రైతుల మహా పాదయాత్ర.. జై అమరావతి నినాదాలతో దద్దరిల్లిన గుడివాడ

author img

By

Published : Sep 24, 2022, 5:14 PM IST

Updated : Sep 25, 2022, 7:54 AM IST

Padayatra

Padayatra: జై అమరావతి నినాదాలతో గుడివాడ ప్రతిధ్వనించింది. రైతుల మహాపాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆంక్షలు, అడ్డంకులనూ లెక్కచేయకుండా గుడివాడ వాసులు.. రైతులకు మద్దతుగా కదంతొక్కారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు..సంఘీభావం ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు.

జై అమరావతి నినాదాలతో దద్దరిల్లిన గుడివాడ

Padayatra: గుడివాడ నియోజకవర్గ పరిధిలో అమరావతి రైతుల మహాపాదయాత్ర.. రెండో రోజూ విజయవంతంగా సాగింది. మహిళలు, స్థానిక రైతులు తరలివచ్చి.. అమరావతి రైతులకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. 13వ రోజైన శనివారం నాడు.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో ప్రారంభమైన రైతుల పాదయాత్రకు.. ఎక్కడికక్కడ స్థానికులు ఘనస్వాగతం పలికారు. గుడ్లవల్లేరు, అంగలూరు, బొమ్మూరు మీదుగా సాగిన పాదయాత్ర... గుడివాడలోకి ప్రవేశించగా... సంఘీభావం తెలిపేందుకు వస్తున్నవారిని పోలీసులు అడ్డుకున్నారు. గుడివాడలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేపట్టారు. పోలీసుల చర్యలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల ఆంక్షల వలయాన్ని ఛేదించుకుని.. తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు, మహిళా సంఘాల ప్రతినిధులు.. గుడివాడ చేరుకుని.. పాదయాత్రకు మద్దతుగా రైతులతో కలిసి అడుగులు వేశారు.

గుడివాడలో స్థానికులు ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లను ఏర్పాటుచేసి.. పాదయాత్రలో అమరావతి ప్రభలను ప్రదర్శించారు. పాదయాత్ర చేస్తున్న రైతులపై... దారిపొడవునా స్థానికులు పూలవర్షం కురిపించారు. పాదయాత్రకు మద్దతుగా మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ రైతులతో పాదం కలిపారు. తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్‌ గృహ నిర్బంధం నుంచి తప్పించుకుని వచ్చి పాదయాత్రకు మద్దతు తెలిపారు. అమరావతిపైనా, రాజధాని రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల పాదయాత్ర గుడివాడలోకి ప్రవేశిస్తున్న సమయంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. గుడివాడ మార్కెట్ నుంచి రైతుల పాదయాత్రను రోప్ టీమ్‌ సాయంతో ముందుకు నడిపించారు. శరత్‌ సినిమా థియేటర్ వద్ద రైతులు అమరావతి నినాదాలు చేస్తుండగా... థియేటర్‌లో ఉన్న వైకాపా కార్యకర్తలు పోటీగా... జై కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వాతావరణం కాస్త వేడెక్కగా... పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పారు. గుడివాడలో పోలీసు ఆంక్షలు ఉన్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. 600 మందితో యాత్ర చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని... హైకోర్టు ఆదేశాలను పాటించాలని ఎస్పీ జాషువా కోరారు. బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడివాడలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. పోలీసు ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

"600 మందితో యాత్ర చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని కోరుతున్నాం. బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు. గుడివాడలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నాం. పోలీసు ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం" -కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా

నెహ్రూ చౌక్‌లో అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సంఘాలు, న్యాయవాదులు యాత్రకు మద్దతు ప్రకటించారు. 14వ రోజున పాదయాత్ర గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు నుంచి ప్రారంభమై... దెందులూరు సమీపంలోని కొనికి ప్రాంతానికి చేరుకుంటుంది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 25, 2022, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.