'సరైన దిశలోనే డ్రగ్స్​పై పోరు.. అప్పటివరకు తగ్గేదేలే'

author img

By

Published : Jul 30, 2022, 5:49 PM IST

home-minister-amit-shah

Drugs Amit Shah: దేశంలో ఇటీవల పట్టుబడిన 31 వేల కిలోల మాదకద్రవ్యాలను నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగింది. మాదకద్రవ్యాలు చెద పురుగులా మారి యువతను తినేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన అమిత్‌ షా.. డ్రగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్‌ విధానాన్ని అవలంబిస్తోందని స్పష్టం చేశారు.

'సరైన దిశలోనే డ్రగ్స్​పై పోరు.. అప్పటివరకు తగ్గేదేలే'

Amit Shah on Drugs: దేశంలో మాదకద్రవ్యాలపై పోరాటం సరైన దిశలో సాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. మాదకద్రవ్యాలను పూర్తిగా అంతమొందించే వరకూ ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పంజాబ్‌ చంఢీగడ్‌లో మాదక ద్రవ్యాల రవాణా- జాతీయ భద్రతపై నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సును అమిత్‌ షా ప్రారంభించారు. అనంతరం దిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్​సీబీ స్వాధీనం చేసుకున్న సుమారు 31 వేల కిలోలకుపైగా మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు.

Drugs destroyed India: ఆరోగ్యవంతమైన సమాజం, సుసంపన్నమైన దేశం లక్ష్యాన్ని చేరుకోవాలంటే డ్రగ్స్‌ ఉనికి ఉండకూడదని అమిత్‌ షా స్పష్టం చేశారు. డ్రగ్స్‌ అక్రమ వ్యాపారం వల్ల వచ్చే డబ్బును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడే డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయం తీసుకున్నామని షా తెలిపారు. డ్రగ్స్‌పై పోరాటం వేగంగా, సరైన దిశలో పురోగమిస్తూ ఫలితాలను చూపించడం ప్రారంభించిందని షా తెలిపారు.

"మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌, వాటి రవాణా ఏ సమాజంపైనైనా దుష్ప్రభావం చూపుతాయి. ఎప్పుడైతే డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ జరిగి, అవి సమాజంలోకి వెళ్తాయో... అప్పుడు పీడితుల సంఖ్య పెరుగుతుంది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు వెళ్తేనే మన ఉద్దేశాలు నెరవేరుతాయి. డ్రగ్స్‌ వల్ల డర్టీ మనీ చలామణి అవుతుంది. ఆ డర్టీ మనీ భారత ప్రభుత్వ వ్యతిరేకులకు చేరుతోంది. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌, రవాణాను అడ్డుకుంటే రాబోయే తరాలను కాపాడుకోవచ్చు. డర్టీ మనీని దేశానికి వ్యతిరేకంగా వినియోగించుకుండా దేశాన్ని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చు."
-అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

డ్రగ్స్ యువతపై దుష్ప్రభావాలు చూపుతున్నాయని అమిత్‌ షా తెలిపారు. కేవలం వినియోగించే వారిపైనే కాకుండా సమాజం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రతపైనా డ్రగ్స్ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు. సమాజానికి చీడలా మారిన ఈ కలుపును పూర్తిగా తొలగించాల్సిందేనని అమిత్‌ షా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.