'బెంగళూరులో రెండు ఒమిక్రాన్‌ కేసులు.. మరో ఐదుగురికి..'

author img

By

Published : Dec 2, 2021, 4:33 PM IST

Updated : Dec 2, 2021, 8:43 PM IST

Omicron Variant

16:30 December 02

భారత్​లో ఒమిక్రాన్‌ కేసులు గుర్తింపు: కేంద్రం

Omicron Variant in India: ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కొవిడ్​ కొత్త వేరియంట్​ 'ఒమిక్రాన్'​ భారత్​లోకి ప్రవేశించింది. కర్ణాటక బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన వారిలో ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​. వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లని తెలిపారు. అయితే, గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారి పేర్లను వెల్లడించడం లేదని అన్నారు. వీరిద్దరికీ తొలుత కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ కావడం వల్ల ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేశామని, వారిద్దరిలో ఒమిక్రాన్‌ ఉన్నట్టు ఇన్‌సాకాగ్ నిర్ధరించినట్లు వెల్లడించారు. బాధితుల్లో తీవ్ర లక్షణాలు కనిపించలేదని తెలిపారు.

" ఇతర వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్​ ఐదు రెట్లు వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో 373 కేసులు వచ్చాయి. పరిస్థితులను భారత్​ నిశితంగా పరిశీలిస్తోంది. ఒమిక్రాన్​ ఇతర వేరియంట్ల కంటే తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనాకు రావటం తొందరపాటు అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అదే చెబుతోంది. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం.. 37 ప్రయోగశాలలు ఏర్పాటు చేశాం. ఒమిక్రాన్‌ ఉన్న దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్‌ తప్పనిసరి నిబంధనలు ఉన్నాయి."

- లవ్​ అగర్వాల్​, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి.

ఆందోళన అవసరం లేదు..

వైరస్​ నిర్ధరణ అయిన ఇద్దరు వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు లవ్​ అగర్వాల్​. భారత్​లో కేసులు వచ్చినప్పటికీ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అలాగే, కొవిడ్​ జాగ్రత్తలు పాటించాలని, ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రస్తుత సమయంలో కొవిడ్​-19 వ్యాక్సినేషన్​ను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

గత వారం ప్రపంచ కేసుల్లో ఆగ్నేయాసియా దేశాల్లో కేవలం 3.1 శాతం కేసులు వచ్చాయని, దేశంలో 84.3 శాతం పెద్దలు తొలి డోసు తీసుకోగా.. 49 శాతం మంది రెండో డోసు తీసుకున్నారని తెలిపారు అగర్వాల్​. కేరళ, మహారాష్ట్రల్లో 10వేలు, తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వెయ్యి నుంచి 10వేల యాక్టివ్​ కేసులు ఉన్నాయని వెల్లడించారు.

ఆ ఐదుగురికి కొవిడ్​- ఒమిక్రానేనా?

Omicron cases Bangalore: కర్ణాటకలో వెలుగు చూసిన రెండు ఒమిక్రాన్ కేసుల్లో ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా దేశస్థుడని, మరొక వ్యక్తి ప్రభుత్వ వైద్యుడని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. దక్షిణాఫ్రియా వ్యక్తికి 66 ఏళ్లుకాగా, కర్ణాటక ప్రభుత్వ వైద్యుడికి 46 ఏళ్లు. దక్షిణాఫ్రికా దేశస్థుడు కోలుకున్న తర్వాత తిరిగి వెళ్లిపోయినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. ఆఫ్రికా దేశస్థుడితో సన్నిహితంగా మెలిగిన.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు పరీక్షలు జరపగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు.

రెండో బాధితుడు ప్రభుత్వ వైద్యుడన్న కర్ణాటక ప్రభుత్వం.. జ్వరం, ఒళ్లునొప్పులతో ఆయన పరీక్షలకు వచ్చినట్లు తెలిపింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలగా సీటీ వ్యాల్యూస్ తక్కువగా ఉండటం గమనించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు పేర్కొంది. ఆ వైద్యుడికి ఒమిక్రాన్‌ సోకినట్లు తేలిందని కర్ణాటక ఆరోగ్య మంత్రి వెల్లడించారు. బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు జరపగా.. ముగ్గురు ప్రైమరీ కాంటాక్టులు, ఇద్దరు సెకండరీ కాంటాక్టులకు కొవిడ్ సోకినట్లు వివరించారు. ఈ ఆరుగురిని ఐసోలేషన్‌లో ఉంచామన్న కర్ణాటక ఆరోగ్య మంత్రి వారందరూ రెండు డోసుల టీకా తీసుకున్నవారేనని వెల్లడించారు. ప్రస్తుతానికి వారిలో ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేవని వెల్లడించారు.

29 దేశాల్లో ఒమిక్రాన్​ కేసులు..

దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా... బోట్స్‌వానాలో 19, నెదర్లాండ్స్‌ లో 16 కేసులు వెలుగుచూసినట్లు వివరించారు లవ్​ అగర్వాల్​. హాంగ్‌కాంగ్‌ 7, ఇజ్రాయిల్‌ 2, బెల్జియం 2, యూకే 32, జర్మనీ 10, ఆస్ట్రేలియా 8, ఇటలీ 4, డెన్మార్క్‌ 6, ఆస్ట్రియా 4, కెనడా 7, స్వీడెన్‌ 4, స్విట్జర్లాండ్‌ 3, స్పెయిన్‌ 2, పోర్చుగల్‌ 13, జపాన్‌ 2, ఫ్రాన్స్‌ 1, ఘనా 33, దక్షిణ కొరియా 3, నైజీరియా 3, బ్రెజిల్‌ 2, నార్వే 2, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్‌ యూఏఈలలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు వివరించారు.

ఎయిర్​పోర్ట్​, పోర్ట్​ అధికారులతో ఆరోగ్య మంత్రి భేటీ

ఒమిక్రాన్​ ఆందోళనల నేపథ్యంలో దేశంలోకి ప్రవేశించే అన్ని పాయింట్ల వద్ద నిఘా, స్క్రీనింగ్​ అంశాలపై చర్చించేందుకు విమానాశ్రయాలు, పోర్టుల్లోని ఆరోగ్య శాఖ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుఖ్​ మాండవియా. దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల అంశంపై ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. ఎట్​ రిస్క్​ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తొలి రోజు, ప్రత్యేక కేటగిరీ ప్రయాణికులకు 8వ రోజు కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయాలని నొక్కి చెప్పారు.

Last Updated :Dec 2, 2021, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.