వేతన జీవులపై మరో పిడుగు.. వడ్డీ రేట్లు పెంపు.. ఈఎంఐలు మరింత భారం

author img

By

Published : Aug 5, 2022, 10:13 AM IST

Updated : Aug 5, 2022, 10:37 AM IST

rbi interest rate decision today

09:35 August 05

కీలక వడ్డీ రేట్లు మరోసారి పెంచిన రిజర్వ్ బ్యాంక్

RBI interest rate decision today : రుణగ్రహీతలపై మరో పిడుగు పడింది. అందరూ ఊహించినట్లే వడ్డీ రేట్లను మరోసారి పెంచింది రిజర్వ్ బ్యాంక్. అంతకంతకూ విజృంభిస్తున్న ధరల భూతానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును ఆర్​బీఐ పెంచడం వరుసగా ఇది మూడోసారి.

RBI interest rate hike 2022 : ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా కీలక వడ్డీ రేట్లను మరోమారు పెంచింది రిజర్వు బ్యాంకు. అందరూ ఊహించినదానికన్నా ఎక్కువగా రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచి 5.4శాతంగా నిర్ణయించింది. ఫలితంగా రెపో రేటు(బ్యాంకులకు ఇచ్చిన అప్పులపై ఆర్​బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) కొవిడ్ ముందు స్థాయికి చేరింది. ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజులు సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా చర్చించిన ద్రవ్యపరపతి విధాన కమిటీ.. ఈమేరకు శుక్రవారం ప్రకటన చేసింది. శక్తికాంత దాస్ చెప్పిన కీలక విషయాలు:

  • ఆర్థిక వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్​ తగ్గించింది. మాంద్యం ముప్పు ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. భారత్ నుంచి గత కొద్ది నెలల్లో 13.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెళ్లిపోయాయి. అయితే.. ఫైనాన్షియల్ సెక్టార్​ బాగానే ఉంది. భారత్​ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు.. అంతర్జాతీయ ప్రతికూలతల నుంచి రక్షణ కల్పిస్తాయి.
  • వినియోగదారుల ధరల సూచీ అధికంగా ఉంది. కొంతకాలం 6శాతంపైనే కొనసాగే అవకాశముంది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.4శాతం చేయాలని ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అకామొడేటివ్ స్టాన్స్​ను వీడడంపై దృష్టిపెట్టాలని తీర్మానించింది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2శాతం వృద్ధి నమోదు కావొచ్చన్న అంచనాలకు కట్టుబడి ఉన్నాం. సాధారణ వర్షపాతం, ముడి చమురు బ్యారెల్ ధర 105 డాలర్లు ఉండొచ్చన్న లెక్కలతో.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.7శాతం నమోదవుతుందన్న అంచనాలను అలానే కొనసాగిస్తున్నాం. అయితే.. అంతర్జాతీయ పరిణామాలు దేశ ఆర్థిక వృద్ధికి ప్రతికూలంగా మారే అవకాశముంది.
  • వంట నూనెల ధరలు మరింత తగ్గుతాయి.

ద్రవ్యోల్బణం ఆరు శాతంలోపు ఉండేలా చూడాలని రిజర్వు బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరలు, ఇతర కారణాలతో జనవరి నుంచి ధరల సూచీ ఎగువ స్థాయిలోనే కొనసాగుతోంది. జూన్​లో 7.01శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం 15.18శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్ల పెంపే ఉత్తమ మార్గమని భావించిన ఆర్​బీఐ.. అందుకు అనుగుణంగా ఇప్పుడు చర్యలు తీసుకుంది.

RBI rate hike 2022 : 2020 ఆరంభంలో కరోనా వ్యాప్తికి ముందు రెపో రేటు 5.15శాతంగా ఉండేది. కొవిడ్‌ ముందే వృద్ధిరేటు మందగించడంతో, రెపోరేటును 2019 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ తగ్గిస్తూ వచ్చింది. కొవిడ్‌ తొలిరోజుల్లో 2020లో మార్చి, మే నెలల్లో 75 బేసిస్‌ పాయింట్లు; 40 బేసిస్‌ పాయింట్ల చొప్పున కోత వేసింది. 2019 నుంచి 2020 మేలోపు రెపోరేటులో 250 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించి, రికార్డు కనిష్ఠమైన 4 శాతానికి చేర్చింది. ఆ తర్వాత 11 సార్లు ద్వైమాసిక సమీక్ష జరిగినా, రేట్లు సవరించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మేలో ద్వైమాసిక సమీక్ష లేకపోయినా.. 40 బేసిస్‌ పాయింట్లు పెంచి, 4.40 శాతం చేసింది. జూన్​లో జరిగిన ద్వైమాసిక సమీక్షలో మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచి, 4.90 శాతం చేసింది. ఇప్పుడు వరుసగా మూడోసారి వడ్డీ రేట్ల పెంపుతో.. రెపో రేటు కొవిడ్ ముందు స్థాయిని దాటింది.

Last Updated :Aug 5, 2022, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.