మరింత భారంగా విమాన ప్రయాణం.. భారీగా ఛార్జీల పెంపు!

author img

By

Published : Jun 21, 2022, 9:08 AM IST

flight charges hike

ATF price increase: విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర బాగా పెరిగినందున పరిమితులు సవరించాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ఈ నెలాఖరుకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ATF price increase: 2019 జూన్‌లో (కరోనా పరిణామాలకు ముందు) దిల్లీ నుంచి ముంబయికి ఒక వైపు ప్రయాణానికి విమాన టికెట్‌ సగటు ధర రూ.2,300- 2,500.. 2021 జూన్‌లో ఇది రూ.3,500- 3,800కి చేరింది. ప్రస్తుతం రూ.4,700- 5,000 అవుతోంది. అంటే సగటు టికెట్‌ ధర దాదాపు రెట్టింపు అయ్యింది. 2021 జనవరిలో కిలోలీటరు విమాన ఇంధన ధర రూ.40,783 కాగా.. 2022 జనవరిలో రూ.79,000కు, జూన్‌ 16 నాటికి రూ.1,41,232.87కు చేరింది.

విమాన టికెట్ల ధరలకు రెక్కలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర ఆరు నెలల్లోనే దాదాపు రెట్టింపు అయిన నేపథ్యంలో, దేశీయ విమాన మార్గాల ఛార్జీలపై కొవిడ్‌ సమయంలో విధించిన పరిమితులను తొలగించాల్సిందిగా కొన్ని విమానయాన సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను ఇతర సంస్థలు వ్యతిరేకిస్తే, ఛార్జీల కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించొచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ఈవారంలోనే విమానయాన సంస్థల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరపనున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ నెలాఖరు కల్లా టికెట్‌ ధరలపై పరిమితులు పూర్తిగా తొలగిస్తారా? లేదంటే సవరిస్తారా.. అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.

అతి నియంత్రణ సరికాదు: టికెట్‌ ధరలపై పరిమితులను తొలగించే అంశాన్ని పరిశీలించాలని ఇండిగో, విస్తారా ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విమానయాన సంస్థల మొత్తం వ్యయాల్లో 40 శాతం వాటా కలిగిన విమాన ఇంధన ధర విపరీతంగా పెరుగుతున్నందున, టికెట్‌ ధరల విషయంలో సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే ఉత్తమ పరిష్కారమని ఆ సంస్థలంటున్నాయి. విమాన ఇంధన ధర బాగా పెరగడం, రూపాయి మారకపు విలువ క్షీణత నేపథ్యంలో, దేశీయ విమాన ప్రయాణ ఛార్జీల పరిమితులను 10-15 శాతం పెంచాలని స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌ సింగ్‌ కోరుతున్నారు. గోఫస్ట్‌ మాత్రం ఛార్జీలపై పరిమితి తొలగింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. విమానయాన సంస్థల మనుగడకు కనిష్ఠ పరిమితి దోహద పడుతోందని, ప్రయాణికులు దోపిడీకి గురికాకుండా గరిష్ఠ పరిమితి ఉపకరిస్తోందని చెబుతోంది. అతి నియంత్రణ సరికాదనే అభిప్రాయాన్ని కొన్ని విమానయాన సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.

భారం తప్పదా: ప్రస్తుతం దేశీయ మార్గాల్లో విమాన టికెట్‌ ధరలు కొవిడ్‌-19 ముందు స్థాయిలతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గరిష్ఠ పరిమితులను పెంచితే, ప్రయాణికులపై మరింత భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 'విమానయాన రంగంలో కొన్ని సంస్థలే గుత్తాధిపత్యం వహించకుండా చూడటమే కాదు.. ప్రయాణికుల ప్రయోజనాలను పరిరక్షించడమూ ప్రభుత్వ బాధ్యత. అసాధారణ రీతిలో ఛార్జీలు పెరగకుండా చూడాల్సి ఉంటుంద'ని ప్రభుత్వ ఉన్నతాధికారి పేర్కొన్నారు. జనవరితో పోలిస్తే ఏటీఎఫ్‌ ధర దాదాపు రెట్టింపైనందున, ప్రయాణికులతో పాటు విమానయాన సంస్థల ప్రయోజనాలనూ కాపాడాలనే కోరుకుంటానని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పరిశ్రమకు మేలు చేకూరేలా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.

నష్టాలు బాగా తగ్గుతాయ్‌: ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థల నష్టాలు ఈ ఏడాది గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) డైరెక్టర్‌ జనరల్‌ విల్లీ వాల్ష్‌ అన్నారు. 2021లో సంస్థల మొత్తం నష్టాలు 52 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2022లో 9.7 బిలియన్‌ డాలర్లకు పరిమితం అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.ఐఏటీఏ 78వ ఏజీఏంలో వాల్ష్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ అంతర్జాతీయంగా విమానయాన పరిశ్రమ భవిత సానుకూలంగానే కన్పిస్తున్నప్పటికీ, వ్యాపార నిర్వహణకు ఇప్పటికీ సవాళ్లు కొనసాగుతున్నాయని అన్నారు.

ప్రాంతీయ సర్వీసుల్లోనూ పెంపు: తొలుత ప్రాంతీయ మార్గాల్లో ఛార్జీల పెంపు చోటుచేసుకోవచ్చని భావిస్తున్నారు. విమాన ఇంధన ధరలు తగ్గుముఖం పట్టకపోతే రాబోయే రెండు నెలల్లో దేశీయ ప్రధాన మార్గాల్లో ఛార్జీలు 5-10% పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్టు చివరినాటికి ప్రాంతీయ మార్గాల్లో టికెట్‌ ధరలు 20-25% పెరగొచ్చని భావిస్తున్నారు.

పరిమితులు ఎందుకంటే..: దేశీయ విమాన ఛార్జీలకు కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను 2020 మే 25న ప్రభుత్వం విధించింది. కొవిడ్‌ ఆంక్షల కారణంగా ఆర్థికంగా కుదేలైన విమానయాన సంస్థలకు తోడ్పాటు అందించేలా కనిష్ఠ ఛార్జీ పరిమితిని, అధిక డిమాండు కారణంగా ప్రయాణికుల నుంచి మరీ ఎక్కువ ఛార్జీ వసూలు చేయకుండా చూసేందుకు గరిష్ఠ పరిమితిని విధించింది.
ఇదీ చదవండి: దిగివస్తున్న వంటనూనెల ధరలు.. రెండేళ్లలో తొలిసారి తగ్గుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.