మీ పెట్టుబడులకు నామినీ ఉన్నారా? లేకపోతే ఈ కష్టాలు తప్పవు!

author img

By

Published : Nov 19, 2022, 5:43 PM IST

Nomination is mandatory for saving money

సంపదను సృష్టించడమే కాదు.. దాన్ని వారసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బదిలీ చేయడమూ ఎంతో కీలకం. ఒక వ్యక్తి మరణించినప్పుడు తాను పెట్టిన పెట్టుబడులన్నీ కుటుంబ సభ్యులకు చేరాలంటే ఉన్న మార్గం నామినేషన్‌. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా నియమించేందుకు అవకాశం ఉంటుంది. జీవిత బీమా పాలసీలు, బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, డీమ్యాట్‌లో ఉన్న షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు ఇలా ఒకటేమిటి.. ఆర్థిక పెట్టుబడులన్నింటికీ నామినీ పేరు పేర్కొనడం తప్పనిసరి.

పెట్టుబడులకు యజమాని మరణించిన తర్వాత నామినీగా ఉన్న వ్యక్తి వాటికి సంరక్షకుడిగా మారతారు. అంతమాత్రాన నామినీ ఆయా ఆస్తులకు చట్టపరమైన వారసుడు కాకపోవచ్చు. నిజమైన చట్టపరమైన వారసుడిని ప్రకటించే వరకూ తప్పనిసరిగా ఆ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత నామినీదే. వివిధ రకాల ఆస్తులు, ఖాతాల కోసం వేర్వేరు నామినీలు ఉండొచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎఫ్‌డీలకు ఒక వ్యక్తిని, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లకు మరో వ్యక్తిని, పొదుపు ఖాతాలకు ఇంకో వ్యక్తిని నామినీగా పేర్కొనవచ్చు. జీవిత బీమా పాలసీలకూ మరో నామినీ పేరు రాయొచ్చు. ఆస్తి రకాన్ని బట్టి, కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు నామినీల పేర్లూ పేర్కొనేందుకు వీలుంది. ఉదాహరణకు మ్యూచువల్‌ ఫండ్లు, జీవిత బీమా పాలసీల్లో ఒకరికి మించి నామినీలను ఏర్పాటు చేయొచ్చు. ఆస్తి యజమాని నామినీలకు ఎంత శాతం వాటా ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. బ్యాంకు ఖాతాలో సాధారణంగా ఒక వ్యక్తినే నామినీగా అంగీకరిస్తారని ఇక్కడ గుర్తుంచుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్ల విషయంలో.. ఒక ఫోలియోలో గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులను నామినేట్‌ చేయొచ్చు. కాబట్టి, ఒక ఫోలియోలో అనేక పథకాలున్నప్పటికీ.. వాటన్నింటికీ ఆ నామినేషనే వర్తిస్తుంది.

ఒక ఆస్తికి నామినీగా జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, దగ్గరి బంధువు, స్నేహితుడు ఇలా ఎవరినైనా నామినీగా నియమించవచ్చు. ముందే చెప్పినట్లు నామినీ ఆ ఆస్తికి చట్టపరమైన వారసుడు కానవసరం లేదు. చట్టపరమైన వారసులైతే ఆ పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు.

నామినీ లేకపోవడం వల్ల పెట్టుబడిని తొందరగా క్లెయిం చేసుకునే పరిస్థితులు ఉండవు. ప్రత్యేకించి వీలునామా లేకపోవడంలాంటి సందర్భాల్లో ఇది మరీ ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల్లాంటివి ఉన్నప్పుడు నామినీ పేరు కచ్చితంగా ఉండాలి. లేకపోతే చట్టపరమైన వారసులను గుర్తించి, పరిహారం చెల్లించే సరికి ఆలస్యం అవుతుంది. మరోవైపు నమ్మకమైన వ్యక్తినే నామినీగా పేర్కొనాలి. నామినీ అవసరం ఎంతో ఉంది. అదే సమయంలో సరైన వ్యక్తిని గుర్తించడమూ ఇక్కడ కీలకం అని మర్చిపోవద్దు. ఒకసారి మీ పెట్టుబడి పథకాలన్నింటినీ పరిశీలించండి. బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, డీమ్యాట్‌, బీమా పాలసీలు, చిన్న మొత్తాల పొదుపు ఇలా ప్రతి పథకానికీ నామినీ ఉన్నారా చూసుకోండి. అవసరమైతే నామినీ వివరాలను మరోసారి ధ్రువీకరించుకోండి. మార్పులు చేర్పులుంటే చేయండి. నామినీతోపాటు, వీలునామా ఉండటం వల్ల వివాదాలకు తావుండదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.