TSPSC పేపర్ లీకేజ్.... గ్రూప్‌-1 ప్రిలిమ్స్ సహా ఆ పరీక్షలు రద్దు

author img

By

Published : Mar 17, 2023, 2:28 PM IST

Updated : Mar 18, 2023, 6:12 AM IST

TSPSC Canceled Group-1 Prelims Exam

TSPSC Paper Leak Case Latest Updates: గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు మరో రెండు పరీక్షలు రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్-1, ఏఈఈ, డీఏఓ ప్రశ్నాపత్రాలు లీకైనట్లు గుర్తించి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సిట్ అధికారులు అందించిన నివేదికను ఆధారంగా చేసుకొని కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా సిట్ అధికారులు పలు పరీక్షల పత్రాలు లీకైనట్లు గుర్తించారు. సిట్ నివేదికతో పాటు టీఎస్‌పీఎస్సీ అంతర్గత విచారణలోనూ ఇదే తేలింది. దీంతో ఇప్పటికే నిర్వహించిన మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

TSPSC Paper Leak Case Latest Updates: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కేవలం ఏఈ ప్రశ్నాపత్రమే లీకైనట్లు.. టీఎస్‌పీఎస్సీ అధికారులు మొదట భావించినప్పటికి.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈఈ, డీఏఓ పరీక్షా పత్రాలు కూడా బయటికి వెళ్లినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. గత ఏడాది అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్, జనవరి 22న నిర్వహించిన ఏఈఈ, ఫ్రిబ్రవరి 26న నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ అధికారి పరీక్షా పత్రాలు లీకైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఆ మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి జూన్ 11న నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది. మిగతా పరీక్షా తేదీలకు సంబంధించి త్వరలో వివరాలు వెల్లడించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. మార్చి 5న నిర్వహించిన ఏఈ పరీక్షా పత్రం కూడా లీకైనట్లు తేలడంతో ఇది వరకే.. ఈ పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్,.. 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరి అసిస్టెంట్ ఉద్యోగాలకు పరీక్ష జరగక ముందే వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 11న టీఎస్‌పీఎస్సీ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం 26 నోటిఫికేషన్లు జారీ: టీఎస్‌పీఎస్సీ గతేడాది నుంచి ఇప్పటి వరకు మొత్తం 26 నోటిఫికేషన్లు జారీ చేశారు. 41 కేటగిరిల్లో 23,000 ఉద్యోగాలకు సంబంధించి 26 నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇందులో ఇప్పటికే 7 పరీక్షలను నిర్వహించారు. గ్రూప్- 1 ప్రిలిమ్స్‌తో పాటు, ఏఈఈ, డీఏఓ, ఏఈ, ఫుడ్ ఇన్స్ పెక్టర్,.. మహిళ, శిశు సంక్షేమ శాఖలోని సీడీపీఓ, గ్రేడ్-1 సూపర్‌వైజర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఇప్పటికే నాలుగింటిని రద్దు చేశారు.

ఈ క్రమంలోనే నిర్వహించాల్సిన పరీక్షల్లో టౌన్ ప్లానింగ్, వెటర్నరి అసిస్టెంట్ పరీక్షల తేదీలను వాయిదా వేశారు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సైతం లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ చివరి వారంలో జరిగే ఈ పరీక్షలను సైతం వాయిదా వేసే అవకాశం ఉంది. ఇక మీదట జరిగే ప్రశ్నా పత్రాలన్నింటిని మార్పు చేసి పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి ఇప్పటికే చెప్పారు.

నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైనా వాటిని వాయిదా వేసి తిరిగి నూతన ప్రశ్నాపత్రాలు రూపొందించడం వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదు. కానీ ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకవడం వల్ల వాటిని రద్దు చేస్తున్నారు. దీనివల్ల అభ్యర్థులందరూ మరోసారి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇప్పటికే మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు.. రద్దు నిర్ణయం ఇబ్బందికర అంశం అయితే.. ఆశించిన విధంగా పరీక్ష రాయని వాళ్లకు మాత్రం సంతోషం కలిగిస్తోంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి నమ్మిన ఉద్యోగులే గొంతు కోశారని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఇకమీదట నిర్వహించే పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన పరీక్షల వివరాలు
టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన పరీక్షల వివరాలు

ఇవీ చదవండి:

Last Updated :Mar 18, 2023, 6:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.