అదానీకి హిండెన్​బర్గ్ సెగ.. షేర్లు మళ్లీ డీలా.. టాప్-10 సంపన్నుల లిస్ట్ నుంచి ఔట్

author img

By

Published : Jan 31, 2023, 3:52 PM IST

stock-market-updates

అదానీ గ్రూప్ షేర్లు మంగళవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. కీలకమైన అదానీ ఎంటర్​ప్రైజెస్ షేరు దాదాపు 2శాతం లాభపడగా.. అదానీ పవర్, అదానీ విల్మర్ షేర్లు నష్టపోయాయి. ఈ ఫలితంగా గౌతమ్ అదానీ.. ప్రపంచ కుబేరుల జాబితాలో పదకొండో స్థానానికి పడిపోయారు. మరోవైపు, స్టాక్ మార్కెట్లు లాభాలతో స్వల్ప లాభాలతో ముగిశాయి.

హిండెన్​బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ సంపద కరిగిపోతోంది. హిండెన్​బర్గ్ నివేదికకు ముందు ప్రపంచంలోనే మూడో అత్యంత ధనికుడిగా ఉన్న అదానీ.. తాజాగా 11వ స్థానానికి పడిపోయారు. అదానీ సంపద మూడు ట్రేడింగ్ రోజుల్లో 34 బిలియన్ల మేర ఆవిరైపోయిందని బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తేల్చింది. ప్రస్తుతం ఆయన సంపద విలువ 84.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ 82.2 బిలియన్ల సంపదతో.. అదానీ తర్వాతి స్థానంలో ఉన్నారు.

తాజా సెషన్​లో అదానీ గ్రూప్ సంస్థల షేర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మంగళవారం అదానీ ఎంటర్​ప్రైజెస్ షేరు 1.91 శాతం లాభపడింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 2.77 శాతం, అదానీ ట్రాన్స్​మిషన్ లిమిటెడ్ 2.96 శాతం వృద్ధి చెందింది. మరోవైపు, అదానీ పవర్ 5 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 10, అదానీ విల్మర్ షేరు 5 శాతం నష్టపోయాయి.

ఎఫ్​పీఓకు మంచి స్పందన..
హిండెన్​బర్గ్ ఆరోపణలు సంచలనం రేపినప్పటికీ.. అదానీ ఎంటర్​ప్రైజెస్ జారీ చేసిన ఎఫ్​పీఓకు మంచి స్పందన లభిస్తోంది. ఎఫ్​పీఓ పూర్తిస్థాయిలో సబ్​స్క్రైబ్ అయినట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ ద్వారా తెలిసింది. రూ.20వేల కోట్ల విలువైన 4.55 కోట్ల షేర్లను ఎఫ్​పీఓ ద్వారా అందుబాటులో ఉంచింది అదానీ. మొత్తం 4.62 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. ఎఫ్​పీఓకు నాన్-ఇన్​స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు దీనికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదని తెలుస్తోంది.

స్టాక్ మార్కెట్ క్లోజింగ్..
మంగళవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు సహా కేంద్ర బడ్జెట్​కు ముందు మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల స్టాక్ మార్కెట్లు స్తబ్దుగా కదిలాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) ఆద్యంతం ఊగిసలాట మధ్య ట్రేడింగ్ సాగించింది. 200 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్.. చివరకు 50 పాయింట్ల లాభంతో 59,550 వద్ద ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీ సైతం స్వల్ప లాభాలతో ముగిసింది. 13 పాయింట్లు వృద్ధి చెంది.. 17,662 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోని షేర్లు ఇవే..
మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు రాణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో మహీంద్ర అండ్ మహీంద్ర, ఎస్​బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు 3శాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీసీ, టైటాన్, టాటా మోటార్స్, ఎన్​టీపీసీ షేర్లు లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, టెక్ మహీంద్ర షేర్లు నష్టాల్లో పయనించాయి.
రుపాయి విలువ
మంగళవారం సెషన్​లో రూపాయి విలువ పతనమైంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 42 పైసలు తగ్గి.. 81.92 వద్దకు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.