'80'ని తాకిన రూపాయి.. 2014 తర్వాత 25% పతనం.. వారి కంటే బెటరే అన్న నిర్మల
Published: Jul 18, 2022, 8:13 PM


'80'ని తాకిన రూపాయి.. 2014 తర్వాత 25% పతనం.. వారి కంటే బెటరే అన్న నిర్మల
Published: Jul 18, 2022, 8:13 PM
Rupee Value: రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. శుక్రవారం కాస్త కోలుకున్న రూపాయి.. సోమవారం ఇంట్రాడేలో 80 మార్క్‌ను తాకింది. అనంతరం 15 పైసలు బలహీనపడి 79.98 వద్ద ముగిసింది. 2014 డిసెంబరు 31 నుంచి ఇప్పటివరకు రూపాయి విలువ 25 శాతం క్షీణించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో తెలిపారు. అయితే బ్రిటిష్ పౌండ్, జపనీస్ యెన్, యూరో కరెన్సీలు మాత్రం రూపాయి కంటే మరింత ఎక్కువగా బలహీనపడ్డాయని చెప్పారు.
Rupee Value: కొన్నిరోజులుగా భారత రూపాయి పతనావస్థలో ఉంది. తొలిసారి రూపాయి విలువ 80 మార్కును దాటింది. దేశచరిత్రలో ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి. సోమవారం రూపాయి విలువ ఇంట్రాడేలో 80ని తాకి.. చివరకు 15 పైసలు నష్టపోయి 79.98 వద్ద ముగిసింది. అయితే రూపాయి మరింతగా క్షీణిస్తుందేమోనన్న చర్చ విశ్లేషకుల్లో కొనసాగుతోంది. సోమవారం మొదలైన లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో రూపాయి విలువ పతనం గురించి వివరించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
దాదాపు 25 శాతం..
భారత రూపాయి విలువ 2014 డిసెంబర్ 31 నుంచి 2022 జులై 30 మధ్య దాదాపు 25 శాతం క్షీణించిందని నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో తెలిపారు. 2014 డిసెంబర్ 31న డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 63.33గా ఉండేదని.. అదే విలువ ఈ ఏడాది జులై 11 నాటికి 79.41కు తగ్గిందని ఆర్‌బీఐ డేటాను విశ్లేషిస్తూ ఆమె రాతపూర్వక సమాధానమిచ్చారు.
"రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినతరం కావడం వంటి గ్లోబల్ కారకాలు.. భారత రూపాయి బలహీనపడటానికి ప్రధాన కారణాలు. విదేశీ పెట్టుబడులు బయటకు తరలిపోవడం కూడా ఇందుకు కారణం. 2022-23లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సుమారు 14 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. అయితే బ్రిటిష్ పౌండ్, జపనీస్ యెన్, యూరో కరెన్సీలు.. రూపాయి కంటే ఎక్కువగా బలహీనపడ్డాయి."
--నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల.. డాలరుతో పోల్చితే రూపాయి సోమవారం 15 పైసలు నష్టపోయి 79.98 వద్ద స్థిరపడింది. క్రూడ్ఆయిల్ ధరల్లో పెరుగుదల, విదేశీ సంస్థాగత నిధులు వెనక్కి మళ్లడం వంటి కారణాల వల్ల రూపాయికి సోమవారం కలిసి రాలేదు. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ వద్ద రూపాయి సోమవారం ఉదయం 79.76 వద్ద మొదలైంది. కానీ ఓ దశలో బలహీనపడి ఇంట్రా డేలో 80ను టచ్ చేసింది. శుక్రవారం డాలరుతో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 17 పైసల మేర పుంజుకుని 79.82 వద్ద ముగిసింది.
ఇవీ చదవండి: మార్కెట్లకు లాభాల పంట.. సెన్సెక్స్ 760 ప్లస్
ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
