2023 మార్చిలోపు అమరరాజా వ్యాపారాల విలీనం.. 2025కల్లా రూ.3వేల కోట్ల టర్నోవర్

author img

By

Published : Sep 19, 2022, 7:34 AM IST

Updated : Sep 19, 2022, 7:47 AM IST

amara raja

విద్యుత్‌ వాహన రంగంలో ప్రముఖ బ్యాటరీ సంస్థ అమరరాజా భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ విక్రమాదిత్య గౌరినేని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అమరరాజా పవర్‌ సిస్టమ్స్‌, అమరరాజా ఇన్‌ఫ్రాల విలీనం చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వీటి టర్నోవర్‌ను రూ.1,200 కోట్ల నుంచి 2025 కల్లా రూ.3,000 కోట్లకు చేర్చాలని లక్ష్యం విధించుకున్నట్లు పేర్కొన్నారు.

అమరరాజా గ్రూప్‌ విద్యుత్‌ వాహన రంగంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. 1.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10,000 కోట్ల) అమరరాజా గ్రూప్‌, లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీలపై రూ.7,000 కోట్లను వెచ్చించబోతోంది. సంప్రదాయ లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీలను తయారు చేస్తున్న ఈ గ్రూప్‌, వాహన బ్యాటరీల తయారీలో దేశంలోనే రెండో అతిపెద్ద సంస్థగా ఉంది. ఇప్పుడు విద్యుత్‌ వాహన రంగం, పునరుత్పాదక ఇంధన విపణులు, విద్యుత్తు నిల్వ వ్యవస్థలపై అధికంగా దృష్టి పెట్టబోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మౌలిక వసతులు, పవర్‌ సిస్టమ్స్‌ వ్యాపారాన్ని విలీనం చేసే అవకాశం ఉందని అమరరాజా బ్యాటరీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, అమరరాజా పవర్‌ సిస్టమ్స్‌ ఎండీ విక్రమాదిత్య గౌరినేని వెల్లడించారు. వీటి టర్నోవర్‌ను ప్రస్తుత రూ.1,200 కోట్ల నుంచి 2025 కల్లా రూ.3,000 కోట్లకు చేర్చాలని లక్ష్యం విధించుకున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్తు వాహనాలతో పాటు విద్యుత్తు నిల్వ వంటి ఇతర రంగాలకూ బ్యాటరీ ప్యాక్‌లు అందించాలన్నది తమ లక్ష్యంగా వివరించారు.

ఇప్పటికే వాహన తయారీదార్లకు బ్యాటరీసెల్స్‌
తిరుపతిలో తమకు పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రం ఉందని పేర్కొన్నారు. బ్యాటరీ స్వాపింగ్‌, ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించేందుకు వీలుగా భవిష్యత్‌ వ్యాపార వృద్ధికి అనుగుణంగా సాంకేతికంగా ఉన్నతమైన పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ బృందాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దేశంలో విద్యుత్‌ త్రిచక్ర వాహనాలు తయారు చేస్తున్న కొన్ని సంస్థలకు, ఇప్పటికే సెల్స్‌ను అమరరాజా గ్రూప్‌ దిగుమతుల ద్వారా అందజేస్తోందని వివరించారు.

రైల్వే వ్యాపారం నుంచే 20 శాతం
గ్రూప్‌ పునర్నిర్మాణంలో భాగంగా అమరరాజా పవర్‌ సిస్టమ్స్‌, అమరరాజా ఇన్‌ఫ్రాల విలీనం ఈ ఆర్థిక సంవత్సరం చివరకు ముగుస్తుందన్నారు. ఇందుకు వాటాదార్లు, బ్యాంకర్ల నుంచి అనుమతి పొందామని, ఎన్‌సీఎల్‌టీ నుంచి ఈ ఏడాది ఆఖరుకు అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నామని విక్రమాదిత్య తెలిపారు. ఈ విభాగంలో వృద్ధికి ప్రధానంగా రైల్వేస్‌ వ్యాపారం దోహదం చేస్తుందని తెలిపారు. ఇందులో విద్యుదీకరణ, సిగ్నలింగ్‌, టెలికాం, పునరుత్పాదక ఇంధనం, డేటా కేంద్రాల వ్యాపారాలుంటాయని వివరించారు. 2025-26కు తమ లక్ష్యమైన రూ.3,000 కోట్ల టర్నోవర్‌లో రైల్వేల వాటానే సుమారు 20 శాతం ఉండే అవకాశం ఉందన్నారు. సౌర విభాగంలోనూ భారీ అవకాశాలుంటాయని విక్రమాదిత్య వివరించారు. పునరుత్పాదక రంగంలో 700 మెగావాట్‌ సౌర యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 500 మెగావాట్‌ యూనిట్లు ఏర్పాటవుతుండగా, 200 మెగావాట్‌ ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హరిత హైడ్రోజన్‌పైనా దృష్టి
వాహన, పారిశ్రామిక రంగాల్లో హరిత హైడ్రోజన్‌ వినియోగంపైనా అమరరాజా పవర్‌ సిస్టమ్స్‌ దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. దేశంలోనే తొలి హరిత హైడ్రోజన్‌ ఇంధన బంక్‌ను సముద్రమట్టానికి 3,600 మీటర్ల ఎత్తులో, లేహ్‌లో ఏర్పాటు చేసేందుకు ఎన్‌టీపీసీ నుంచి కాంట్రాక్ట్‌ దక్కించుకున్నట్లు తెలిపారు. పారిశ్రామిక రంగంలో ఉక్కు, సిమెంట్‌, ఎరువుల తయారీలో హైడ్రోజన్‌ను విరివిగా వినియోగించే అవకాశం ఉందని విక్రమాదిత్య వెల్లడించారు.

ఇవీ చదవండి: 'క్రెడిట్‌ కార్డ్' vs 'బయ్ నౌ పే లేటర్'.. రెండింట్లో ఏది బెటర్?

టర్మ్ పాలసీలకు రక్షణగా 'రైడర్లు'

Last Updated :Sep 19, 2022, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.