జగనన్న ఇంటి నిర్మాణానికి.. ఇచ్చేది గోరంత.. ఖర్చయ్యేది కొండంత..

author img

By

Published : Jun 20, 2022, 3:54 AM IST

building a house cost in Jagannath colonies much higher than money given by AP government

జగనన్న కాలనీల్లో ఇల్లు కేటాయించారన్న సంతోషం కంటే... ఎలా పూర్తిచేయాలన్న ఆందోళనే పేదలను ఎక్కువగా వేధిస్తోంది. ఇంటి నిర్మాణానికి లక్షా 80 వేలు ఇస్తున్నామని రాష్ట్రం ఘనంగా చెబుతున్నా.... అది పూర్తిగా కేంద్ర సాయమే. లక్షా 80 వేలతోనే ఇల్లు కట్టేయవచ్చని లెక్కలు కట్టినా... అదికూడా 2020 డిసెంబర్ నాటి ధరల ప్రకారం వేసిన అంచనానే. అప్పటికి, ఇప్పటికి ధరల్లో ఏమాత్రం పొంతన లేదు. కనీసం 5 లక్షలైనా లేనిదే సాదాసీదా ఇల్లు కట్టుకోవడమూ కష్టమే. ఈ పరిస్థితుల్లో నిరుపేద లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం వంతుగా కనీసం 2లక్షలైనా ఇస్తే తప్ప... గృహ నిర్మాణాలు వేగవంతమయ్యే అవకాశం కనిపించడం లేదు.

జగనన్న కాలనీల్లో స్థలం ఇస్తున్నాం.. కట్టుకోవడానికి రూ.1.80 లక్షలిస్తున్నామని ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. నిజానికది కేంద్రం ఇచ్చే సాయమే. రాష్ట్ర ప్రభుత్వం స్థలానికి, కాలనీల్లో వసతుల కల్పనకే నిధులు వెచ్చిస్తోంది. ఎప్పుడో 2020 డిసెంబరు నాటి ధరల ప్రకారం నిర్మాణానికి రూ.1.80 లక్షలు అవుతుందని నిర్ణయించారు. అప్పటికి, ఇప్పటికి ధరల్లో ఏమాత్రం పొంతనలేదు. లబ్ధిదారులంతా నిరుపేదలే కాబట్టి ప్రభుత్వం కనీసం మరో రూ.2లక్షలైనా ఇస్తే తప్ప నిర్మాణాలు వేగం పుంజుకునే అవకాశం లేదు.

సామగ్రి పంపిణీ అరకొరే..
ఇంటి నిర్మాణానికి 22 రకాల వస్తువులు అవసరమని గుర్తించిన అధికారులు 13రకాల వస్తువులకు రాష్ట్ర స్థాయిలో, 9రకాల సామగ్రికి జిల్లాస్థాయిలో టెండర్లు పిలిచి లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం సామగ్రి ధర రూ.1.25 లక్షలుగా నిర్ణయించి టెండర్లు పిలిచారు. రెండు, మూడుసార్లు పిలిచినా గుత్తేదారు సంస్థలు ముందుకు రాలేదు. తర్వాత జిల్లాస్థాయిలో సామగ్రి పంపిణీని పక్కనపెట్టి రాష్ట్రస్థాయి సామగ్రినే ఇవ్వాలని నిర్ణయించారు. బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువగా ఎంత కనీస ధర వస్తుందో ఆ ప్రకారమే టెండర్లు నిర్వహించి ధరలు ఖరారు చేశారు. రివర్స్‌ టెండర్లకు వెళ్లినా ప్రభుత్వం అనుకున్నదాని కంటే ఎక్కువే వచ్చింది. మొత్తం 15.60 లక్షల ఇళ్ల కోసం టెండర్లు పిలిచిన అధికారులు.. సామగ్రిని మాత్రం ఆశించిన మేర లబ్ధిదారులకు అందించలేదు. డోర్‌ అండ్‌ విండో ఫ్రేమ్స్‌, పీవీసీ టాయిలెట్‌ డోర్‌, విండో షట్టర్‌, పెయింట్లు, విద్యుత్‌ వస్తువులు, నీటి సరఫరా సామగ్రి, సిమెంటు/ఇనుప రేకులు, టాయిలెట్‌ సీటు ఇస్తామన్న అధికారులు.. ఇప్పటికే 60,783 ఇళ్లు పూర్తికాగా చాలామందికి వీటిని అందించలేదు. దీంతో సొంతంగా కొనాల్సి వస్తోంది. సిమెంటు, ఇనుమును రాయితీపైన, ఇసుకను ఉచితంగా ఇస్తున్నారు.

కూలి ఖర్చులు ఎక్కువే
పేదలు ఇంటిని కనీస స్థాయిలో కట్టుకున్నా కూలి ఎక్కువే అవుతోంది. రోజుకు మేస్త్రీకి రూ.800, కార్మికులకు రూ.600 ఇవ్వాల్సి వస్తోంది. బేస్‌మెంట్‌, గోడలు, శ్లాబు, ఎలివేషన్‌ ఇలా విడివిడిగా ఒప్పందం చేసుకుంటే ఒక ధర, రోజుకూలీ ప్రకారం కట్టించేందుకు ఇంకో ధర, మొత్తంగా ఒప్పందం చేసుకుంటే మరో ధర చెబుతున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. ఎంత సాధారణంగా కట్టుకున్నా కూలి, రవాణా ఛార్జీలు కలిపి రూ.2.25 లక్షల వరకు అవుతున్నాయి. ఒక ఇంటికి కూలి కింద రూ.1.30 లక్షలు తీసుకుంటున్నారు. కిటికీలు, తలుపులు బిగించేందుకు రూ.5వేలు, విద్యుత్తు వైరింగ్‌కు రూ.10వేలు, పెయింటింగ్‌కు రూ.15వేలు తీసుకుంటున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. వీటన్నింటినే కలిపితే రూ.1.60 లక్షల వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. సామగ్రి రవాణాకు రూ.65వేలు అవుతోంది.

సిమెంటు, ఇనుము, ఇసుకకే రూ.1.25 లక్షల వ్యయం
ఒక్కో ఇంటికి ప్రభుత్వం మొదట్లో 90 బస్తాల సిమెంటును ఖరారు చేసి, తర్వాత కాస్త బాగా కట్టుకుంటే మరో 50 బస్తాలు ఇస్తామంది. బస్తా సిమెంటు ధరను ఇటీవలే రూ.30 చొప్పున పెంచి రూ.260-270కి ఇస్తోంది. టెండర్ల ద్వారా 2021 ఫిబ్రవరిలో 450 కిలోల స్టీలు ధర రూ.25,425గా ఖరారు చేసిన అధికారులు... తర్వాత మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పెంచారు. టన్ను రూ.72-74 వేలకు ఇస్తున్నారు. ఇల్లు పూర్తయ్యేలోగా సిమెంటు, ఇనుముకు అయ్యే రూ.65 వేలను రూ.1.80 లక్షల నుంచి మినహాయిస్తారు. 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇచ్చినా, రవాణాకు రూ.10వేలు ఖర్చవుతోంది. కానీ, ఇల్లు కట్టుకోవడానికి ఈ సామగ్రి చాలదు. అదనంగా 50 బస్తాల సిమెంటు, అరటన్ను స్టీలు, 5 టన్నుల ఇసుక కొంటున్నారు. ఈ మూడింటిపైనే రూ.1.25 లక్షల వరకు ఖర్చవుతోంది. మార్కెట్‌లో ప్రస్తుత ధరల ప్రకారం ఎంత కనీస స్థాయిలో ఇల్లు కట్టుకున్నా రూ.5 లక్షలకు తక్కువ కావట్లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నందరాడ, ఎన్టీఆర్‌ జిల్లా నున్నలో ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు, నంద్యాల జిల్లా నందికొట్కూరు, కర్నూలు జిల్లా మద్దికెర, శ్రీకాకుళం జిల్లా పాత్రునివలసలో రూ.5.50 లక్షలు, విజయనగరం జిల్లా గుంకలాం లేఅవుట్‌లో రూ.6 లక్షల వరకు ఖర్చయినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు.

అత్యంత సాధారణంగా కట్టుకున్నా రూ.3 లక్షలు
మరికొందరు పేదలు డబ్బుల్లేక, అసంతృప్తితోనే అత్యంత సాధారణంగా ఇళ్లు కట్టుకుంటున్నారు. మేస్త్రీలతో రూ.2.50 లక్షలకు మొత్తం ఇంటి నిర్మాణానికి ఒప్పందం చేసుకుంటున్నారు. గ్రామాల్లో కొన్నిచోట్ల ఈ తరహా నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఇతరత్రా ఖర్చులు కలిపితే ఈ నిర్మాణాలకు కూడా రూ.3 లక్షల వరకు ఖర్చవుతోంది.

ఓ మాదిరిగా కట్టుకుంటే అదనంగా మరింత..

.

జీవితంలో ఒక్కసారే కట్టుకునే ఇల్లు పటిష్ఠంగా ఉండాలని.. అప్పులు చేసి కట్టుకుంటున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని దేవన్నచెరువు వద్ద కేటాయించిన లేఅవుట్‌లో కొంతమంది లబ్ధిదారులు కూలికి కార్మికుల్ని మాట్లాడుకుని ఇళ్లను కట్టుకుంటున్నారు. నిర్మాణ సామగ్రి మొత్తం లబ్ధిదారులు ఇవ్వాల్సిందే. కూలిఖర్చుల కింద రూ.2.75 లక్షల వరకు తీసుకుంటున్నట్లు అక్కడి మేస్త్రీలు చెబుతున్నారు. ఇవికాకుండా కిటికీలు, తలుపులు బిగించేందుకు రూ.5వేలు, టైల్స్‌ వేసినందుకు రూ.8వేలు, విద్యుత్తు వైరింగ్‌కు రూ.12 వేలు, పెయింటింగ్‌కు రూ.25 వేల వరకు తీసుకుంటున్నారు. మచిలీపట్నం మండలం మేకావానిపాలెంలో రూ.7లక్షలు, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సమీపంలోని నాగేపల్లి కాలనీలో రూ.7-8 లక్షలు ఖర్చయినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు.

.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.