'ఆ పని చేస్తే పింక్ స్లిప్​ ఖాయం'.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్

author img

By

Published : Sep 13, 2022, 4:02 PM IST

Moonlighting Infosys

Moonlighting Infosys : మూన్​లైటింగ్ పాలసీని అనుమతించేదే లేదని స్పష్టం చేసింది ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్​. ఈ మేరకు తమ ఉద్యోగులకు లేఖ రాసిన యాజమాన్యం.. సంస్థ నిబంధనలకు ఇది విరుద్ధమని తేల్చి చెప్పంది.

Moonlighting Infosys : ఒకే సమయంలో ఒకటికి మించి ఉద్యోగాలు చేసే విధానాన్ని అనుమతించేది లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు తమ ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యం లేఖ రాసింది. కంపెనీ నిబంధనలకు ఇది విరుద్ధమని తేల్చి చెప్పంది. ఈ విషయాన్ని ఉద్యోగులకు ఆఫర్‌ లెటర్‌లోనే స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తు చేసింది. దీన్ని ఉల్లంఘించినవారిని తొలగించడానికి కూడా వెనకాడబోమని తెలిపింది.

ఒకవేళ అలా అదనపు ఆదాయం కోసం ఏదైనా పనిచేయాలనుకుంటే దానికి కంపెనీ అనుమతి తప్పనిసరని లేఖలో పేర్కొంది. సందర్భాన్ని బట్టి నిబంధనలకు లోబడి ఉద్యోగి అభ్యర్థన అర్హమైనదేనని భావిస్తే ప్రత్యేక అనుమతి విషయాన్ని పరిశీలించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే దాన్ని ఏ సందర్భంలోనైనా రద్దు చేసే అధికారమూ ఉంటుందని గుర్తు చేసింది.

మూన్‌లైటింగ్‌పై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగుల వలసలు అధికంగా ఉన్న ఐటీ పరిశ్రమలో దీనికి ప్రాముఖ్యం పెరిగింది. నైపుణ్యం గల ఉద్యోగులకు డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో కొంతమంది అదనపు ఆదాయం కోసం ఖాళీ సమయంలో మరో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు పలు సర్వేలు పేర్కొన్నాయి. విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ కూడా ఇటీవల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల మూన్‌లైటింగ్‌పై ప్రతికూలంగా స్పందించారు.

ఆన్‌లైన్‌లో ఆర్డరు తీసుకొని ఆహారాన్ని పంపిణీ చేసే స్విగ్గీ తమ ఉద్యోగులకు మూన్‌లైటింగ్‌ పాలసీని ఇటీవల తీసుకొచ్చింది. తమ దగ్గర ఉద్యోగం చేస్తున్న వారు, విధుల అనంతరం ఇతర సమయాల్లో తాత్కాలికంగా మరో ఉద్యోగాన్ని/ తమకు నైపుణ్యం ఉన్న మరో రంగంలో ఉపాధి పొందేందుకు వీలు కల్పించింది. స్విగ్గీ నిర్ణయం తర్వాతే ఈ విధానంపై చర్చ తెరపైకి వచ్చింది.

మరోవైపు ఇన్ఫోసిస్‌ లేఖను లాభాపేక్ష లేని సంస్థ 'నైట్స్‌' తప్పుబట్టింది. ఉద్యోగులు 9 గంటలు మాత్రమే పనిచేసేలా కంపెనీతో ఒప్పందం ఉందని తెలిపింది. పనివేళల తర్వాత ఉద్యోగులు ఏం చేయాలనేది వారి స్వతంత్రమని పేర్కొంది. రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం.. ప్రతి పౌరుడికీ జీవనోపాధిని పొందే హక్కు ఉందని తెలిపింది. ఉద్యోగులకు ఇలాంటి లేఖలు పంపడం చట్టవిరుద్ధమని, అనైతికమని మండిపడింది.

ఇవీ చదవండి: క్రెడిట్ కార్డ్​ ఈఎంఐతో లాభమా, నష్టమా?

జియో నుంచి శాటిలైట్ సేవలు.. అనుమతులు జారీ చేసిన 'డాట్'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.