క్యూ3లో అదరగొట్టిన మారుతీ.. లాభం రూ.2351 కోట్లు.. రెండు రెట్ల వృద్ధి

author img

By

Published : Jan 24, 2023, 10:18 PM IST

maruti-suzuki-october-to-december-q3-results-2022

మారుతీ సుజుకీ మంగళవారం మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. సమీక్షా కాలంలో కంపెనీ లాభం రెండు రెట్లు పెరగడం విశేషం. కొత్త కార్ల విడుదల భారీ విక్రయాలకు దోహదం చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

Maruti Q3 Results:ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మారుతీ సుజుకీ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 2,351.3 కోట్లకు చేరింది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,011.3 కోట్లు. ఇదే సమయంలో కార్యకలాపాల మొత్తం ఆదాయం రూ. 22,187.6 కోట్ల నుంచి రూ.27,849.2 కోట్లకు పెరిగింది. గ్రాండ్‌ విటారా, బ్రెజా వంటి మోడళ్లలో కొత్త వెర్షన్ల విడుదల భారీ విక్రయాలకు దోహదం చేసినట్లు కంపెనీ వెల్లడించింది. మరోవైపు కమొడిటీ ధరల్లో తగ్గుదల, విదేశీ మారకపు రేట్లలో మార్పులు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం పెరగడం వంటి అంశాలూ అధిక లాభాలకు కారణమైనట్లు పేర్కొంది.

సమీక్షా త్రైమాసికంలో మొత్తంగా 4,65,911 వాహనాలను విక్రయించినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. దేశీయ విపణిలో 4,03,929 వాహనాలను విక్రయించగా.. ఎగుమతులు 61,982 యూనిట్లుగా నమోదయ్యాయి. డిసెంబరు త్రైమాసికం చివరికి 3.63 లక్షల వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని మారుతీ సుజుకీ తెలిపింది. ఇందులో 1.19 లక్షల ఆర్డర్లు ఇటీవల విడుదల చేసిన మోడళ్లకు వచ్చాయని పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో మారుతీ సుజుకీ మొత్తంగా 14,51,237 వాహనాలు విక్రయించింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో 11,63,823 వాహనాలను అమ్మింది. దేశీయ విక్రయాలు 9,93,901 నుంచి 12,56,623 వాహనాలకు, ఎగుమతులు 1,69,922 నుంచి 1,94,614 వాహనాలకు పెరిగాయి. ఈ తొమ్మిది నెలల వ్యవధిలో నికర లాభం వార్షిక ప్రాతిపదికన రెండు రెట్లు పెరిగి రూ.5,425.6 కోట్లకు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.