జీవితకాల గరిష్ఠం నుంచి బిట్‌కాయిన్‌ 40 శాతం పతనం

author img

By

Published : Jan 7, 2022, 8:29 PM IST

Bitcoin price falls

Bitcoin price falls: ప్రముఖ క్రిప్టోకరెన్సీల విలువ గతకొన్ని రోజులుగా భారీగా పడిపోతున్నాయి. తాజాగా బిట్‌కాయిన్‌ జీవితకాల గరిష్టం నుంచి ఏకంగా 40 శాతం కిందకు వచ్చింది. ఫెడ్‌ నిర్ణయాలు, స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు క్రిప్టో కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయి.

Bitcoin price falls: ప్రముఖ క్రిప్టోకరెన్సీల విలువ గతకొన్ని రోజులుగా భారీగా పడిపోయింది. ముఖ్యంగా బిట్‌కాయిన్‌ జీవితకాల గరిష్ఠం నుంచి ఏకంగా 40 శాతం కిందకు వచ్చింది. ఫెడ్‌ నిర్ణయాలు, స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు క్రిప్టో కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయి.

శుక్రవారం ఒక్కరోజే కాయిన్‌ విలువ ఓ దశలో 4.9 శాతం మేర కుంగి 41,008 డాలర్ల వద్దకు చేరింది. గతేడాది నవంబరులో నమోదైన 69,000 డాలర్ల జీవితకాల గరిష్ఠంతో పోలిస్తే ఇది 40 శాతం తక్కువ. ఇక రెండో అతిపెద్ద క్రిప్టో అయిన ఈథర్ విలువ 9 శాతం పడిపోయింది. బైనాన్స్ కాయిన్‌, సొలానా, కార్డనో, ఎక్స్‌ఆర్‌పీ సైతం గత ఏడు రోజుల్లో 10 శాతానికి పైగా కుంగాయి.

వడ్డీ రేట్ల పెంపు ఊహించిన దాని కంటే వేగంగా ఉండొచ్చని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ మినిట్స్‌లో వెల్లడవ్వడం తాజాగా క్రిప్టో కరెన్సీ పతనానికి దోహదం చేసింది. క్రిప్టో కరెన్సీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగడం, వివిధ దేశాల్లో దీనికి చట్టబద్ధత లభించే అవకాశం ఉందన్న అంచనాలు, ద్రవ్యోల్బణ నుంచి రక్షణ, మదుపర్ల పోర్ట్‌ఫోలియోకు క్రిప్టోను కూడా జత చేయడం వంటి పరిణామాలతో బిట్‌కాయిన్‌ విలువ గత ఏడాది 60 శాతం మేర పెరిగింది. వీటిలో కొన్ని అంశాల్లో ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతుండడంతో తాజా కొనుగోళ్లకు మద్దతు లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే క్రిప్టోల విలువ క్రమంగా పడిపోతున్నట్లు నిపుణులు తెలిపారు.

మరోవైపు చైనాలో టెక్ సంస్థలపై ఆంక్షల తర్వాత కజఖ్‌స్థాన్‌లో క్రిప్టో మైనింగ్‌ ఊపందుకుంది. ప్రస్తుతం అక్కడ పెట్రో ధరల పెంపు నేపథ్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇది కూడా బిట్‌కాయిన్‌ విలువ పతనానికి తక్షణ కారణంగా నిలుస్తోంది.

ఇదీ చూడండి: '2021-22లో భారత వృద్ధి రేటు 9.2 శాతం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.