Jyothi Yerraji: నిరంతర కృషి, అలుపెరగని శ్రమ... ఏడేళ్లు తిరిగే సరికి

author img

By

Published : Jun 18, 2022, 9:04 AM IST

athlete and national champion jyothi yerraji success story

Jyothi Yerraji: ఆమె జీవితంలో రెండు రకాల హర్డిల్స్‌ని ఎదుర్కొంది. ఆటలో భాగంగా మీటరు ఎత్తుండే హర్డిల్స్‌ మొదటి రకం కాగా.. పేదరికం, ప్రోత్సాహం లేకపోవడం, గాయాలు.. రెండో రకం. నిరంతర కృషి, పట్టుదల, అలుపెరగని శ్రమతో రెంటినీ అధిగమించిందామె. ఏడేళ్లు తిరిగే సరికి జాతీయ ఛాంపియన్‌గా అవతరించింది జ్యోతి యర్రాజి. మన దేశం తరఫున కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే బృందంలో చోటు దక్కించుకున్న సందర్భంగా తనకు ఎదురైన అవరోధాలు, వాటిని అధిగమించిన తీరును‘వసుంధర’తో పంచుకుందిలా..

Jyothi Yerraji: మన దేశం తరఫున కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే బృందంలో చోటు దక్కించుకుంది.. విశాఖకు చెందిన యువతి జ్యోతి యర్రాజి. ఈ సందర్భంగా.. తనకు ఎదురైన అవరోధాలు, వాటిని అధిగమించిన తీరును‘వసుంధర’తో పంచుకుంది..

మాది విశాఖపట్నంలోని కైలాసపురం. నాన్న సూర్యనారాయణ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్‌, అమ్మ కుమారి. నాకో అన్నయ్య. బాగా చదువుకోమని ఇద్దరికీ చెబుతుండేవారు. నేను మాత్రం క్రీడల్లో పాల్గొని దేశానికి పేరు తేవాలనుకునేదాన్ని. ఇంట్లో చెబితేనేమో ఆటలొద్దనేవారు. పోర్ట్‌ హైస్కూల్లో చదివేదాన్ని. అక్కడ పీఈటీ సర్‌ ప్రోత్సాహంతో రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, హర్డిల్స్‌లో ప్రాక్టీసు చేసేదాన్ని. నా ఎత్తుకు హర్డిల్స్‌ బావుంటుందన్నారు సర్‌.

అది 2015... నేను పదో తరగతిలోకి వచ్చా. ప్రాక్టీసుకి వెళ్తుంటే.. మావాళ్లు చదువుమీద మరింత దృష్టి పెట్టమనే వారు. చివరికోరోజు నా అథ్లెటిక్స్‌ లక్ష్యం గురించి చెప్పా. ఒక్కసారిగా వాళ్లకు కోపం, భయం కమ్ముకొచ్చాయి. నా భవిష్యత్తు ఏమవుతుందోననేది వాళ్ల ఆందోళన. నా పట్టుదల చూసి చివరకు రెండేళ్లలోపు రాణించలేకపోతే ఆటలు వదిలేయాలన్నారు. ఆరు నెలల తర్వాత కేరళలో జరిగిన జూనియర్‌ యూత్‌ నేషనల్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో 100మీ. హర్డిల్స్‌ని 14.6 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణం సాధించా. అప్పుడు అందరూ మెచ్చుకోవడం, నా గురించి పత్రికల్లో, టీవీల్లో రావడంతో అమ్మానాన్నల ఆలోచన మారింది.

షూ కొనమని అడగలేకపోయా.. హర్డిల్స్‌ ప్రాక్టీసుకి ఎక్కువ శక్తి అవసరం.. దాంతో ఆకలి బాగా వేసేది. సాధన తర్వాత నిస్సత్తువ ఆవరించేది. ఇంట్లో నా కోసం ప్రత్యేకంగా ఖర్చుపెట్టే పరిస్థితి లేదు. అందరికీ ఏది వండితే అదే తినాలి. కాకపోతే కాస్త ఎక్కువ తినేదాన్ని. అరటి పళ్లు చౌకగా దొరకడంతో వాటితోనే ఆకలి తీర్చుకునేదాన్ని. పోటీలకు వెళ్లే ప్రతిసారీ ఖర్చులకి ఇబ్బంది. ఎవరో ఒకరు సాయపడితే ఆరోజు కష్టం గట్టెక్కేది. అదీకాక నాణ్యతలేని షూతోనే పరిగెత్తడంతో కాలి మడమ మెలి తిరగడం, కాళ్లకు దెబ్బలు, వెన్నుపూస నొప్పి వంటివి బాధించేవి.

నాన్న నెల జీతం అంతా ఖర్చు పెడితే కానీ స్పైక్‌ షూ కొనలేం. అందుకే వారికీ విషయమే చెప్పలేదు. అలాగని పోటీలకు వెళ్లకపోతే ఎదుగుదల ఉండదు. వీటన్నింటినీ పంటి బిగువున భరిస్తూనే ముందుకెళ్లేదాన్ని. ఒక స్పాన్సర్‌ స్పైక్‌ షూ బహూకరించడంతో గాయాలు తగ్గాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లోని శాయ్‌ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యా. అప్పుడు పరిస్థితులు కాస్త నయమయ్యాయి. చదువూ వదల్లేదు.. ఇంటర్‌ కూడా పూర్తిచేశా.

హర్డిల్స్‌ ప్రాక్టీసు

నేనిక్కడ వరకూ రావటానికి మా కుటుంబంతోపాటు విశాఖ అథ్లెటిక్‌ సంఘానికి చెందిన నాగేశ్వరరావు, నారాయణరావు, హైదరాబాద్‌లో మా సీనియర్‌ గౌతమ్‌, ప్రవాసాంధ్రులు రమేష్‌ చల్లా అండగా నిలిచారు. ఎన్ని ఇబ్బందులున్నా అమ్మనాన్నల కోసం చదువుని నిర్లక్ష్యం చేయలేదు. ప్రస్తుతం గుంటూరు వీటీజేఎమ్‌ డిగ్రీ కాలేజీలో బీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్నా. నాలాంటి నేపథ్యం ఉన్నవాళ్లు క్రీడల్లోకి రావాలంటే ఏదో ఒక ప్రోత్సాహం ఉండాలి. పరీక్షల్లో కొన్ని మార్కులు కలుస్తాయంటే చాలామంది ఇటు రావడానికి ఆసక్తి చూపిస్తారు.

రికార్డులు తిరగరాస్తూ.. నేషనల్‌ ఇంటర్‌ స్టేట్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2019లో, మొదటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌-2020లో స్వర్ణాలు గెలిచా. 2020లో జరిగిన ఇంటర్‌ యూనివర్సిటీ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో లక్ష్యాన్ని 13.03 సెకన్లలో పూర్తిచేశా. అది నేషనల్‌ రికార్డ్‌. కానీ డోప్‌ టెస్ట్‌కు హాజరుకాలేదని నమోదు చేయలేదు. కోటి ఆశలతో కెరియర్‌లో దూసుకెళ్తుండగా కరోనా రూపంలో బ్రేక్‌ పడింది.

ఇంటి మేడపైనే వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ కాపాడుకున్నా. 2021 మధ్య నుంచి పోటీలు మొదలయ్యాక భువనేశ్వర్‌లో ఒడిశా ప్రభుత్వం, రిలయన్స్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ‘హై పెర్ఫార్మెన్స్‌ సెంటర్‌’కు ఎంపికయ్యా. అక్కడ చేరాక దేశానికి పతకం అందించగలనన్న నమ్మకం వచ్చింది. ఈ కేంద్రం సాయంతో అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నా.

పోయిన నెలలో సైప్రస్‌లో ఇంటర్నేషనల్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో 13.23 సెకన్లలో లక్ష్యం చేరి స్వర్ణం అందుకున్నా. అదే సమయంలో 2002 నాటి జాతీయ రికార్డు (13.38 సెకన్లు)ను బ్రేక్‌చేశా. తర్వాత వారం నెదర్లాండ్స్‌లో 13.04 సెకన్లతో నా రికార్డుని నేనే బద్దలుగొట్టా. ప్రస్తుతం కామన్వెల్త్‌ గేమ్స్‌కు మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతున్నా.అక్కడ కూడా రికార్డును సృష్టించి.. దేశ పతాకాన్ని రెపరెప లాడించాలన్నది నా ముందున్న లక్ష్యం!

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.