కామన్వెల్త్​ క్రికెట్​ ఫైనల్లో భారత్​ మహిళా జట్టు.. పతకం ఖాయం

author img

By

Published : Aug 6, 2022, 6:44 PM IST

Updated : Aug 6, 2022, 7:06 PM IST

Commonwealth Games Womens Cricket India Enterss into the CWG 2022 final

18:42 August 06

కామన్వెల్త్​ క్రికెట్​ ఫైనల్లో భారత్​ మహిళా జట్టు.. పతకం ఖాయం

కామన్వెల్‌లో తొలిసారి జరుగుతున్న మహిళల క్రికెట్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 160/6 స్కోరుకే పరిమితం చేసి నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగు పెట్టింది. దీంతో పతకం ఖాయం చేసుకుంది.

మ్యాచ్​ సాగిందిలా.. 165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ మహిళా జట్టు.. మొదటి ఓవర్‌ నుంచి భారత బౌలర్లపైకి ఎదురుదాడికి దిగింది. 2.4 ఓవర్లలోనే 28 పరుగులు చేశారు ఇంగ్లాండ్ ఓపెనర్లు. 10 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసిన సోఫియా డుంక్లేని.. దీప్తి శర్మ ఎల్బీడబ్ల్యూగా ఔట్​ చేసింది. ఆ తర్వాత 8 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన అలీస్ కాప్సీ రనౌట్ అయ్యింది. 27 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసిన డానియల్ వ్యాట్‌ను స్నేహ్ రాణా క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ క్రమంలోనే 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే అమీ జోన్స్, కెప్టెన్ నటలియా సివర్ కలిసి ఇంగ్లాండ్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. 24 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసిన అమీ జోన్స్ రనౌట్ కాగా 43 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ సివర్ కూడా రనౌట్‌ రూపంలోనే పెవిలియన్ చేరింది. ఒకానొక దశలో ఇంగ్లాండ్ విజయానికి 48 బంతుల్లో 68 పరుగులు కావాల్సి రావడం, చేతిలో 7 వికెట్లు ఉండడంతో ఈజీగా గెలుస్తారని అనిపించింది. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్‌ను భారీ షాట్లు ఆడకుండా నిలువరించిన భారత బౌలర్ దీప్తి శర్మ, మ్యాచ్‌ను 18 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన స్థితికి తీసుకొచ్చింది. ఈ దశలో 18వ ఓవర్ వేసిన స్నేహ్ రాణా 3 పరుగులే ఇవ్వడం, ఆ తర్వాతి ఓవర్‌లో 13 పరుగులు వచ్చినా ఇంగ్లాండ్ కెప్టెన్ సివర్ రనౌట్ కావడంతో ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్ విజయానికి 14 పరుగులు కావాల్సి వచ్చాయి. 20వ ఓవర్ వేసిన స్నేహ్ రాణా మొదటి బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. రెండో బంతికి సింగిల్ రాగా, మూడో బంతికి బ్రూంట్ డకౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ విజయానికి ఆఖరి 3 బంతుల్లో 13 పరుగులు కావాల్సి రాగా ఎక్లేస్టోన్ ఇచ్చిన క్యాచ్‌ను హర్లీన్ జారవిడిచింది. దీంతో ఇంగ్లాండ్‌కి ఓ పరుగు వచ్చింది. ఐదో బంతికి సింగిల్ రావడంతో భారత జట్టు విజయం ఖరారైపోయింది. ఆఖరి బంతికి సిక్సర్ బాదినా 4 పరుగుల తేడాతో విజయం అందుకున్న భారత మహిళా జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది.

అంతకుముందు భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్‌ మంధానతో కలిసి షఫాలీ వర్మ (15) తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించింది. వేగంగా ఆడే క్రమంలో ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌కౌర్ (20) ఫర్వాలేదనిపించింది. అయితే భారత్ ఇంత స్కోరు సాధించడానికి జెమీమా రోడ్రిగ్స్ (44*) ప్రధాన కారణం. ఓవైపు వికెట్లు పడినా ఆఖరి వరకు క్రీజ్‌లో ఉండి దూకుడుగా ఆడింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో కెంప్‌ 2.. స్కివెర్‌, బ్రంట్ చెరో వికెట్ తీశారు.

ఇదీ చూడండి: బంగ్లా టైగర్స్‌పై విరుచుకుపడుతున్న జింబాబ్వే.. 9 ఏళ్ల తర్వాత తొలిసారి

Last Updated :Aug 6, 2022, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.