Demat Account: డీమ్యాట్‌ ఖాతా​ తెరిచే ముందు ఇవి తెలుసుకోండి..

author img

By

Published : Sep 24, 2021, 1:15 PM IST

Demat Account

స్టాక్‌ మార్కెట్ల(stock markets) సూచీలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఎంతో మంది షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా స్టాక్‌ మార్కెట్‌లోకి వస్తున్న కొత్త మదుపరుల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. మార్కెట్లో మదుపు చేయాలంటే తొలి అడుగు డీమ్యాట్‌ ఖాతాతోనే(Demat Account) ప్రారంభం అవుతుంది. ఎంతో ముఖ్యమైన ఈ ఖాతాను ఎలా ప్రారంభించాలి? పెట్టుబడి ఎలా పెట్టాలి? అనే సంగతులు తెలుసుకుందామా!

ఏడాది కాలంలో బీఎస్‌ఈలో డీమ్యాట్‌ ఖాతాలు(Demat Account) ప్రారంభించిన వారి సంఖ్య దాదాపు రెండు కోట్లపై మాటే. తాజా గణాంకాల ప్రకారం చూస్తే.. జూన్‌ 6 నుంచి సెప్టెంబరు 21 వరకూ 107 రోజుల కాలంలో కోటికి పైగా కొత్త డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభం అయ్యాయి. మొత్తం పెట్టుబడిదారుల సంఖ్యా దాదాపు 8 కోట్లకు పైమాటే. కరోనా మహమ్మారి(Corona virus) పరిణామాల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌లో(Stock markets) పెట్టుబడులపై ప్రజల ఆసక్తి ఇక్కడ స్పష్టమవుతోంది. మరోవైపు ఎన్నో కొత్త సంస్థలు డీమ్యాట్‌ ఖాతాలను(Demat Account) అందించేందుకు ముందుకు వస్తున్నాయి. వీటన్నింటినీ పరిశీలించి, మనకు సరిపోయే విధంగా డీమ్యాట్‌ ఖాతాను ఎంపిక చేసుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

నమ్మకం ఉండాలి..

దేశ వ్యాప్తంగా విస్తరించి, పెట్టుబడుదారులు అధికంగా విశ్వసించిన సంస్థ నుంచే డీమ్యాట్‌ ఖాతా తీసుకోవడం మంచిది. సంస్థను ఎంచుకునే ముందు దానిపై కాస్త పరిశోధన చేయడం తప్పనిసరి. డిపాజిటరీ పార్టిసిపెంట్‌గా ఎన్నాళ్ల నుంచి ఉంది.. ఎన్ని శాఖలు ఉన్నాయి.. ఇప్పటివరకూ దానితో ఏమైనా సమస్యలు వచ్చాయా?లాంటి విషయాలు తెలుసుకోవాలి. ఇప్పటికే ఖాతా ఉన్నవారిని అడిగి వారి అభిప్రాయాలు తీసుకోవడమూ మంచిదే.

కాగిత రహితంగా..

గతంలో డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించాలంటే.. ఎంతో కాగితం పని ఉండేది(demat account opening procedure). దాదాపు 30-40 సంతకాలు పెట్టాల్సి వచ్చేది. అవసరమైన పత్రాల నకళ్లూ అందించాలి. ఇప్పుడు పద్ధతి మారింది. పూర్తిగా కాగిత రహితంగా డీమ్యాట్‌ క్షణాల్లో అందుబాటులోకి వస్తోంది. చాలామటుకు డిపాజిటరీ పార్టిసిపెంట్లు (డీపీ) ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు స్వీకరించడం(demat account opening online ), అవసరమైన పత్రాలను అక్కడే అప్‌లోడ్‌ చేసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. మీరు కొత్తగా డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించేటప్పుడు ఈ సౌకర్యం ఉందా లేదా చూసుకోండి. ఇ-కేవైసీ నిబంధనలు పూర్తి చేస్తే చాలు. మీ పేరుపై డీమ్యాట్‌ ఖాతా ప్రారంభం అయినట్లే.

అర్థమయ్యేలా..

వెబ్‌సైట్లు, యాప్‌లు.. ఇప్పుడు ఎవరికీ కొత్త కాదు. కానీ, వాటిని ఉపయోగించడంలో సులువుగా ఉందా... మనకు పరీక్షలాగా ఉంటుందా అనేది మాత్రం చూసుకోవాల్సిందే. ముఖ్యంగా ట్రేడింగ్‌ కోసం చూస్తున్నవారు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందే. మీరు చేసిన లావాదేవీలు... క్షణక్షణానికీ మారుతున్న షేర్ల విలువ.. పెట్టుబడుల జాబితా.. ఇలా అన్నీ మీ కళ్లముందే ఉండాలి. అంతేకానీ.. వాటిని వెతికి పట్టుకొని చూడాల్సిన అవసరం రాకూడదు. ఇలాంటి వెసులుబాటు ఉన్న డీపీల దగ్గరే డీమ్యాట్‌ ఖాతాను(Demat Account) ప్రారంభించేందుకు ప్రయత్నించవచ్చు.

ఆర్థిక భాగస్వామిగా..

ఒక సంస్థ దగ్గర మీరు డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలను(Demat Account) ప్రారంభిస్తున్నారంటే.. ఆ సంస్థ మీ ఆర్థిక వ్యవహారాలన్నింటిలోనూ భాగస్వామిగా ఉండాలి. అంటే.. మీరు ఏ ఆర్థిక లావాదేవీ చేయాలన్నా.. అక్కడ వీలుండాలి. కేవలం షేర్లు కొనడం, అమ్మడం ఒకటే అంటే.. అలాంటి సంస్థల దగ్గర ఉన్న డీమ్యాట్‌ ఖాతాతో పెద్దగా లాభం లేనట్లే. మీరు ఎంచుకున్న డీమ్యాట్‌/ట్రేడింగ్‌ ఖాతాల నుంచి షేర్లతో పాటు.. మ్యూచువల్‌ ఫండ్లు.. డెరివేటివ్స్‌, ప్రభుత్వ బాండ్లు, ఎన్‌పీఎస్‌, బంగారంలో పెట్టుబడులు, ఇన్సూరెన్స్‌ ఇలా ఎన్నో ఆర్థిక పెట్టుబడులను ఎంచుకునే వీలుండాలి. అప్పుడే అది మీకు అన్ని విధాలుగా సరిపోయే ఖాతా అని గుర్తుంచుకోండి.

రుసుముల సంగతి..

ఒకప్పటితో పోలిస్తే.. ట్రేడింగ్‌ లావాదేవీలకు ఇప్పుడు రుసుములు(demat account charges ) బాగా తగ్గాయి. కొత్త కొత్త సంస్థల రాకతో.. పోటీ పెరిగింది. ఇవి వసూలు చేస్తున్న రుసుములూ తక్కువగానే ఉంటున్నాయి. లావాదేవీల ఆధారంగా రుసుములు విధించడం ఒక్కటే చూడటం కాదు. వార్షిక నిర్వహణ రుసుముల గురించీ పరిశీలించాలి. ఒక వ్యక్తి.. ఎన్ని డీమ్యాట్‌ ఖాతాలనైనా ప్రారంభించేందుకు వీలుంది. అయితే, ఖాతాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ రుసుముల భారమూ ఎక్కువగా అవుతుందని మర్చిపోవద్దు. ఉమ్మడిగా ఖాతాలను ప్రారంభించే వీలూ ఉంటుంది. మీ అవసరాలను బట్టి, ఒకటి రెండు ఖాతాలకు మించి ఉండకుండా ఉండటమే ఉత్తమం.

నిపుణుల సేవలు..

కొన్ని సంస్థలు రోజువారీ మార్కెట్‌ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటాయి. షేర్ల కొనుగోలు అమ్మకాలపై సూచనలూ, సలహాలూ ఇస్తుంటాయి. ఇవన్నీ నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి. మరికొన్ని సంస్థలు ఇలాంటి సూచనలు ఏవీ ఇవ్వవు. మార్కెట్లో కొత్తగా ప్రవేశిస్తున్నవారు నిపుణుల సేవలు అందుబాటులో ఉన్న సంస్థలను ఎంచుకోవడం వల్ల అవగాహన పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం షేర్లను ఎంచుకునేటప్పుడు ఇది అవసరం కూడా. అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించేందుకు తగిన సిబ్బంది ఉన్నారా అనేదీ డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించేటప్పుడు చూడాల్సిన ముఖ్యమైన అంశం.

రక్షణ ఉందా?

ప్పుడంతా డిజిటల్‌దే హవా. ఇప్పుడు ఎన్నో సంస్థలు పూర్తిగా డిజిటల్‌ ఆధారంగానే డీమ్యాట్‌ ఖాతాలను ప్రారంభించేందుకు వీలు కల్పిస్తున్నాయి. ఎక్కడా భౌతిక శాఖలు ఉండవు. అంతా వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ఆధారితమే. ఇలాంటి సంస్థలను ఎంచుకునేటప్పుడు మదుపరులు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇందులోనూ కాస్త పేరున్న సంస్థల దగ్గరే ఖాతాను ప్రారంభించేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా సైబర్‌ నేరాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మన కష్టార్జితం మోసగాళ్ల జేబులోకి వెళ్లిపోతుంది.

ఇదీ చూడండి: Free DEMAT: ఉచిత డీమ్యాట్​ ఆఫర్​లో నిజమెంత?

Personal Finance: సంపద సృష్టికి.. అడ్డంకులివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.