి వ్యాపారంలో మధ్యవర్తులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, గుమ్మడి సురేష్‌, రెహమాన్‌, పొట్లూరి జయంత్‌, వెంకట సుబ్బయ్య, పిడపర్తి టిటుస్‌ బాబు, శీలం శ్రీనివాసరావు తదితరులు ఎసైన్డ్‌ భూముల కొనుగోళ్లపై రైతులతో మధ్యవర్తిత్వం చేశారని సీఐడీ తెలిపింది.

కేసు డైరీని ఎప్పటికప్పుడు ఎందుకు కోర్టుముందు ఉంచలేదు?

రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూములను అక్రమంగా కొన్నారన్న ఆరోపణలతో 2020లో కేసు నమోదు చేస్తే... కేసు డైరీని ఎప్పటికప్పుడు న్యాయస్థానం ముందు ఎందుకు ఉంచలేదని విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి సీఐడీ అధికారులను ప్రశ్నించారు. ఆ భూములను ఎవరు అమ్మారు? ఎవరు కొన్నారు? ఎవరికి, ఎంత నష్టం వాటిల్లిందనే వివరాలు ఎందుకు లేవని ప్రశ్నించింది. ఈ కేసులో అరెస్టయిన కొల్లి శివరామ్‌, గట్టెం వెంకటేశ్‌లకు జ్యుడిషియల్‌ రిమాండు విధించాలని కోరుతూ వారిని సీఐడీ అధికారులు మంగళవారం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా... న్యాయమూర్తి రిమాండు తిరస్కరించారు. నిందితులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కారని.. అలాంటప్పుడు వారికి ఐపీసీ 409 (ప్రభుత్వోద్యోగి నేరపూరిత విశ్వాసఘాతుకానికి పాల్పడటం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు ఎలా వర్తింపజేస్తారని సీఐడీ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ సెక్షన్లు నిందితులకు వర్తించవన్నారు. ఈ కేసులో పొందుపరిచిన మిగతా సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలుశిక్ష పడే వీలున్నవే కాబట్టి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్‌ కింద నిందితులకు నోటీసులిచ్చి, వివరణ తీసుకోవాలని సీఐడీని ఆదేశించారు. వారికి రిమాండు విధించాలన్న సీఐడీ అధికారుల వినతిని తిరస్కరించారు. నిందితుల తరఫున న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, గూడపాటి లక్ష్మీనారాయణ, మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 14, 2022, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.