'ఈ నెలాఖరులో పీక్​ స్టేజ్​కు కరోనా థర్డ్ వేవ్.. మార్చి వరకు...'

author img

By

Published : Jan 10, 2022, 4:00 PM IST

Updated : Jan 10, 2022, 6:07 PM IST

covid cases

Third Wave Covid India: జనవరి చివరి నాటికి వైరస్ కేసులు దేశవ్యాప్తంగా అమాంతం పెరుగుతాయని ఐఐటీ కాన్పుర్​ ప్రొఫెసర్​ మణీంద్ర అగర్వాల్​ తెలిపారు. దిల్లీలో ఈ నెల మధ్యలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని పేర్కొన్నారు. రోజుకు సుమారు 40 వేలకు పైగా కేసులు నమోదు అవుతాయని అంచనా వేశారు.

Third Wave Covid India: జనవరి నెలాఖరులో కరోనా వైరస్​ కేసుల సంఖ్య భారీగా పెరిగి దేశంలో జీవన కాల గరిష్ఠానికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పుర్​ ప్రొఫెసర్​ మణీంద్ర అగర్వాల్​ తెలిపారు. రెండోవేవ్​లో కంటే ఎక్కువ కేసులు ఈ సారి నమోదు అవుతాయని అంచనా వేశారు. ఇదే క్రమంలో మార్చి నాటికి కేసుల సంఖ్య అంతే స్థాయిలో తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.

"ప్రాథమిక అంచనాల ప్రకారం నెలాఖరులో దేశీయంగా కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. రెండో వేవ్​లో నిర్ధరణ అయిన వైరస్​ కేసుల సంఖ్య కంటే ఈ సారి నమోదు అయ్యే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏ స్థాయిలో అయితే కేసులు పెరుగుతాయో.. అదే స్థాయిలో తగ్గుముఖం పడుతాయి. మూడో వేవ్​లో జనవరి చివరి నాటికి కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరి.. మార్చి మూడో వారంలో మూడో వేవ్​ ముగుస్తుందని మా అంచనా."

-మణీంద్ర అగర్వాల్, ఐఐటీ కాన్పుర్​ ప్రొఫెసర్​

ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో రోజుకు 22 వేల కేసులు నమోదు అవుతున్నాయని.. జనవరి రెండో వారం నాటికి వీటి సంఖ్య అమాంతం పెరిగి 40 వేలకు చేరే అవకాశం ఉందని మణీంద్ర అగర్వాల్​ తెలిపారు. అంతేగాకుండా ముంబయి, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ఈ నెల మధ్యలో కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని పేర్కొన్నారు. అయితే ఆయా నగరాల్లో మూడో వేవ్​ ఈ నెలాఖరుతో ముగిసే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభల ద్వారా మాత్రమే వైరస్​ వ్యాప్తి చెందదని మణీంద్ర అగర్వాల్​ తెలిపారు. అలా అనుకుంటే అది భ్రమ మాత్రమే అని అన్నారు. వ్యాప్తికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

COVID CASES IN INDIA

దేశంలో రోజువారీ కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 1,79,723 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 146మంది మృతి చెందారు. 46,569 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: దిల్లీ పోలీసులపై కరోనా పంజా- ఒకేసారి 1000 మందికి వైరస్

Last Updated :Jan 10, 2022, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.